ఆశలన్నీ శ్వాసతోటే (Devotional)
`ఆ ఎదురుగుండా ఇంట్లో కుర్రాడు పోయాడమ్మా` వచ్చీరాగానే ఉద్వేగంగా ఆనాటి ఎజెండాని ప్రవేశపెట్టింది మా పనిమనిషి పద్మ. కంప్యూటర్ ముందు పనిచేసుకుంటున్నవాడినల్లా, నా వినికిడి శక్తినంతా జరుగుతున్న సంవాదం మీదకి మళ్లించాను. మనకి సంబంధించని చావుకబురంటే అందరికీ ఆసక్తే కదా! రెండు రైళ్లు ఢీకొన్నాయంటే, వాటిలో ఎంతమంది చనిపోతే అంత పెద్ద ప్రమాదం అనుకుంటాం. పదికోట్లు నష్టం జరిగింది, కానీ ఒక్క మనిషికి కూడా ఏం కాలేదు అంటే… పెద్దగా స్పందించం. ఆ ఆసక్తికి కారణం సాటిమానవుల […]
Advertisement
'ఆ ఎదురుగుండా ఇంట్లో కుర్రాడు పోయాడమ్మా' వచ్చీరాగానే ఉద్వేగంగా ఆనాటి ఎజెండాని ప్రవేశపెట్టింది మా పనిమనిషి పద్మ. కంప్యూటర్ ముందు పనిచేసుకుంటున్నవాడినల్లా, నా వినికిడి శక్తినంతా జరుగుతున్న సంవాదం మీదకి మళ్లించాను. మనకి సంబంధించని చావుకబురంటే అందరికీ ఆసక్తే కదా! రెండు రైళ్లు ఢీకొన్నాయంటే, వాటిలో ఎంతమంది చనిపోతే అంత పెద్ద ప్రమాదం అనుకుంటాం. పదికోట్లు నష్టం జరిగింది, కానీ ఒక్క మనిషికి కూడా ఏం కాలేదు అంటే… పెద్దగా స్పందించం. ఆ ఆసక్తికి కారణం సాటిమానవుల పట్ల మనలోని కరుణా, కసా అన్నది ఆలోచించడానికి కూడా భయపడతాం. 'పిల్లాడు బొంబాయిలో చదువుకుంటున్నాడు. రైళ్లో వెళ్తూ వెళ్తూ బయట వర్షం పడుతోందో లేదో అని చేయి చెట్టి చూశాడట. అంతే చేయి దేన్నో తట్టుకుంది. పట్టుతప్పి కిందపడి చచ్చిపోయాడు' పద్మ చెప్పడం పూర్తిచేశాక, ఆమెలోని ఉద్వేగం శ్రోతల్లో కూడా ప్రవేశించింది. ఆమె చెప్పేదానిలో కొంత అతిశయోక్తి ఉండవచ్చు, అబద్ధమూ ఉండవచ్చు. కానీ ప్రమాదమూ నిజమే! చనిపోయిందీ నిజమేగా! పద్మ చెప్పిన దాన్ని రూఢిపరుస్తూ ఎదురుగుండా ఇంటి నుంచి ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆకస్మికంగా జరిగే మరణాలు కుటుంబంలో ఎంత వేదనని కలిగిస్తాయో నాకు అనుభవమే. మన అస్తిత్వంలోని భాగమేదో హఠాత్తుగా మాయమైపోయినట్లు తోస్తుంది. ఓదార్పులూ, క్రతువులూ ఆ వేదనని ఏమాత్రం తగ్గించలేవు. ఆ నిజం కాలంతోపాటు క్రమంగా మనలోకి ఇంకిపోవాల్సిందే! కానీ ఆ సాయంత్రం బాల్కనీ దగ్గర నిల్చొని, ఎదురుగుండా ఇంటి దగ్గర తతంగమంతా గమనిస్తున్న నాకు ఒకటే ఆలోచన… జీవితంలో చావు కూడా ఒక co-incidence కదా! అది ఎప్పుడు ఎవరికి సంభవిస్తుందో చెప్పలేం. దానికోసం యుద్ధరంగంలోనో, కరువుకాటకాల మధ్యో ఉండనవసరం లేదు. అలా రోడ్డు మీదకు వెళ్లొస్తే చాలు. But the randomness of death makes life much valuable. చావు ఎంత అనిశ్చితమైందో, శాశ్వతమైనందో తెలిసినప్పుడు జీవితం ఎంత అమూల్యమైందో, అందులో మిగిలి ఉన్న క్షణాలు ఎంత విలువైనవో తెలిసొస్తాయి. మనిషి నాగరికతని సులభతరం (లేదా క్లిష్టతరం) చేసుకుంటూ తన జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవడంలో మునిగిపోయాడు. అడవిలో ఉండే చావు భయం నుంచి అతను తప్పించుకుని చాలా రోజులే అయ్యింది. కాబట్టి జీవితంలో ఉన్న చిన్నాచితకా సమస్యలకే భయపడిపోతున్నాడు. తరం మారే కొద్దీ సమస్యల పట్ల మరింత సున్నితంగా మారిపోతున్నాడు. కానీ చావు ఎంతటివారినైనా, ఎప్పటికైనా వదలదన్న ఎరుక, జీవితాన్ని take it as granted అన్న నిర్లక్ష్యం నుంచి దూరం చేస్తుంది.
కె.ఎల్. సూర్య తన 16వ ఏట మృత్యువు గురించి ఆలోచించిన రమణ మహర్షి తనదైన పంథాని ఎంచుకుంటే, ఇంచుమించు అదే వయసులో 'ఇవాళే కనుక చనిపోవాల్సి వస్తే, ఇలాగే బతుకుతానా?' అన్న ఆలోచనతో స్టీవ్ జాబ్స్ తనకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలను ఏర్పరుచుకున్నాడు. ఏతావాతా నాకు తోచిందేమిటంటే… మనం ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత ధనాన్ని పోగేసినా, ఎన్ని తప్పులు చేసినా ఏ రోజు బతుకు ఆరోజుదే! మనల్ని మనం సరిదిద్దుకునేందుకు, మనం కోరుకునే రీతిలోకి మారేందుకు, కష్టపడేందుకు, సుఖపడేందుకు… ప్రతి రోజూ ఒక కొత్త అవకాశమే! So let’s live forever, as long as we…. live!
– కె.ఎల్. సూర్య
Advertisement