దూరదృష్టి (Devotional)
ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. పట్టణానికి దూరంగా ఉండేది. గ్రామం చుట్టూ మొక్కజొన్న చేలు. పిట్టల కిచకిచలు. ఆ గ్రామస్థులు పంటలు పండించుకుంటూ నాగరిక ప్రపంచానికి దూరంగా నిర్మలమయిన జీవితాన్ని గడిపేవారు. ఒక రోజు ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు. గ్రామస్థులు ఎవరు మీరు? అని అడిగారు. సాధువు “నేనొక సన్యాసిని. మీ గ్రామ ప్రశాంత వాతావరణం నాకు నచ్చింది. కొంతకాలం మీతో బాటు కలిసి ఉందామని వచ్చాను” […]
ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. పట్టణానికి దూరంగా ఉండేది. గ్రామం చుట్టూ మొక్కజొన్న చేలు. పిట్టల కిచకిచలు. ఆ గ్రామస్థులు పంటలు పండించుకుంటూ నాగరిక ప్రపంచానికి దూరంగా నిర్మలమయిన జీవితాన్ని గడిపేవారు.
ఒక రోజు ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు. గ్రామస్థులు ఎవరు మీరు? అని అడిగారు. సాధువు “నేనొక సన్యాసిని. మీ గ్రామ ప్రశాంత వాతావరణం నాకు నచ్చింది. కొంతకాలం మీతో బాటు కలిసి ఉందామని వచ్చాను” అన్నాడు. గ్రామస్థులు ఎంతో సంతోషించి ఆ సాధువుకు ఒక గుడిసె వేసి రోజూ ఆయన బోధనలు వినడానికి వచ్చే వాళ్ళు. సాధువు వాళ్ళకు దైవసంబంధమయిన గాధలు వినిపించేవాడు.
కొంతకాలం ఎట్లాంటి ఆటంకాలు లేకుండా గడిచింది. అయితే ఒకరోజు ఏదో అంటువ్యాధి కారణంగా గ్రామంలోని పిట్టలన్నీ చనిపోయాయి. గ్రామస్థులు ఇది ఏదో అశుభ మనుకుని పరిగెత్తుకుంటూ సాధువు దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. సాధువు ఆ విషయం విని “పక్షులు చనిపోవడం బాధాకరమే కానీ బహుశా దానివల్ల మీకు లాభం జరగవచ్చేమో! భగవంతునిపై భారం వేసి బాధను దిగమింగుకోండి” అన్నాడు.
వాళ్ళు ఆ మాటలకు ఆశ్చర్యపడినా, వాటిని ఆమోదించకున్నా సాధువు పట్ల గౌరవంతో వెళ్ళిపోయారు.
రెండురోజులు గడిచిన తరువాత హఠాత్తుగా గ్రామంలోని కుక్కలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి. మళ్ళీ తిరిగిరాలేదు. గ్రామస్థులకు భయంపట్టుకుంది. ఇన్ని అపశకునాలు కలుగుతున్నాయి. గ్రామానికి ఎట్లాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో అని దిగులుపడ్డారు.
ఎప్పట్లాగే సాధువు దగ్గరకు వచ్చి విషయం వివరించారు.
సాధువు ఎప్పట్లాగే “దిగులు పడకండి. ఇది కూడా మీ మంచికే అనుకోండి” అన్నాడు. గ్రామస్థులు సాధువు ఎందుకింత వింతగా మాట్లాడుతున్నాడు? అని విస్తుపోయారు. మౌనంగా నిష్ర్కమించారు.
వెనకటి రోజుల్లో నిప్పుపుట్టించడానికి రెండు రాళ్ళని రాపిడిపెట్టే వాళ్ళు. ఆ మంటతో కట్టెలు కాల్చి వంట చేసుకునేవాళ్ళు. ఆ గ్రామంలో ఆశ్చర్యంగా రాళ్ళనించి నిప్పు పుట్ట లేదు. అందరూ వచ్చి సాధువుతో మొరపెట్టుకున్నారు. సాధువు “మీ గ్రామంలో ఏదో వింత జరగబోతోంది” అన్నాడు.
కొంతమంది గ్రామస్థులు పక్కగ్రామం వెళ్ళి నిప్పు తీసుకొద్దామని బయల్దేరారు. సాధువు బలవంతంగా వాళ్ళని ఆపాడు.
రాత్రి గడిచింది. ఉదయానికి అందరికీ ఆకలివేసింది. కొందరు పక్క గ్రామానికి బయల్దేరారు. దార్లో కొంతమంది ఎదురై దొంగల గుంపు వరుసగా గ్రామాల్ని దోచుకుని, అందర్నీ చంపి, ఊళ్ళని తగలబెడుతూ వస్తున్నారని చెప్పారు. వాళ్ళు వురుకుల్తో వచ్చి తమ గ్రామస్థులకు చెప్పారు. అందరూ ఊరికి దూరంగా చెట్లలో నక్కారు.
దొంగల గుంపు ఆ గ్రామాన్ని చూసి “ఈ గ్రామంలో పక్షుల అరుపులు లేవు. కుక్కల అరుపులు లేవు. ఏ ఇంటి నించీ కూడా పొగరావడం లేదు, ఈ గ్రామం పాడుపడినట్లు ఉంది” అని అక్కడినించీ వెళ్ళిపోయారు.
గ్రామస్థులు ప్రమాదం తప్పినందుకు సంతోషించి పరిగెత్తుకుంటూ సాధువు వున్న గుడిసెకేసి వచ్చారు. కానీ సాధువు అక్కడ లేడు. ఆయన మళ్ళీ రానే లేదు.
– సౌభాగ్య