ఎవరి సేవకుడు? (Devotional)

ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఎంతో వివేకవంతుడయిన మంత్రి ఉండేవాడు. అన్ని వేళలా ఆ మంత్రి రాజుకు మంచి సలహాలనిచ్చి పరిపాలన సవ్యంగా సాగేలా సహకరించేవాడు. రాజు కూడా తెలివయిన వాడే. నమ్మకస్థుడయిన ఆ మంత్రిపట్ల రాజుకు ఎంతో అభిమానం.             పూర్వకాలం రాజులకు ఎందరో వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి నజరానాలు సమర్పించుకునేవాళ్ళు. ఒక రోజు ఒక రైతు నిగనిగలాడుతూ, నల్లగా మెరిసిపోయే వంకాయలను రాజుగారికి వినయంగా సమర్పించాడు. అవి అతని తోటలో పండిన […]

Advertisement
Update:2015-06-28 18:31 IST

ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఎంతో వివేకవంతుడయిన మంత్రి ఉండేవాడు. అన్ని వేళలా ఆ మంత్రి రాజుకు మంచి సలహాలనిచ్చి పరిపాలన సవ్యంగా సాగేలా సహకరించేవాడు. రాజు కూడా తెలివయిన వాడే. నమ్మకస్థుడయిన ఆ మంత్రిపట్ల రాజుకు ఎంతో అభిమానం.

పూర్వకాలం రాజులకు ఎందరో వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి నజరానాలు సమర్పించుకునేవాళ్ళు. ఒక రోజు ఒక రైతు నిగనిగలాడుతూ, నల్లగా మెరిసిపోయే వంకాయలను రాజుగారికి వినయంగా సమర్పించాడు. అవి అతని తోటలో పండిన వంకాయలు. మొదటి పంటను రాజుగారికి ఇవ్వాలని అతనికోరిక. ఆ వంకాయల్ని స్వీకరించి రాజు చిరునవ్వు నవ్వాడు. రైతు ఎంతో ఆనందించి సెలవు తీసుకున్నాడు.

రాజు తనముందే ఉన్న మంత్రిని చూసి “మంత్రీ! ఈ వంకాయలన్నవే అసలు పనికి మాలినవి. చూడ్డానికి నల్ల రాళ్ళలా ఉంటాయి” అన్నాడు.

మంత్రి ” అవును మహారాజా! మీరు చెప్పింది వాస్తవం” అన్నాడు.

రాజు “అసలు ఈ వంకాయలు రుచీపచీ ఉండవు. దానికి మించిన పనికి మాలిన కూర ప్రపపంచంలో ఇంకొకటి లేదు” అన్నాడు.

“ఎంత సత్యం చెప్పారు మహారాజా!” అన్నాడు మంత్రి

రాజు “దాని కడుపు నిండుగా గింజలు. అసలు వంకాయ ఆరోగ్యానికి మంచిది కాదు తెలుసా? మంత్రీ!” అన్నాడు.

మంత్రి “నిజం మహారాజా! వంకాయ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు” అన్నాడు. ఆరోజు చర్చ ముగిసింది. రాజుగారి వంటవాడు మసాలా దట్టించి గుత్తివంకాయ కూర వండి రాజుకు వడ్డించాడు. రాజు నోటిలో నీళ్ళువూరుతూ తృప్తిగా భోంచేశాడు.

మరుసటిరోజు సభలో మంత్రిని చూసి రాజు “ఆహా! మంత్రీ! అమృతం సంగతి నాకు తెలీదు కానీ వంకాయ కూర అంతకంటే అద్భుతమైంది” అన్నాడు.

మంత్రి “నిజమే మహారాజా! వంకాయ కూరంత రుచి దేనికీ ఉండదు” అన్నాడు.

రాజు “అసలు వంకాయను మించిన కూర సృష్టిలో మరొకటి లేదు, స్వర్గం ఎక్కడో ఉందని అంటారు కానీ వంకాయ తింటే, గుత్తివంకాయ తింటే స్వర్గం భూమికి దిగివస్తుంది. ఏమంటారు మంత్రీ!” అన్నాడు.

మంత్రి “మహారాజా! మీరు చెప్పాకా తిరుగేముంది. అంత మధురమయిన వంటకం. దాంతో పోటీ పడగలిగిన కూర మరొకటి లేదు” అన్నాడు.

రాజు మంత్రి వేపు సందేహంగా చూశాడు. మంత్రి మామూలుగా రాజు మాటలకు స్పందిస్తున్నట్లు కనిపించింది.

రాజు “మంత్రీ! నిన్న వంకాయకూర పనికి మాలిందంటే అవునన్నావు. ఈరోజు వంకాయకూర అద్భుతమంటే అవునున్నావు. ఇంతకూ ఏది నిజం? అన్నాడు.

మంత్రి “మహారాజా! రెండూ నిజమే. మీరు చెప్పిన దానికి ఆమోదం తెలపడం నా విధి. నేను మహారాజుకు సేవకుణ్ణే కానీ వంకాయకు సేవకుణ్ణి కాదు కదా!” అన్నాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News