పదవ అంతస్థు (Devotional)

ఒక గొప్ప వ్యాపారస్థుడుండేవాడు. అతను ఎన్నో రకాలయిన వ్యాపారాలు చేసి కోటానుకోట్లు గడించాడు. అతనితో పోటీ పడగలిగిన ధనవంతులు ఎవరూ లేకపోయారు. ఆ వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. లోకమంతా తనను చూసి ఆశ్చర్యపడేలా ఏదయినా గొప్ప పని చేయాలన్న సంకల్పం కలిగింది.       దేశంలో ఎందరో ధనవంతులున్నారు. వాళ్ళకి ఎన్నో గొప్ప భవనాలున్నాయి. వాటన్నిట్నీ తలదన్నే గొప్ప భవనాన్ని నిర్మించాలని వ్యాపరస్థుడు ఉద్దేశించాడు. సంకల్పం కలిగింది. సంపద ఉంది. ఇక కాని పని […]

Advertisement
Update: 2015-06-24 13:01 GMT

ఒక గొప్ప వ్యాపారస్థుడుండేవాడు. అతను ఎన్నో రకాలయిన వ్యాపారాలు చేసి కోటానుకోట్లు గడించాడు. అతనితో పోటీ పడగలిగిన ధనవంతులు ఎవరూ లేకపోయారు. ఆ వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. లోకమంతా తనను చూసి ఆశ్చర్యపడేలా ఏదయినా గొప్ప పని చేయాలన్న సంకల్పం కలిగింది.

దేశంలో ఎందరో ధనవంతులున్నారు. వాళ్ళకి ఎన్నో గొప్ప భవనాలున్నాయి. వాటన్నిట్నీ తలదన్నే గొప్ప భవనాన్ని నిర్మించాలని వ్యాపరస్థుడు ఉద్దేశించాడు. సంకల్పం కలిగింది. సంపద ఉంది. ఇక కాని పని ఉండదు కదా!

కొన్ని సంవత్సరాలపాటు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గొప్ప భవనాన్ని నిర్మించాడు. అది పది అంతస్థుల భవనం. ప్రతి అంతస్థులో వివిధ చిత్ర విచిత్రమయిన శిల్పాలతో అలంకరించాడు. చూసినవాళ్ళు ఆశ్చర్యపోయేంత అద్భుతంగా భవనం రూపు దిద్దుకుంది. ఒక్కో అంతస్థులో ఒక్కో రకమయిన ఆకర్షణ ఉండేట్లు నిర్మింపజేశాడు. చిత్రం, శిల్పం, సాహిత్యం, సంగీతం, ఇట్లా వివిధ కళలతో విలసిల్లేలా ఆ అంతస్థులు ఒక్కోటి ఒక్కో కళకు ప్రాతి నిధ్యం వహించాయి. పైన చివరన ఉన్న పదవ అంతస్థు మాత్రం తన సొంతానికి ఉంచుకుని నివాసంగా చేసుకున్నాడు.

ఆ ప్రత్యేకమయిన అపూర్వ భవనం గురించి దేశమంతా చెప్పుకున్నారు. ఆ వ్యాపారస్థుని పేరు దేశాల సరిహద్దులు దాటింది. ఆ భవనాన్ని చూడడానికి మొదట జనం రాసాగారు. ప్రారంభంలో అందరికీ ఉచితంగా సందర్శన ఉండేది. జనం విపరీతంగా రావడం చూసి వ్యాపారస్థుడు సందర్శనకు రుసుం ఏర్పాటు చేశాడు. వ్యాపారస్థుడు ఎంతయినా వ్యాపారస్థుడే కదా! ఆ రుసం వల్ల కూడా అతనికి విపరీతంగా ఆదాయం పెరిగింది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రెండూ వచ్చి పడ్డాయి.

అతని కీర్తి ఎంతగా వ్యాపించిందంటే గొప్ప గొప్ప అధికారులు, దేశాన్ని పాలించే రాజు కూడా వచ్చి ఆ భవనాన్ని సందర్శించి అతని ఆతిధ్యం తీసుకుని, అతన్ని అభినందించి వెళ్ళారు. తన కోరిక తీరినందుకు వ్యాపారస్థుడు ఎంతో పరమానందాన్ని పొందాడు. తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పరవశించాడు.

ఒక రోజు ఒక జ్ఞాని అయిన గురువు శిష్యులతో ఆ నగరం గుండా వెళుతున్నట్లు వ్యాపారస్థుడికి వర్తమానం అందింది. వెంటనే అతను గురువుకు ఎదురుగా వెళ్ళి నమస్కరించి తన భవనాన్ని సందర్శించి తనని ఆశీర్వదించమని వేడుకున్నాడు. గురువు తప్పకుండా సందర్శిస్తానని వ్యాపారస్థునితో బాటు బయల్దేరి అతని భవనానికి వచ్చాడు. దూరం నించే ఆ భవనం అద్భుతంగా కనిపించింది.

వ్యాపారస్థుడు ప్రతి అంతస్థు చూపించి దాని ప్రత్యేకత వివరించి కళల ప్రాశస్త్యం వివరించి గురువుగారి ప్రతిస్పందన ఆశించాడు. ప్రతి అంతస్థు ఒకదాన్ని మరొకటి పోటీపడుతోందని గురువు అభినందించాడు. చివరికి పదవ అంతస్థుకు వెళ్ళాడు. బంగారు, వజ్రాలు, రత్నాలు తాపడం చేసిన ధగధగలాడుతున్న పదవ అంతస్థును పరవశంగా వ్యాపారస్థుడు గురువుకు చూపి “ఎలా ఉంది?” అన్నాడు ఆసక్తిగా.

గురువు “అంతా బాగుంది కానీ నువ్వు చనిపోయాకా నీ శరీరాన్ని పదవ అంతస్థునించి కిందికి దింపడం చాలా కష్టమనుకుంటాను” అన్నాడు.

వ్యాపారస్థుడు తను చనిపోతానని ఎప్పుడూ ఊహించలేదు. ప్రతిమనిషి మృత్యువు అనివార్యమన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది. తాను ప్రచారానికి, పైపై మెరుగులకు లొంగానని గ్రహించి గురువు పాదాలపై పడ్డాడు. పదవ అంతస్థు కూడా ప్రదర్శన కిందకు మార్చి రుసుం తీసేసి ఉచితంగా ప్రజలు సందర్శించే ఏర్పాటు చేసి పేదలకు తన సంపదనంతా దానం చేశాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News