ఆస్పత్రి నిర్లక్ష్యం... 108లోనే ప్రసవం

కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీని డాక్టర్లు లేరంటూ బయటే ఉంచేశారు. దీంతో ఆమె పురుటి నొప్పులు పడుతూ గంటసేపు 108లోనే గడపాల్సి వచ్చింది. అసలే నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని 108 వాహనాన్ని ఆశ్రయించారు ఆ గర్భిణీ బంధువులు. వేగంగా ఆస్పత్రికి ఆమెని తీసుకువచ్చారు. తీరా ఆస్పత్రికి వచ్చేసరికి డాక్టర్లు లేరంటూ అడ్మిషన్‌ను నిరాకరించారు. దాంతో దాదాపు గంటపాటు ఆస్పత్రి చెట్టు కిందే […]

Advertisement
Update:2015-06-24 10:42 IST
కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీని డాక్టర్లు లేరంటూ బయటే ఉంచేశారు. దీంతో ఆమె పురుటి నొప్పులు పడుతూ గంటసేపు 108లోనే గడపాల్సి వచ్చింది. అసలే నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని 108 వాహనాన్ని ఆశ్రయించారు ఆ గర్భిణీ బంధువులు. వేగంగా ఆస్పత్రికి ఆమెని తీసుకువచ్చారు. తీరా ఆస్పత్రికి వచ్చేసరికి డాక్టర్లు లేరంటూ అడ్మిషన్‌ను నిరాకరించారు. దాంతో దాదాపు గంటపాటు ఆస్పత్రి చెట్టు కిందే ఆమెని ఉంచేసి 108 వాహనం సిబ్బంది నిరీక్షిస్తున్నారు. ఈలోగా నొప్పులు మరీ ఎక్కువయ్యాయి. ఏం చేయాలో తెలియని బంధువులు, గర్భిణీ భర్త ఆస్పత్రి లోపలికి వెళ్ళి నర్సులను కాన్పు చేయాలని ప్రాధేయపడ్డారు. కనికరం లేని నర్సులు ససేమిరా అన్నారు. ఇక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకవైపు నొప్పులతో గర్భిణీ నరకయాతన… మరోవైపు ఇది చూసి భర్త, బంధువుల హృదయ వేదన. ఇక చేసేది లేక 108 సిబ్బందే ఆమెకు పురుడు పోశారు. ఇందులో ఆ వాహనం డ్రైవర్ కూడా సహకరించాడు. గర్భిణీ ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తూ తల్లీబిడ్డ క్షేమంగా ఉండడం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే ఆస్పత్రిలో ఉండాల్సిన డాక్టర్లు ఎందుకు లేరని ప్రశ్నిస్తూ … మానవతకు దర్పణంలా నిలవాల్సిన నర్సులు అమానుషంగా వ్యవహరించడంపై నిలదీస్తూ… వీరిపై చర్యలు తీసుకోవాలని అక్కడున్న వారంతా డిమాండు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న 108 సిబ్బంది వైద్యులు లేకపోవడాన్ని, నర్సుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాకూడదని కోరారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగి ఉంటే అందరూ తమపై నెపం నెట్టేవారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని డ్రైవర్ అన్నాడు.
Tags:    
Advertisement

Similar News