నిధి (Devotional)
ఒక వ్యాపారస్థుడు ఎంతో కష్టపడి ఎన్నో రకాలయిన వ్యాపారాలు చేసి బాగా ధనం కూడబెట్టాడు. అతనికి నలుగురు కొడుకులు. నలుగురూ అసమర్ధులు. వ్యాపారంలో తండ్రికి సాయపడడానికి బదులు తండ్రి సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేశారు. తండ్రి కొడుకుల్ని పరిశీలించాడు. వీళ్ళు ఇట్లా పద్ధతి లేకుండా ఉంటే తన ఆస్థి మొత్తం నాశనం చేస్తారు, పైగా తన అనంతరం అనాధలుగా మిగుల్తారు అని దిగులు పడ్డాడు. కొడుకులకు తెలియకుండా కొంతధనాన్ని ఒకచోట భద్రపరిచి ఆ విషయం […]
ఒక వ్యాపారస్థుడు ఎంతో కష్టపడి ఎన్నో రకాలయిన వ్యాపారాలు చేసి బాగా ధనం కూడబెట్టాడు. అతనికి నలుగురు కొడుకులు. నలుగురూ అసమర్ధులు. వ్యాపారంలో తండ్రికి సాయపడడానికి బదులు తండ్రి సంపాదించిన ధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేశారు.
తండ్రి కొడుకుల్ని పరిశీలించాడు. వీళ్ళు ఇట్లా పద్ధతి లేకుండా ఉంటే తన ఆస్థి మొత్తం నాశనం చేస్తారు, పైగా తన అనంతరం అనాధలుగా మిగుల్తారు అని దిగులు పడ్డాడు. కొడుకులకు తెలియకుండా కొంతధనాన్ని ఒకచోట భద్రపరిచి ఆ విషయం ఒక చోట రాసిపెట్టాడు.
కొంతకాలం తరువాత ఆ వ్యాపరస్థుడు కన్నుమూశాడు. తండ్రిచనిపోయినా కొడుకులు మరింత బరి తెగించి ఉన్నదంతా ఊడ్చి ఖర్చు పెట్టేశాడు. చివరికి తినడానికి తిండి లేక పూట గడవడం కూడా కష్టమయింది.
ఒకరోజు ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఒక పుస్తకం బయటపడింది. ఆబగా అందులో తమ తండ్రి ఏమైనా ఆస్తి విషయం రాశాడేమో అని వాళ్ళు చదివారు. ఒకచోట “నెలలో పదవరోజు ఉదయం పదిగంటలకు గుడిగోపురంలో బంగారాన్ని దాచాను” అని రాసిన మాటలు కనిపించాయి. ఇక వాళ్ళ సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తమ తండ్రి తమకోసం నిధిని దాచి పెట్టాడని సంబరపడిపోయారు.
వాళ్ళ యింటి పక్కనే ఒక శివాలయముంది. తరతరాలుగా ఆ కుటుంబీకులు ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. అది ఇతరులు సందర్శించినా, ఆ ఆలయం వాళ్ళ సొంతం. కాబట్టి వాళ్ళకు అభ్యంతరాలేవీ ఉండవు.
వెంటనే పలుగు, పార తీసుకుని గుడిపైకి ఎక్కి నిర్విచక్షణగా గుడి గోపురాన్ని ధ్వంసం చేశారు. కానీ అక్కడ ఇటుకలు తప్పబంగారం కనిపించలేదు. నిధి దొరకలేదని నీరసించారు. ఆ గుడిపూజారి ఆ కుటుంబం మేలు కోరేవాడు. ప్రశాంత చిత్తుడు. వాళ్ళు చేసిన అనుచిత కార్యానికి ఆయన మనసు బాధ పడింది.
వ్యాపారస్థుని కొడుకుల్ని పిలిచి తను దాచుకున్న డబ్బిచ్చి వెంటనే గోపురం పునర్నర్మించండి” అని చెప్పి గోపురాన్నియధాతధంగా నిర్మింపజేశాడు. తరువాత ఎందుకలా చేశారన్నాడు.
వాళ్ళు తమ తండ్రి డైరీలో రాసిన మాటల్ని చూపించారు “నెలలో పదవరాజు ఉదయం పదిగంటలకు గుడిగోపురంలో బంగారం దాచాను” అన్నమాటలు చదివి పూజారి ఆలోచించి మరుసటి రోజు ఉదయాన్నే పలుగుపారతో రమ్మన్నాడు.
ఉదయం పదిగంటలప్పుడు ఆ గోపురం నీడ ఎక్కడ పడుతుందో అక్కడ తవ్వమన్నాడు. వాళ్ళు నలుగురూ తవ్వారు. ఒక పాత్రలో దాచిన ఇరవై వేల బంగారు నాణేలు బయటపడ్డాయి. నలుగురు ఎంతో సంతోషించి పూజారికి కృతజ్ఞతలు చెప్పి నాలుగువేల బంగారు నాణేలు ఆయనకిచ్చి గుడి నిర్వహణ సక్రమంగా సాగేలా చూడమన్నారు.
పూజారి వాళ్ళకు బుద్ధి మాటలు చెప్పి ఆ నాణేల్ని నలుగురూ సమంగా పంచుకుని వ్యాపారం చేయమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు.
మాటల్ని పట్టుకోవడం కాదు. మాటల వెనక అంతరార్ధమన్నది ముఖ్యం. లేనిపక్షంలో మనిషి ఎప్పటికీ సత్యాన్ని సమీపించలేడు. పై మాటల్ని తెరలా తీస్తే లోపల దాగిన సత్యం కనిపిస్తుంది.
– సౌభాగ్య