త్రిజట (For Children)

మంచి కొంచెమైనా మరిచిపోకూడదు!         మంచి చేసిన వాళ్ళని మరచిపోవద్దు! అలా అయితే అస్సలు “త్రిజట”ని మరచి పోవద్దు!         త్రిజట విభీషణుని కూతురుగా చెపుతారు. తండ్రి కారణంగా కాక తన వ్యక్తిత్వం కారణంగానే త్రిజట మనకు గుర్తుంటుంది.         సీతను ఎత్తుకొచ్చిన రావణుడు లంకలోని అశోకవనంలో ఉంచాడు. చుట్టూ రాక్షస మూకలు. ఆ రాక్షస స్త్రీలకో పెద్ద. ఆమే త్రిజట! సీతను ఓ కంట కనిపెడుతూ కాపలాకాయడం ఆమె విధి! సీత కంటికీ మింటికీ ఏకధారగా […]

Advertisement
Update:2015-06-21 18:32 IST

మంచి కొంచెమైనా మరిచిపోకూడదు!

మంచి చేసిన వాళ్ళని మరచిపోవద్దు! అలా అయితే అస్సలు “త్రిజట”ని మరచి పోవద్దు!

త్రిజట విభీషణుని కూతురుగా చెపుతారు. తండ్రి కారణంగా కాక తన వ్యక్తిత్వం కారణంగానే త్రిజట మనకు గుర్తుంటుంది.

సీతను ఎత్తుకొచ్చిన రావణుడు లంకలోని అశోకవనంలో ఉంచాడు. చుట్టూ రాక్షస మూకలు. ఆ రాక్షస స్త్రీలకో పెద్ద. ఆమే త్రిజట! సీతను ఓ కంట కనిపెడుతూ కాపలాకాయడం ఆమె విధి! సీత కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తూ ఉంటే – తన పేరుకి రాక్షసిఅయినా తనలోనూ ఓ స్త్రీ ఉంది… అందుకే సాటి స్త్రీని సానుభూతితో అర్ధం చేసుకుంది. తనకు బందీగా ఉందని దర్పం చెలాయించలేదు, చాలా గౌరవంగా చూసుకుంది.

త్రిజటకు ఒక కల వచ్చింది. ఆ కలకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ప్రసిద్ధి పొందింది. ఆ కలలో భవిష్యత్తును దర్శించింది. జరగబోయే పరిణామాల్ని జల్లెడపట్టింది. ఆ కలను చెప్పి సీత మనసుకు ఊరటనీ ధైర్యాన్నీ ఇచ్చింది. రాక్షస సేన సీతను కష్టాలు పెట్టకుండా తన కొచ్చిన కలను చెప్పి ఆపగలిగింది. ఆ మాటకొస్తే హనుమంతుడు రామబంటుగా తనని తాను నిరూపించుకొని, రాముడిచ్చిన కబురునీ ఉంగరాన్నీ ఇచ్చే అవకాశాన్నిచ్చింది త్రిజటే!

త్రిజట కొచ్చిన కల గురించి చెప్పకపోతే త్రిజట పాత్రకు పరిపూర్ణత రానేరాదు. కలలో – శ్రీరామ చంద్రుడు ఆకాశపు దారులంట వచ్చాడు. యెలా? నాలుగు దంతాలున్న ఏనుగుని ఎక్కి వచ్చాడు. వేన వేల సూర్యుల్లా వెలిగిపోయి వచ్చాడు. సీత చెయ్యి పట్టి ఏనుగు మీదకు ఎక్కించుకొని మరీ తీసుకు వెళ్ళాడు. మరి లంకేమయింది? సర్వనాశనం అయిపోయింది. సముద్రంలో కలిసిపోయింది. రావణ కుంభకర్ణులు దిగంబరులై మురికి గుంటలో పడిపోయారు. మృత్యుదేవతేమో… వికృతమైన స్త్రీ ఎర్రని గుడ్డలు కట్టుకొని రావణాదుల మెడకు తాడు బిగించి లాక్కుపోతోంది… దక్షిణ దిశగా! మరి రాక్షసులేమయ్యారు? చచ్చిన శవాలయ్యారు. మన జాతి మొత్తం నాశనమయిందని చెప్పింది త్రిజట. తోటి రాక్షస స్త్రీలంతా ఏం చేయాలో దిక్కుతోచక చూసారు. వేడుకుంటే సీతమ్మ తల్లి మనకు అభయమిచ్చి కాపాడుతుంది. రక్షిస్తుంది. త్రిజట నోట ఆ మాట విని అంతా సీతకు నమస్కరించారు. ఆ భయంలో ఊరటలో అలసి ఎక్కడి వాళ్ళక్కడ పడి నిద్రపోయారు. అశోక వృక్షం ఆకుల్లో దాగిన హనుమంతుడు దిగి వచ్చాడు. సీతతో ఒంటిగా మాట్లాడగలిగాడు. అలా సీత నమ్మకం నిలబడింది. రాముడికీ ఊరట దొరికింది!

అశోకవనంలో ఉన్నన్నాళ్ళూ రాక్షసుల బెడద లేకుండా సీతవున్నదంటే అది త్రిజట వలనే! సీతకు శుభం కలుగుతుందని చెప్పి, వేకువ ఝామున వచ్చిన కలలు నిజమవుతాయని సీత కలతని కొంత తీర్చిన త్రిజట పాత్ర చిన్నదైనా మరువలేనిది… మరువరానిది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News