స్వయంప్రభ (For Children)
స్వయంప్రభ మేరుసావర్ణి కూతురు. అప్సరస అయిన హేమకు చెలికత్తె. అంతకు మించి స్నేహితురాలు. హేమ తోడుగా స్వయంప్రభ మయ నిర్మితమైన ఋక్ష బిలంలో ఉండేది. మయుడు ఎవరో కాదు, హేమను పెళ్ళాడినవాడు. భార్యకు కానుకగా కొండగుహలో వృక్ష సముదాయాల మధ్య తన శిల్పకళా చాతుర్యంతో ఒక మహలునే కట్టించి ఇచ్చాడు. బయట నుంచి చూస్తే కొండ గుహే. కాని లోపల వెండీ బంగారు కాంతుల వనాలు! పూలూ, పళ్ళూ సువాసనల సుగంధాలూ! అన్నీ ఉన్న ఏకాంత స్వర్గమది! […]
స్వయంప్రభ మేరుసావర్ణి కూతురు. అప్సరస అయిన హేమకు చెలికత్తె. అంతకు మించి స్నేహితురాలు. హేమ తోడుగా స్వయంప్రభ మయ నిర్మితమైన ఋక్ష బిలంలో ఉండేది. మయుడు ఎవరో కాదు, హేమను పెళ్ళాడినవాడు. భార్యకు కానుకగా కొండగుహలో వృక్ష సముదాయాల మధ్య తన శిల్పకళా చాతుర్యంతో ఒక మహలునే కట్టించి ఇచ్చాడు. బయట నుంచి చూస్తే కొండ గుహే. కాని లోపల వెండీ బంగారు కాంతుల వనాలు! పూలూ, పళ్ళూ సువాసనల సుగంధాలూ! అన్నీ ఉన్న ఏకాంత స్వర్గమది! మూడో మనిషి ప్రవేశించ వశం కానిది. ప్రవేశించినా తిరిగి బయటకు వెళ్ళ వీలు లేనిది.
అటువంటి గుహలోకి దారి తప్పి వచ్చింది వానరసైన్యం. అంగదుడే అధిపతి. ఆంజనేయుడూ జాంబవంతుడూ ఉన్నారు. దక్షిణ దిక్కున సీతకోసం వెదుకుతూ దారి తప్పారు. అడవిలో తినడానికే కాదు, తాగడానికీ ఏమీ దొరకలేదు. ఆశతో ఆకలి దప్పులతో బిలంలోకి వచ్చారు. చీకటి గుహలో వెన్నల కాంతి. విరగకాచిన పళ్ళు. ఆకలి ఆవురావురు మంది. తినాలని నోరూరింది. ఆకలయినా అనుమతి లేకుండా తినకూడదన్న ధర్మమెరిగి చుట్టూ చూసారు. ఎవ్వరూ లేరు.
ఎందుకంటే అప్సరస హేమ దేవేంద్రుని కొలువులో నాట్య కళాకారిణి. అప్పుడప్పుడూ తప్ప ఇక్కడకు రాదు. ఉండేది స్వయం ప్రభే. ఆమె ధ్యాన తపస్సులో ఉంది. చూసింది. చూడడంతో సంబరంగా చేతులు జోడించారు వానరులు. రాముని బంటులుగా చెప్పుకున్నారు. సీత జాడ వెతుకుతూ దారి తప్పి వచ్చామన్నారు. ఆకలి వేస్తోందన్నారు. అనుమతిస్తే పళ్ళుతిని నీళ్ళు దాగి ఆకలీ దప్పిక తీర్చుకొని ప్రాణాలు నిలుపుకుంటామన్నారు. సరేనంది స్వయంప్రభ. అనడమే తడవు అనుమతిచ్చిందే తడవు పళ్ళు కడుపు నిండాతిని నీళ్ళుతాగి చెట్లమీదే అలసి నిద్రపోయారు.
కళ్ళు తెరచి కలవరవడ్డారు. సీతజాడకై సుగ్రీవుడిచ్చిన సమయం దాటిపోతోందని ఆందోళన పడ్డారు. బిలంలోంచి బయటపడేదారి తెలియక తోవ చూపించమన్నారు. తమ ప్రాణాలు నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రాముని సేవకులు మీరు, దైవబలం ఉండడం వల్లే బిలంలోకి రాగలిగారని చెప్పింది స్వయం ప్రభ. మంచి పనికి చిక్కులు ఎక్కువసేపు ఉండవంది. నావంతు సాయం చేస్తానంది. కళ్ళు మూసుకోమని చెప్పింది. వానరులు కళ్ళు మూసుకున్నారు. అలా మూసి తెరచిన మరుక్షణంలో మయుని మాయా బిలంనుండి బయటపడడమే కాదు, దక్షణ సముద్ర తీరాన ఉన్నారు. స్వయం ప్రభ మంచికి సాయపడాలని తన తపఃశక్తిని ఉపయోగించి వానరులను సాగనంపింది. తన వంతు మేలు తానూ చేసింది. చిన్నదయినా తన స్థానాన్ని తాను నిలుపుకుంది స్వయంప్రభ!.
– బమ్మిడి జగదీశ్వరరావు