ప్రేమలో నమ్మకముంటుంది (Devotional)

ప్రేమంటే నమ్మకం. లాభనష్టాలు బేరేజు వేసుకోవడం కాదు. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే మన హావభావాలే ఆ విషయాన్ని వ్యక్తపరుస్తాయి. కారణం ప్రేమలో గొప్ప ఆహ్లాదం ఉంది. అన్ని బంధనాలని అధిగమించిన స్వేచ్ఛ ఉంది. అది వ్యక్తీకరణకు లొంగదు. దైవం ఎలాంటిదో ప్రేమ కూడా అలాంటిదే. అది ప్రియురాలి పట్ల ప్రేమ కావచ్చు, స్నేహితుడి పట్ల ప్రేమ కావచ్చు, ఒక పువ్వు పట్ల ప్రేమ కావచ్చు. ఏదయినా ప్రేమే. ప్రేమకు తరతమ భేదాలు, ప్రాధాన్యతలు ఉండవు.             […]

Advertisement
Update:2015-06-15 18:31 IST

ప్రేమంటే నమ్మకం. లాభనష్టాలు బేరేజు వేసుకోవడం కాదు. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే మన హావభావాలే ఆ విషయాన్ని వ్యక్తపరుస్తాయి. కారణం ప్రేమలో గొప్ప ఆహ్లాదం ఉంది. అన్ని బంధనాలని అధిగమించిన స్వేచ్ఛ ఉంది. అది వ్యక్తీకరణకు లొంగదు. దైవం ఎలాంటిదో ప్రేమ కూడా అలాంటిదే. అది ప్రియురాలి పట్ల ప్రేమ కావచ్చు, స్నేహితుడి పట్ల ప్రేమ కావచ్చు, ఒక పువ్వు పట్ల ప్రేమ కావచ్చు. ఏదయినా ప్రేమే. ప్రేమకు తరతమ భేదాలు, ప్రాధాన్యతలు ఉండవు.

ప్రేమలో అధికారముండదు, ఆగ్రహముండదు. ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో నమ్మకముంటుంది. నమ్మకం గొప్ప ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.

ఇద్దరు మిత్రులు సైనికరంగంలో చేరారు. అనుకోకుండా ఇద్దరూ ఒకే దగ్గర కలిసి పని చేసే అవకాశం దొరికింది. వాళ్ళకు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం. అరమరికలు లేకుండా కష్టసుఖాన్ని ఒకరితో ఒకరు పంచుకునేవారు. ప్రతిరోజూ ఒకర్ని ఒకరు కలుసుకోవడానికి, ఒకరి కష్టసుఖాల్ని మరొకరికి చెప్పుకోడానికి అవకాశం దొరికినందుకు భగవంతునికి వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకునే వాళ్ళు.

ఇద్దరూ దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించేవాళ్ళు. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు కదా! యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పరరాజ్యం దండెత్తింది. సైనికులు యుద్ధ రంగానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. పై అధికారులు సైనికుల్ని కొన్ని విభాగాలు చేసి యుద్ధ రంగానికి పంపారు. దాంట్లో మొదటి మిత్రుడు ఉన్నాడు. రెండో మిత్రుడు వెళ్ళలేదు. మొదటి మిత్రుడు రెండోమిత్రుడి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు.

యుద్ధరంగానికి వెళ్ళిన సైనికుల నించీ ఎట్లాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు కదా! దాంతో మొదటి మిత్రుడి క్షేమ సమాచారాల గురించి రెండో మిత్రుడు ఆందోళన చెందేవాడు. నెలగడిచినా అతని జాడే చెప్పేవాళ్ళు లేరు.

రెండో మిత్రుడు సైనికాధికారి దగ్గరకు వెళ్ళి దయచేసి నన్ను యుద్ధరంగానికి పంపండి. నా మిత్రుడి ఆచూకీ తెలియడం లేదు అన్నాడు.

సైనికాధికారి “అక్కడ యుద్ధం జరుగుతోంది. బహుశా అతను చనిపోయి ఉండవచ్చు. నువ్వు వెళ్ళి ఎందుకు ప్రాణాలు మీదికి తెచ్చుకుంటావు?”

రెండో మిత్రుడు “దయచేసి నన్ను పంపండి. నా విధుల్ని నిర్వహిస్తూనే నా మిత్రుణ్ణి అన్వేషిస్తా” నన్నాడు. సైనికాధికారి సరేనని పంపాడు.

అతను యుద్ధరంగానికి వెళ్ళాడు. తీవ్రంగా గాయపడిన తన మిత్రుణ్ణి చూశాడు. అతను కొన ఊపిరితో ఉన్నాడు. స్నేహితుణ్ణి చూసి “నువ్వు వస్తావని తెలుసు” అని అతని కళ్ళలో ఆనందం కదులుతుండగా కన్నుమూశాడు. శత్రుసైనికులు కాల్పులు జరిపారు గుండు వచ్చి ఇతని భుజంలో దూసుకుపోయింది. రక్తం ఓడుతున్న శరీరంతోనే తన మిత్రుడి శవాన్నిభుజాన వేసుకుని సైనిక కేంద్రానికి వచ్చాడు.

సైనికాధికారి “చెప్పానుకదా! చనిపోయివుంటాడని. నువ్వు వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు” అన్నాడు.

అతను “సార్‌! అతను నేను వెళ్ళేదాకా చనిపోలేదు. నేను వస్తానన్న నమ్మకంతో బతికే ఉన్నాడు. నన్ను చూసిన తరువాత “నువ్వు వస్తావని తెలుసు” అంటూ ఆనందంతో కన్నుమూశాడు” అన్నాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News