సుమిత్ర (For Children)
అయోధ్య చక్రవర్తి దశరథుడు. పెద్ద భార్య కౌసల్య కాగా చిన్న భార్య కైకేయి కాగా నడిపి భార్య సుమిత్ర. ఈమె అవంతీ దేశపు రాజ పుత్రిక. సుగుణమే ఈమె సౌందర్యం. ఈర్ష్యపడని ఇల్లాలు. అసూయ యెరగని అతివ. ద్వేషమెరుగని దయామయి. అన్నిటిని మించి జ్ఞానవంతురాలు. కాబట్టే నారాయణుడే కారణ జన్ముడైన రాముడనీ, శేషువూ శంకు చక్రాలే లక్ష్మణ భరత శత్రుజ్ఞులని తెలుసుకుంది. రాక్షస సంహరణార్థం వచ్చారనీ అవతరించారనీ గ్రహించగలిగింది. దశరథునికి సంతానం లేదు. వసిష్ఠ మహాముని […]
అయోధ్య చక్రవర్తి దశరథుడు. పెద్ద భార్య కౌసల్య కాగా చిన్న భార్య కైకేయి కాగా నడిపి భార్య సుమిత్ర. ఈమె అవంతీ దేశపు రాజ పుత్రిక. సుగుణమే ఈమె సౌందర్యం. ఈర్ష్యపడని ఇల్లాలు. అసూయ యెరగని అతివ. ద్వేషమెరుగని దయామయి. అన్నిటిని మించి జ్ఞానవంతురాలు. కాబట్టే నారాయణుడే కారణ జన్ముడైన రాముడనీ, శేషువూ శంకు చక్రాలే లక్ష్మణ భరత శత్రుజ్ఞులని తెలుసుకుంది. రాక్షస సంహరణార్థం వచ్చారనీ అవతరించారనీ గ్రహించగలిగింది.
దశరథునికి సంతానం లేదు. వసిష్ఠ మహాముని చెప్పిన విధంగా పుత్రకామేష్ఠి యాగం చేసి – ఆ యజ్ఞ ఫలమైన పాయసాన్ని సగం కౌసల్యకూ సగం కైకేయికూ ఇచ్చారు. వారిద్దరూ తాము తాగి కొంచెం మిగిల్చి సుమిత్రకు యిచ్చారు. కౌసల్య కన్న రాముడికి నీడగా లక్ష్మణున్నీ – కైకేయి కన్న భరతుడికి తోడుగా శత్రుజ్ఞుణ్ణి కనియిచ్చినట్టుగా కన్నది సుమిత్ర. అక్కలకు తోబుట్టుగా ఉన్నది సుమిత్ర.
అయితే ఇంకొక కథ కూడా ఉంది. దశరథుడు ముగ్గురు భార్యలకు మూడు గిన్నెలలో పోసి పాయసం ఇచ్చాడనీ, సుమిత్ర పాయసంగిన్నెను గరుడ పక్షి తన్నుకుపోయిందనీ, అప్పుడు సుమిత్ర ఏడ్చిందనీ, అప్పుడు కౌసల్య, కైకేయి తమ గిన్నెలలోని పాయసాన్ని తాగి కొంచెం కొంచెం మిగిల్చి ఇచ్చారనీ కథ. ఏ కారణంగానైన సుమిత్ర కన్న లక్ష్మణ శత్రుజ్ఞులు తామిద్దరూ కాక అన్నలిద్దరికీ అనుంగులుగా ఉండడం విశేషం. ఇది రక్త సంబంధంలోనూ అనురక్తి సంబంధం.
సుమిత్ర అందరి మధ్య అనుసంధాన కర్తగా ఉందే తప్ప ఎప్పుడూ ఎవరి మనసూ నొప్పించలేదు. కౌసల్యకూ కైకేయికి ఉన్న ప్రాధాన్యత సుమిత్ర పాత్రకు లేనట్టేవున్నా తనదైన వ్యక్తిత్వం ఉట్టిపడుతుంది. రాముడు సతీ సమేతంగా అరణ్య వాసానికి వెళుతున్నప్పుడు దుఃఖించింది. అన్నను విడిచి ఉండలేక లక్ష్మణుడూ అడవులకు వెళుతుంటే అమ్మగా సుమిత్ర అడ్డుచెప్పలేదు. పైగా అన్నా వదినల సేవలోనే అమ్మానాన్నలసేవ ఉందని బోధ పరచింది. నిస్వార్థమైన తల్లిగా నిరూపించుకుంది. రాముడు దూరమై దిగులుతో దుఃఖంతో విలవిల లాడుతున్న దశరథునికి ధైర్యం చెప్పింది. దశరథుని మరణానంతరం కౌసల్యకు తోడుగా నిలిచింది. కారణమైన కైకేయిని ఒక్కమాట కూడా అనని అపురూపమైన వ్యక్తిత్వం సుమిత్రది. అన్నకు వచ్చిన అవస్థలకు అతలాకుతలమైపోయిన భరతుణ్ని కూడా ఓదార్చిన అమ్మ మనసు సుమిత్రది.
శ్రీరాముణ్ని చూడాలని భరతుడు వెళుతూ దారిలో భరద్వాజ ఆశ్రమాన్ని దర్శిస్తాడు. కౌసల్యతోపాటు సుమిత్ర కూడా వెంట ఉంటుంది. రాముని సేవకు నోచుకున్న లక్ష్మణుని వంటి పుణ్యాత్ముని కన్నతల్లిగా సుమిత్ర యెంతో ధన్యురాలని భరద్వాజ మహర్షి ప్రసంశించాడు.
సుమిత్రది చాలా సామాన్యంగా కనిపించే పాత్రలా ఉన్నా ఆమె సుగుణమే ఆమె ప్రత్యేకతగా పొడచూపుతుంది!.
– బమ్మిడి జగదీశ్వరరావు