ప్రేమ (Devotional)
మొదట ప్రేమ విషయంలో ఎవరికి వారు ఒక ప్రయోగం చేయాలి. మనం ఎవర్ని ప్రేమిస్తున్నామో ఒక లిస్టు రాయాలి. అందులో సాధారణంగా తల్లి, దండ్రి, పిల్లలు, స్నేహితులు ఈ వరుసలో వ్యక్తులు వస్తారు. వాళ్ళని మనం సంతోషపెడతాం, వాళ్ళు మనల్ని సంతోష పెడతారు. ఆ కారణంగా వాళ్ళని ప్రేమిస్తాం. ఎవరయినా మనకు సాయపడి ఉంటారు. ఆ కారణంగా వాళ్ళని ప్రేమిస్తాం. కారణాలు లేనిదే వాళ్ళని ప్రేమించ మన్నమాట. కారణం ఉన్నది ప్రేమ ఎలా అవుతుంది? ప్రయోజనంతో ముడిపడి […]
మొదట ప్రేమ విషయంలో ఎవరికి వారు ఒక ప్రయోగం చేయాలి. మనం ఎవర్ని ప్రేమిస్తున్నామో ఒక లిస్టు రాయాలి. అందులో సాధారణంగా తల్లి, దండ్రి, పిల్లలు, స్నేహితులు ఈ వరుసలో వ్యక్తులు వస్తారు. వాళ్ళని మనం సంతోషపెడతాం, వాళ్ళు మనల్ని సంతోష పెడతారు. ఆ కారణంగా వాళ్ళని ప్రేమిస్తాం. ఎవరయినా మనకు సాయపడి ఉంటారు. ఆ కారణంగా వాళ్ళని ప్రేమిస్తాం. కారణాలు లేనిదే వాళ్ళని ప్రేమించ మన్నమాట. కారణం ఉన్నది ప్రేమ ఎలా అవుతుంది? ప్రయోజనంతో ముడిపడి ఉన్న విషయం ప్రేమకిందకు ఎలా వస్తుంది. అట్లా నిలదీస్తే లిస్టులో సన్నిహితులు, మిత్రులు అదృశ్యమవుతారు. చివరికి రక్తసంబంధీకులు మిగుల్తారు. నిజంగా వాళ్ళని నిష్కారణంగా ప్రేమిస్తామా? వాళ్ళతో మన సంబంధం కూడా ఇచ్చిపుచ్చుకోవడాలకు సంబంధించే ఉంటుంది. చివరకు లిస్టులో ఎవరూ మిగలరు. మనం స్వార్థపరులుగా, మనల్ని మాత్రమే మనం ప్రేమించే వాళ్ళంగా మిగుల్తాము.
ఎంత ఆత్మీయంగా ఉన్నా మనకు అన్నీ అనుకూలంగా ఉన్నంతవరకే వాళ్ళని ప్రేమిస్తాం. మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళను దూరం చేసుకుంటాం. “అట్లా కాదు. మా పిల్లల్ని స్వచ్ఛంగా, ప్రయోజనాల్ని ఆశించకుండా ప్రేమిస్తాం. వాళ్ళకోసం ప్రాణాల్ని ఇస్తాం” అని గొప్పలు పోతూ ఉంటారు. కానీ పిల్లలు జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకుంటే భరించలేరు. తమ మాటకు కట్టుబడి ఉన్నంతవరకే పిల్లల్ని ప్రేమిస్తారు. అక్కడ కూడా ప్రేమకు హద్దులున్నాయి, ప్రయోజనాలున్నాయి.
ముగ్గురు స్నేహితులు సోఫాలో కూచుని ముచ్చట్లాడుకుంటున్నారు. వీధిలో వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. పిల్లల ఆటలు చూస్తూ అందరూ ఆనందంగా ఉన్నారు. అందరి చర్చా ప్రేమ మీదకు మళ్ళింది. పిల్లల్ని తామెంత గొప్పగా ప్రేమిస్తామో వాళ్ళకోసం ఏమైనా చెయ్యగలమంటూ ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. జీవితంలో మొదట పిల్లలు, తరువాతే ఏదయినా అన్నారు.
“మరి ఏదయినా ఒక హఠాత్ సంఘటన జరిగితే, ఊహించని ప్రమాదం జరిగితే మొదట ఏం చేస్తాం?” అన్నాడొకడు. రెండో అతను “మొదట మన పల్లల్ని ఆ ప్రమాదం నించీ రక్షిస్తాం. తరువాతే మనగురించి ఆలోచిస్తాం” అన్నాడు.
మూడోవ్యక్తి “నువ్వు చెప్పింది కరెక్ట్” అన్నాడు.
ఇంతలో బయట ఆడుకుంటున్న పిల్లలందరూ పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వచ్చారు. అంతలో హఠాత్తుగా వంటింట్లోంచీ పెద్ద శబ్దం వచ్చింది. కుక్కర్ సేప్టీ వాల్వ్ ఊడిపోయి కుక్కర్ బద్దలయిందేమో అన్నంత శబ్దం వచ్చింది. దాంతో ముగ్గురూ హడలిపోయారు. బాంబు పడి ఇల్లు బద్దలయినంతగా భయపడిపోయారు. అంతవరకు మాట్లాడుకున్న త్యాగం గురించిన మాటలు గాలికెగిరిపోయాయి.
ముగ్గురూ లేచి ఒక్కసారిగా ప్రాణభయంతో బయటికి పరిగెట్టారు. అప్పుడు వాళ్ళ మనసులో పిల్లలెవరూ లేరు. మొదట తమ ప్రాణాల్ని నిలుపుకోవడం వారికి ముఖ్యమయింది. అదీ పిల్లల పట్ల ప్రేమ అంటే!
చెప్పడం సులభం! చెప్పడానికి చేతలకు సంబంధముండదు. పిల్లలు లోపలికి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏమయివుంటుందోనని ముగ్గుర్లో ఒకరూ ఆలోచించలేదు.
అట్లాంటప్పుడు అనురాగం అసలు రంగు బయట పడుతుంది.
– సౌభాగ్య