ఉదయం (Devotional)
గురువులు ఏదయినా సూచనా మాత్రంగా చెబుతారు. వాటిని మన స్వతంత్ర ఆలోచనతో అర్థం చేసుకోవాలి. బీజప్రాయంగా చెప్పిన దాన్ని వివరించాలి. విస్తరించాలి. వాటిలో ప్రేమ ఒకటి. భగవంతుడు ప్రేమ స్వరూపుడని అంటాం. అంటే ఆ ప్రేమని సమస్త మానవాళి పట్ల మనం ప్రదర్శించాలి. అప్పుడు దైవత్వమంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అప్పుడది కేవలం ఒక ఆలోచనగా మాత్రమే సూత్రప్రాయంగా మాత్రమే. అది మన అనుభూతిగా పరివర్తన చెందుతుంది. మన భావనా ప్రపంచమంతా నిండుతుంది. ఆ క్రమంలో […]
గురువులు ఏదయినా సూచనా మాత్రంగా చెబుతారు. వాటిని మన స్వతంత్ర ఆలోచనతో అర్థం చేసుకోవాలి. బీజప్రాయంగా చెప్పిన దాన్ని వివరించాలి. విస్తరించాలి. వాటిలో ప్రేమ ఒకటి. భగవంతుడు ప్రేమ స్వరూపుడని అంటాం. అంటే ఆ ప్రేమని సమస్త మానవాళి పట్ల మనం ప్రదర్శించాలి. అప్పుడు దైవత్వమంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అప్పుడది కేవలం ఒక ఆలోచనగా మాత్రమే సూత్రప్రాయంగా మాత్రమే. అది మన అనుభూతిగా పరివర్తన చెందుతుంది. మన భావనా ప్రపంచమంతా నిండుతుంది.
ఆ క్రమంలో మన అస్తిత్వం, మన భౌతిక సరిహద్దులు క్రమంగా అదృశ్యమవుతాయి. మనం ప్రేమగా మారిపోతాం. నిజానికి మతమంటే ప్రేమ. అసలు మతం అన్న మాటని తీసేసి ప్రేమ అన్నమాటని పెడితే చాలు. దైవమంటే ప్రేమ.
గురువు శిష్యుల ఆలోచనా స్థాయిని పరిశీలించడానికి కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు వేస్తారు. శిష్యులలో ఎదుగుదలని బట్టి వాళ్ళ సమాధానాలుంటాయి. ఆగిపోయిన వాళ్ళు కొందరు. అభివృద్ధి చెందేవాళ్ళు కొందరు. చైతన్యం లేని కొందరు, చలన శీలురు కొందరు మనకు కనిపిస్తారు.
ఒక గురువు శిష్యుల్ని ఒక మనోహరమయిన ప్రశ్న వేశారు. అది ఆహ్లాదకరమైంది. ఆ ప్రశ్న ఏమిటంటే “రాత్రి పూర్తయి ఎప్పుడు ఉదయం మొదలవుతుంది?” అని. అంటే దేన్నిబట్టి మీరు ఉదయం ఆరంభమయిందని అంటారు?” అన్నది ఆయన ఉద్దేశం.
ఒక శిష్యుడు “గురువు గారూ! మన ఎందురుగా వస్తున్న వాళ్ళు మనుషులు అని మనం గుర్తించ గలిగినపుడు” అన్నాడు. గురువు ఇంకో శిష్యుడి వైపు చూశాడు.
ఆ శిష్యుడు “గురువు గారూ! దూరంగా కొన్ని జంతువులు కనిపిస్తాయి. వాటిలో ఆవులు, మేకలు, గొర్రెలు ఉంటాయి. వేటి కవిగా ఉంటే ఆవుల్ని ఆవులుగా, మేకల్ని మేకలుగా, గొర్రెల్ని గొర్రెలుగా మనం గుర్తించగలిగినపుడు ఉదయమయిందని గ్రహించవచ్చు” అన్నాడు.
తను సరయిన సమాధానం చెప్పానన్న నమ్మకం శిష్యుడి కళ్ళలో కదిలింది.
గురువు ఇంకో శిష్యుడి వేపు చూశాడు. వీళ్ళిద్దరూ చెప్పింది సరయిన సమాధానం కాదు, నేను చెప్పబోయే సమాధానమే గురువుకు నచ్చుతుంది అనుకున్నాడు శిష్యుడు.
“గురువు గారూ! చీకటి విడిపోతూ ఉంటుంది. సంధ్యాకాంతులు కొండ వెనకనించీ భూమిపై పడుతూ ఉంటాయి. పక్షుల కిలకిలా రాగాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు అంతదాకా ఉన్న చీకటిలో దాగిన చెట్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఏది రావి చెట్టో, ఏది వేప చెట్టో మనం అప్పుడు గుర్తు పట్టవచ్చు. అది ఉదయాన్నే జరుగుతంది. ఆ రకంగా ఉదయాన్ని మనం తెలుసుకోగలం అన్నాడు.
గురువువ శిష్యులందర్నీ చూసి “ఇవేవీ ఉదయానికి గుర్తులు కావు మీరు ఏమనిషిని చూసినా అతన్లో మీ సోదరుడిని, స్నేహితుణ్ణి చూడగలగాలి. ఏ స్త్రీని చూసినా మీ తోబుట్టువు గా చూడగలగాలి. ప్రపంచం నీ ఇల్లులా పలకరించాలి. అప్పుడు అదే నిజమయిన ఉదయం. లేకుంటే అది ఉదయమయినా అంధకారంనిండిన రాత్రితో సమానం” అన్నాడు.
– సౌభాగ్య