విభీషణుడు (For Children)

ఔను! రావణాసురుని తమ్ముడే విభీషణుడు! అసురు (రాక్షసు)డే అయినా అన్నదమ్ముడే అయినా ఇద్దరి మనస్తత్వాలకు సంబంధమే లేదు. గుణ గణాలకు పోలికే లేదు. ఇద్దరి దారి ఒకటి కాదు. అందుకనే ఇద్దరి జీవితాల ముగింపూ ఒక్కటి కాదు. ఆ మాట కొస్తే పుట్టుకలోనూ తేడా లేకపోలేదు!? కైకసీకి విశ్వవోబ్రహ్మ కారణంగా పుట్టిన మూడో కుమారుడు విభీషణుడు. ముందు పుట్టిన వాళ్ళంతా శాప కారణంగా దుర్మార్గులవడంతో ఆ తల్లి దుఃఖించింది. అందుకని అందర్లోకీ చిన్నవాడు సుగుణాలు ఉన్నవాడు పుడతాడని […]

Advertisement
Update:2015-06-08 18:32 IST

ఔను! రావణాసురుని తమ్ముడే విభీషణుడు! అసురు (రాక్షసు)డే అయినా అన్నదమ్ముడే అయినా ఇద్దరి మనస్తత్వాలకు సంబంధమే లేదు. గుణ గణాలకు పోలికే లేదు. ఇద్దరి దారి ఒకటి కాదు. అందుకనే ఇద్దరి జీవితాల ముగింపూ ఒక్కటి కాదు. ఆ మాట కొస్తే పుట్టుకలోనూ తేడా లేకపోలేదు!? కైకసీకి విశ్వవోబ్రహ్మ కారణంగా పుట్టిన మూడో కుమారుడు విభీషణుడు. ముందు పుట్టిన వాళ్ళంతా శాప కారణంగా దుర్మార్గులవడంతో ఆ తల్లి దుఃఖించింది. అందుకని అందర్లోకీ చిన్నవాడు సుగుణాలు ఉన్నవాడు పుడతాడని ఆ తండ్రి చెప్పాడు. వేళకాని వేళ కోరిన కోర్కెకు విశ్వవో బ్రహ్మకు ఆగ్రహం వచ్చింది. శాంతింపజేయడానికి పంపిన పుష్పోత్కట వల్ల రావణ కుంభ కర్ణులూ మాలిని వల్ల విభీషణుడూ పాకతో ఖరుడూ – శూర్పణఖనూ కన్నారన్న కథా ఉంది. అంటే రావణుడూ వీభీషణుడూ ఒక తల్లి కడుపున పుట్టిన వారు కాదు… నిజానికి పుట్టుక ఏదన్నా కానీ శీలం ముఖ్యం! విభీషణుడు శీలవంతుడు. అందుకనే అన్న రావణునితో కూడా దుర్మార్గాలూ దుష్కార్యాలు చెయ్యలేదు. చేసిన వాటిని సమర్థించలేదు. కౄరత్వానికి కోసెడు దూరంలో ఉండేవాడు. అలాగని పిరికివాడు కాదు. ధైర్యసాహసాలున్న వాడు. బల పరాక్రమ వంతుడు. అన్న రావణుని పట్ల అభిమానం ఉన్నవాడు. మంచి చెడుల విచక్షణ ఎరిగినవాడు. కాబట్టే సీతను అపహరించుకు వస్తే తప్పన్నాడు. తగదన్నాడు. తిరిగి రామునికి అప్పగించి రమ్మన్నాడు. రాముని శక్తి యుక్తులు గుర్తుచేసాడు. కయ్యానికి కాలుదువ్వొద్దన్నాడు. రావణుడు వినకపోగా పగవాని పక్షాన నిలబడతావా అని కోపం పట్టలేక విభీషణున్ని లంక నుంచి తరిమేసాడు. లంకనీ అన్ననీ అయిన వార్ని వదిలి వెళ్ళడం కష్టమయింది. ఒంటరిగా రాముణ్ని చేరాడు. సుగ్రీవాదులు సందేహించినా రాముడు చేరదీసాడు. స్నేహం చెయ్యమన్నాడు. తమలో ఒకడిగా చూసుకున్నాడు. కడకు మిత్రుడయ్యాడు. సముద్రాన్ని దాటే ఉపాయం చెప్పాడు. చెప్పినట్టుగానే రాముడు సముద్రుణ్ని ప్రార్థించి సమస్యని దాటాడు.

ఏది ఏమైనా ఇంటికి సంబంధించిన గుట్టుమట్లన్నీ విభీషణుడు చెప్పేవాడు. చాలక అన్న రావణుడు పాతాళ హోమం చేయబోతున్న విషయం రాముడికి చెప్పాడు. ఆ హోమం పూర్తయితే యాగ ఫలితంగా రావణున్ని గెలవడం కష్టమని కూడా హెచ్చరించాడు. యాగాన్ని భంగం చెయ్యమన్నాడు. అదే మన బలమన్నాడు. బలాన్ని చూపించమన్నాడు.

చివరకు రామ రావణయుద్ధం మొదలయింది. ఇంద్రాజిత్తు చేతిలో రామ లక్ష్మణులు మూర్ఛపోయారు. హనుమంతుని సంజీవని తెచ్చి స్పృహలోకి తెచ్చినా ఎదుర్కోవడం కష్టమయింది. ఇంద్రజిత్తు శక్తి యుక్తులన్నీ ఎలా పొందగలిగిందీ ఎక్కడ దాయగలిగిందీ విభీషణుని ద్వారానే తెలిసింది. అవి ఉన్న గుడిని ధ్వంసం చేసి ఇంద్రాజిత్తు చనిపోవడంలో విభీషణునిదే కీలక పాత్ర. అంతే కాదు, రావణుని ఎదుర్కోవడం రామునికి కష్టమయిన సందర్భంలో విభీషణుడే సాయపడ్డాడు. రావణుని బొడ్డు దగ్గర అమృతభాండం ఉన్నదని ఆయువు పట్టుని అందించాడు. ఇంకేముంది?, రాముడు అమృత భాండం పగిలేలా రావణుని పొట్టలో బాణం వేసాడు. అలా రావణుని గెలవడంలోనూ విభీషణుడు రామునికి సాయపడ్డాడు. విజయం సాధించడంలో తన భాగస్వామ్యాన్ని అందించాడు.

రావణుని మరణం తరువాత విభీషణునికే లంకా పట్టాభిషేకం జరిగింది. భార్య “పరమ” సమేతంగా లంకను చాలకాలం పాలించాడు. రామభక్తునిగా కడవరకూ ఉన్నాడు.

కష్టకాలంలోనూ ధర్మ మార్గంలో నిలిచేలా, శిష్యరికం చేయకుండా బ్రహ్మాస్త్రం సంధించేలా అమరుడై జీవించి ఉండేలా మూడు వరాల్ని ముందే బ్రహ్మ నుండి తపస్సు చేసి పొందాడు విభీషణుడు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News