గిల్గమేష్ కథ (Devotional)
బాబిలోనియా శిథిలాలలో రాతి పలకలలో రాసిన కథ ఇది. వేల సంవత్సరాలకు ముందు రాసింది. మానవ ప్రయత్న పరిమితుల గురించిన కథ ఇది. గిల్గమేష్ అన్న అతను ఉరుక్ ప్రాంతానికి రాజు. ధైర్యశాలి. అతనికి “ఎంకిడు” అన్న ప్రాణమిత్రుడు ఉన్నాడు. ఒక రోజు “ఎంకిడు” హఠాత్తుగా చనిపోయాడు. ప్రాణమిత్రుడి మరణంతో గిల్లమేష్ గిలగల లాడిపోయాడు. గుండె పగిలేలా రోదించాడు. మెల్లగా తేరుకుని ఎట్లాగమయినా తన మిత్రుణ్ణి బతికించుకోవాలనుకున్నాడు. తన మిత్రుడులేని జీవితం వ్యర్థమని అతన్ని […]
బాబిలోనియా శిథిలాలలో రాతి పలకలలో రాసిన కథ ఇది. వేల సంవత్సరాలకు ముందు రాసింది. మానవ ప్రయత్న పరిమితుల గురించిన కథ ఇది.
గిల్గమేష్ అన్న అతను ఉరుక్ ప్రాంతానికి రాజు. ధైర్యశాలి. అతనికి “ఎంకిడు” అన్న ప్రాణమిత్రుడు ఉన్నాడు. ఒక రోజు “ఎంకిడు” హఠాత్తుగా చనిపోయాడు. ప్రాణమిత్రుడి మరణంతో గిల్లమేష్ గిలగల లాడిపోయాడు. గుండె పగిలేలా రోదించాడు.
మెల్లగా తేరుకుని ఎట్లాగమయినా తన మిత్రుణ్ణి బతికించుకోవాలనుకున్నాడు. తన మిత్రుడులేని జీవితం వ్యర్థమని అతన్ని బతికించుకోవాలని భావించాడు. చనిపోయిన మనిషిని బతికించడం అసాధ్యం. అయితే అది ఒక సంజీవని వల్లే సాధ్యం. ఆ సంజీవని “ఉత్నపిస్తం” అన్న ఆయన దగ్గరుంటుందని విన్నాడు. అందరూ “ఉత్నపిస్తం” స్వర్గానికి వెళ్ళి వచ్చాడని ఆయన దగ్గర అద్భుత శక్తులుంటాయని విశ్వసించేవాళ్ళు.
దేవతలు ఉత్నపిస్తంను జలప్రళయం నించి రక్షించి “దిల్‌మయ్” అన్న వనంలో ఉంచారు. అతనికి అమృతం ఇచ్చారు. గిల్గమేష్ ఎట్లాగయినా ఉత్నపిస్తం దగ్గరకు వెళ్ళాలని బయల్దేరాడు. పర్వతాలు, నదులు, లోయలు దాటి సుదీర్ఘ ప్రయాణం చేశాడు. దుర్గమారణ్యాల్లో ఎదురయిన దుష్ట జంతువుల్ని చీల్చి చెండాడాడు.
అట్లా ఎంతో దూరం నడిచి చివరకు “మాషు” అన్న పర్వతం దగ్గరకు చేరాడు. ఆ ప్రదేశం అద్భుతంగా, అందంగా ఉంది. ఆ పర్వతాన్ని తేలుకొండె మనుషులు కాపలా కాస్తున్నారు. వాళ్ళ దగ్గరున్న పాములు బుసలు కొడుతున్నాయి. అయినా గిల్గ మేష్ భయపడలేదు.
ఒక తేలుకొండె మనిషి గిల్లమేష్‌ను చూసి “యిప్పటి దాకా ఎవరూ ఇక్కడికి రాలేదు. ఈ ప్రదేశానికి వచ్చిన మొట్టమొదటి మనిషివి నువ్వే. ఇన్ని బాధలు పడి, ఇన్ని కష్టాలు పడి ఇక్కడికి ఎందుకొచ్చావు?” అన్నాడు. గిల్గమేష్ చెప్పాడు.
తేలుకొండె మనిషి అతని స్నేహవాత్సల్యానికి సంతోషించి “ఈ పర్వతంలో పన్నెండు ద్వారాలున్నాయి. అన్నీ చీకటిగా ఉంటాయి. అవి దాటితే నువ్వు ఉత్నపిస్తం” ఉనికి కనుక్కో గలవన్నాడు.
గిల్గమేష్ సాహసంతో పన్నెండు ద్వారాల్ని దాటాడు. కాంతి నిండిన ప్రదేశంలో అడుగు పెట్టాడు. దేవవనంలోకి వెళ్ళాడు. చెట్లన్నీ బంగారు రంగుతో, ఆకులు వెండితో, పూలు రత్నాలతో నిండి ఉన్నాయి.
అప్పుడు “సమాష్” అన్న అతను వచ్చి గిల్గమేష్‌ను జాలిగా చూసి “నువ్వు దేన్నయితే అన్వేషిస్తున్నావో అది నీకు దొరకదు” అన్నాడు. గిల్గమేష్ బాధగా “నా కష్టం నిష్ఫలం కావాలసిందేనా?” అని ఆక్రోశించాడు. తరువాత “సిదూరి” అన్న ఆమె అతన్ని అడ్డుకుంది. గిల్గమేష్ అక్కడ కనిపించిన వాటి నన్నిట్నీ ధ్వంసంచేశాడు. అతని కథవిని సిదూరి “నీ ప్రయత్నం నెరవేరదు. ఎందుకంటే దేవుడు మనిషికి జననంతో బాటు మరణాన్ని కూడా ఇచ్చాడు. అది అనివార్యం. బతికున్నన్ని నాళ్ళు సుఖించు. నువ్వు మరణాన్ని మార్చలేవు” అంది.
“మొదట నాకు ఉత్నపిస్తం” దగ్గరికి వెళ్ళే దారి చెప్పండి. నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. ఇంకొకరి సాయంతో బయల్దేరి ఉత్నపిస్తం ఉన్న చోటు చేరాడు.
ఉత్నపిస్తం అతని గాధను విన్నాడు. ఒక కత్తి ఇచ్చి ఒక్కో దెబ్బకి ఒక్కో చెట్టు చొప్పున నూట ఇరవై చెట్లు నరుకు అన్నాడు. గిల్గమేష్ ఆ పనిలో విజయం సాధించలేకపోయాడు.
ఉత్నపిస్తంకు అతని మీద జాలి కలిగి సముద్ర గర్భంలో ఒక ముళ్ల చెట్టు ఉంది. అదే సంజీవని, దాన్ని తీసుకెళ్ళు అన్నాడు.
గిల్గమేష్ సముద్ర గర్భంలోకి వెళ్ళి సంజీవని వృక్షాన్ని తీసుకుని బయలు దేరాడు. దారిలో ఒకసారి అలసిపోయి బావి గట్టున దాన్ని పెట్టి స్నానం చేసి వచ్చాడు.
ఆ సంజీవని పరిమళానికి ఒక ముసలి పాము అక్కడికి వచ్చి తాకి యవ్వనం తెచ్చుకుని వెళ్ళిపోయింది. దానికున్న కాంతి, శక్తి మాయమయ్యాయి. ప్రాణంలేని ఆ సంజీవనిని వదిలి పెట్టి నిరాశగా గిల్గమేష్ ఇంటికి వెళ్ళిపోయాడు.
మనిషి ఎంత ప్రయత్నించినా మరణాన్ని జయించలేడూ. కానీ మనిషి ప్రయత్నం అజేయమయింది. నిరంతర అన్వేషణ జీవన సారం.
– సౌభాగ్య