ప్రభావం (Devotional)

లోకంలో మనం గమనిస్తే ఎన్నో అసహజమయిన విషయాలు కనిపిస్తాయి. అధికారం ఉన్న వాడికి అడుగులకు మడుగులొత్తడం, సంపన్నుణ్ణి ఇంద్రుడు, చంద్రుడు అని పొగడడం చూస్తూ ఉంటాం. పేదవాళ్ళను గౌరవించం, ప్రేమించం. సామాజిక స్థాయిని బట్టి వ్యక్తిని గౌరవిస్తాం. భౌతిక సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళ ముందు తలవంచుతాం.             ఎంతో జ్ఞాన సంపన్నుడయిన ఒక సన్యాసి ఉంటాడు. రోజూ బిచ్చ మెత్తుకుంటూ ఉంటాడు. అతను తన ప్రతిభను ప్రదర్శించడు, ప్రచారం చేసుకోడు. అజ్ఞాతంగా జీవిస్తాడు. అజ్ఞాతంగా […]

Advertisement
Update:2015-06-06 18:31 IST

లోకంలో మనం గమనిస్తే ఎన్నో అసహజమయిన విషయాలు కనిపిస్తాయి. అధికారం ఉన్న వాడికి అడుగులకు మడుగులొత్తడం, సంపన్నుణ్ణి ఇంద్రుడు, చంద్రుడు అని పొగడడం చూస్తూ ఉంటాం. పేదవాళ్ళను గౌరవించం, ప్రేమించం. సామాజిక స్థాయిని బట్టి వ్యక్తిని గౌరవిస్తాం. భౌతిక సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళ ముందు తలవంచుతాం.

ఎంతో జ్ఞాన సంపన్నుడయిన ఒక సన్యాసి ఉంటాడు. రోజూ బిచ్చ మెత్తుకుంటూ ఉంటాడు. అతను తన ప్రతిభను ప్రదర్శించడు, ప్రచారం చేసుకోడు. అజ్ఞాతంగా జీవిస్తాడు. అజ్ఞాతంగా ఉండడంలోని ఆనందం అతనికి తెలుసు. అతన్ని నిర్లక్ష్యం చేస్తాం అతన్ని గౌరవించం. పైగా “వాడు సన్యాసి” అని తక్కువ చేసి మాట్లాడతాం.

రామకృష్ణ పరమహంస నిర్మలత్వం గురించి, నిరాడంబరత గురించి ఎన్నో కథలు చెబుతారు. అంతగా అహంకారాన్ని జయించిన మహాపురుషులు అరుదుగా ఉంటారు. ఆయన చాలా సాదా సీదాగా సరళంగా ఉండేవాడు.

పవిత్ర స్థలాల్ని సందర్శంచి వచ్చిన వాళ్ళపట్ల ఆయనకు ఎంతో గౌరవముండేది. వాళ్ళు కులీనులా, పేదవాళ్ళా అన్న స్పృహ ఆయనకు ఉండేది కాదు. అట్లాంటి పరిసరాల్నించీ వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆ పవిత్రత స్పర్శించివుంటుందని, ఆ ప్రభావం వాళ్ళ మీద ప్రసరించివుంటుందని ఆయన విశ్వసించేవాడు.

ఆయన పరమహంస. సాధుమూర్తి, అనంత సాత్వికతను రూపుదాల్చిన వాడు, యోగులకే యోగి. అందుకనే ఆయన్ని పరమహంస అన్నారు.

ఒకరోజు ఆయన్ని సందర్శించడానికి ఒక సామాన్యవ్యక్తి వచ్చాడు. అతను పేదవాడు. పరమహంస ఆ వ్యక్తని “ఎక్కడనించీ వచ్చావు?” అన్నాడు. అతను “స్వామీ! చైతన్య ప్రభువు జన్మ స్థలమయిన “బానిగాటి” నించీ వచ్చాను” అన్నాడు. ఆ మాటలు వింటూనే రామకృష్ణ పరమహంస ఆ వ్యక్తి పాదాలని స్పృశించాడు. ఆ వ్యక్తి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అంతటి మహాపురుషుడు నాలాంటి అల్పుడి పాదాలు తాకడమేమిటి? అనుకున్నాడు. చూస్తున్న వాళ్ళంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

ఒక వ్యక్తి “స్వామీ! మీరు పరమహంసలు. మీలాంటి మహాపురుషులు ఒక సాధారణ వ్యక్తి పాదాలకు మొక్కడమేమిటి?” అన్నాడు.

ఆ మాటలు విని పరమహంస “ఆ వ్యక్తి మేధావా? మామూలు మనిషా! సంపన్నుడా, పేదవాడా? అన్నదాంతో నాకు నిమిత్తం లేదు. అతను చైతన్య ప్రభువువంటి మహానుభావుడు పుట్టిన “బానిగాటి” నించీ వచ్చాడు. చైతన్య ప్రభువులు అక్కడే పుట్టి అక్కడ ఆనంద సంకీర్తనలు చేశాడు. ఆ ప్రాంతం నించీ వచ్చాననగానే నా మనసులో ఆనందతరంగాలు లేచి చైతన్యప్రభువు ప్రత్యక్షమవుతాడు. అందుకని ఆ ఆవిష్కారం కలిగించినందుకు కృతజ్ఞతగా అతని పాదాల్ని స్పర్శించాను” అన్నాడు.

అటువంటి లక్షణం కృతజ్ఞతలో భాగం. వ్యక్తి మనకు సాయం చేసినందుకు, మంచిమాట చెప్పినందుకు, మనలో మంచి ఆలోచనలు రేపినందుకు మనం అతని ముందు తలవంచాలి. అదే కృతజ్ఞత.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News