అరుంధతి (For Children)
పవిత్రతకు పట్టాభిషేకం చేస్తే అది అరుంధతి. పవిత్రతకు పర్యాయపదం చూస్తే అది అరుంధతి. పతివ్రతల్లో ప్రధమాక్షరి అరుంధతి. ఆకాశంలో నక్షత్రమై నిలిచిపోయింది అరుంధతి. పెళ్ళిసమయంలో వధూ వరులు చూసి తీరవలసిన సాంప్రదాయమయ్యింది అరుంధతి. వసిష్ఠమహర్షి అంతటి వానికి ధర్మపత్ని అయ్యింది అరుంధతి. ఇలా ఎన్నో విధాలుగా మనం తెలుసుకోవలసిన కథయ్యిందీ అరుంధతి! బ్రహ్మ పుత్రిక సంధ్యాదేవి. శివుని సన్నిధి నుండి వచ్చాక తనకు ఉపదేశం చేసే బ్రహ్మచారికోసం ఆమె వెదికింది. వసిష్ఠుని వల్ల ఆపని పూర్తిచేసి […]
పవిత్రతకు పట్టాభిషేకం చేస్తే అది అరుంధతి. పవిత్రతకు పర్యాయపదం చూస్తే అది అరుంధతి. పతివ్రతల్లో ప్రధమాక్షరి అరుంధతి. ఆకాశంలో నక్షత్రమై నిలిచిపోయింది అరుంధతి. పెళ్ళిసమయంలో వధూ వరులు చూసి తీరవలసిన సాంప్రదాయమయ్యింది అరుంధతి. వసిష్ఠమహర్షి అంతటి వానికి ధర్మపత్ని అయ్యింది అరుంధతి. ఇలా ఎన్నో విధాలుగా మనం తెలుసుకోవలసిన కథయ్యిందీ అరుంధతి!
బ్రహ్మ పుత్రిక సంధ్యాదేవి. శివుని సన్నిధి నుండి వచ్చాక తనకు ఉపదేశం చేసే బ్రహ్మచారికోసం ఆమె వెదికింది. వసిష్ఠుని వల్ల ఆపని పూర్తిచేసి అగ్నికి తన్ని తాను ఆహుతిచేసుకుంది. అప్పుడు ఆ అగ్నిలోనుండి ప్రాతః సంధ్య, సాయం సంధ్య పుట్టాయట. కాంతికి తోడుగా ఒక కాంతకూడా పుట్టిందట. ఆకాంతే అరుంధతిగా పేరు పెట్టారట. అలాగే అరుంధతిమాతంగమహర్షి కూతురని, మాతంగ (మాదిగ) కన్య అని వైదిక ధర్మ గ్రంధాలలో ఉంది. జనం కూడా అలాగే చెప్పుకుంటారు. భాగవతంలో దేవహూతి, కర్థమ ప్రజాపతుల సుతఅనీ ఉంది. వసిష్ఠుడంతటి వాడు ఆమెను తీసుకు వెళ్ళగా అరుంధతికి సౌభాగ్యమూ పాతి వ్రత్యమూ కలిగేలా మునులంతా వరాలిచ్చారు.
ముందు కథలో – వసిష్ఠుడు అమ్మాయిని పెళ్ళాడాలని వెదుకుతూ వెళ్ళాడట. ఇసుకను చేతిలోకి తీసుకున్నాడట. ఇసుకను వండి అన్నంగా పెట్టగల వారెవరైనా ఉన్నారా? అని అడిగాడట. అందరూ తమ వల్ల కాదంటే తమ వల్ల కాదని అనుకున్నారట. మాలపల్లె నుండి వచ్చిన ఓ అమ్మాయి అందుకు సిద్ధపడిందట. కుండలోని ఎసరలో ఇసుకని పోసిందట. పొయ్యిమీద పెట్టిందట. ఏక మనసుతో ధ్యానించి పూజించిందట. అప్పుడు ఇసుక అన్నంగా మారిందట. ఆమే అరుంధతి. అయితే అరుంధతి అన్నం వడ్డించిందట. వసిష్ఠుడు తినలేదు. పెళ్ళికాకుండా నీచేతి వంట ఎలా తింటాను అని అడిగాడట. అరుంధతి నిమ్మని ఆమె తల్లిదండ్రుల్ని అడిగాడట. అంగీకరించారు అమ్మానాయిన. అలా అరుంధతి పెళ్ళయిందన్నమాట.
పెళ్ళయిన తరువాత ఒకరోజు వసిష్ఠుడు అరుంధతి చేతికి కమండలం ఇచ్చి వెళ్ళాడట. వచ్చేవరకూ చూస్తూ ఉండమని చెప్పాడట. అరుంధతి అందుకున్న కమండలాన్ని చూస్తూ ఉండిపోయిందట. అలా తదేక దృష్టితో ఆమె చూస్తూనేవుందట. ఏళ్ళకి యేళ్ళు గడుస్తూనే ఉన్నాయట. అటు వసిష్ఠుడూ రాలేదు. అరుంధతి చూపు మరల్చనూలేదు. ఆమె ఏకాగ్రతకు లోకం ముక్కున వేలేసుకుందట. బ్రహ్మాదులు దిగి వచ్చారట. చూపు మరల్చమని కోరారట. అరుంధతి చెవికా మాటలు చేరలేదట. చివరకు వసిష్ఠుడినే తీసుకు వచ్చి అరుంధతి చూపు మరలేలాచూసాడట!
సప్త ఋషులు యజ్ఞం చేసినప్పుడు… యెప్పుడూ వసిష్ఠుని వెన్నంటి ఉండే అరుంధతిని చూసిన అగ్ని దేవునికి కోరిక కలిగిందట. సప్త ఋషుల భార్యలపట్ల కోరికతోదిగులుపడ్డ అగ్నిదేవుని గ్రహించిన ఆయన భార్య స్వాహాదేవి, తనకి తాను రోజుకో ఋషి భార్యగా అవతారం ధరించి భర్తను సంతోష పెట్టిందట. అరుంధతి అవతారం మాత్రంధరించలేకపోయిందట. అంత శక్తి మంతురాలు మహాపతివ్రతన్న మాట అరుంధతి. అందుకనే అరుంధతిని ఆదర్శంగా ఆచారంగా మన వివాహవ్యవస్థలో గొప్ప స్థానాన్ని ఇచ్చి గౌరవించారు.
అరుంధతికి “శక్తి” ఇంకా చాలామంది కొడుకులు కలిగారు. శక్తి కొడుకే పరాశరుడు. పరాశరుడి కొడుకే భారత భాగవతాది గ్రంథాలు రాసిన వ్యాసుడు!
అదన్నమాట అరుంధతి కథ!.
– బమ్మిడి జగదీశ్వరరావు