పోల్చుకోవడం (Devotional)

ఒక రాజు  గురువును సందర్శించాలన్న ఉద్దేశంతో ఓ ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమమంతా ప్రశాంతంగా ఉంది. పరిశుభ్రంగా ఉంది, నిర్మలంగా ఉంది. ఆశ్రమం వెనక ఒక తోట ఉంది. రకరకాల పూల మొక్కల్తో వృక్షాల్తో గాలితో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఎప్పుడయినా సమస్యలు వచ్చినపుడు ఆశ్రమానికి వచ్చి గురువు గారి సలహాలు తీసుకుని వెళ్ళేవాడు. అట్లాగే ఈసారి కూడా ఒక ఉద్దేశంతో ఆశ్రమానికి వచ్చాడు. గురువు ధ్యానం ముగించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా రాజు నమస్కరించాడు. గురువు ప్రత్యభివాదం […]

Advertisement
Update:2015-06-04 18:31 IST
ఒక రాజు గురువును సందర్శించాలన్న ఉద్దేశంతో ఓ ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమమంతా ప్రశాంతంగా ఉంది. పరిశుభ్రంగా ఉంది, నిర్మలంగా ఉంది. ఆశ్రమం వెనక ఒక తోట ఉంది. రకరకాల పూల మొక్కల్తో వృక్షాల్తో గాలితో వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఎప్పుడయినా సమస్యలు వచ్చినపుడు ఆశ్రమానికి వచ్చి గురువు గారి సలహాలు తీసుకుని వెళ్ళేవాడు. అట్లాగే ఈసారి కూడా ఒక ఉద్దేశంతో ఆశ్రమానికి వచ్చాడు. గురువు ధ్యానం ముగించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా రాజు నమస్కరించాడు. గురువు ప్రత్యభివాదం చేసి రాజును ఆహ్వానించి సుఖాశీనుణ్ణి చేశారు. ఇద్దరూ కాసేపు అవీఇవీ ముచ్చటించుకున్నాక రాజు తన ఆంతర్యం విప్పాడు.
“ఆచార్యా! పొరుగురాజు బాగా సంపన్నుడే. ఐశ్వర్యవంతుడే. అతని దగ్గర బోలెడంత సంపద ఉంది. అది మన సొంతమయితే మనకు తిరుగు ఉండదు. అందుకని నేను ఆ రాజ్యం మీద దండెత్తుదామనుకుంటున్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి” అన్నాడు. గురువు నిర్మలంగా రాజును చూశాడు. రాజు ముఖంలో రగులుతోన్న కాంక్ష కనిపించింది. కేవలం మాటల్తో అతన్ని శాంతింపచేయడం అసాధ్యమని గురువుకు అనిపించింది. గురువు ఎట్లాంటి ఆశీర్వాదమివ్వకుండా నిశ్చలంగా ఉండిపోవడం చూసి రాజుకు ఆశ్చర్యమేసింది. గురువు లేచి “రాజా! నన్ను అనుసరించు” అన్నాడు.
రాజు గురువును అనుసరించాడు. గురువు ఆశ్రమం వెనకనున్న ఆహ్లాదకరమైన తోటలోకి వెళ్ళాడు. రాజు అనుసరించాడు. జింకలు ఇటూ అటూ పరిగెడుతున్నాయి. పట్టలు కిలకిలా రావాలు చేస్తున్నాయి, చల్లగాలికి ఊగుతూ పూల చెట్లు. పెద్ద వృక్షాల కొమ్మలు కదుల్తున్నాయి. రాజు తోటలో ఉన్న ఒక రావి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళాడు. పక్కనే ఒక గులాబీ చెట్టు పూలతో కళకళలాడుతోంది.
గురువు ఆ రావి చెట్టును, గులాబీమొక్కను రాజుకు చూపించి “రాజా! ఈ గులాబీ చెట్టు పూలతో కళకళలాడుతోంది. ఆపూల కోసం ఎందరో వస్తూ ఉంటారు. ఆ రావి చెట్టు దగ్గరికి ఎవరూ రారు. కానీ ఆ రావి చెట్టు పిట్టలకు, జింకలకు నీడనిస్తుంది. గులాబీ చెట్టు పూలకోసం ఇంతమంది ఎప్పుడూ వస్తారే అని రావి చెట్టు ఎప్పుడూ ఈర్ష్యపడలేదు. రావిచెట్టు అంత పెద్దదవుదామని గులాబీ చెట్టు ఎప్పుడూ అనుకోలేదు. రెండూ హాయిగా ఉన్నాయి. తమ శక్తిని తమ ఎదుగుదలపైనే కేంద్రీకరించాయి కానీ ఇంకోదాన్ని అణచడంతో తమ ఎదుగుదల ఉందని ఎప్పుడూ అనుకోలేదు” అన్నాడు. రాజుకు అర్ధమయింది. తన అహంకారాన్ని పోగొట్టిన గురువుకు కృతజ్ఞత చెప్పి రాజు నిష్ర్కమించాడు.
Tags:    
Advertisement

Similar News