రాజపుత్రుడి త్యాగం
జయదేవుడు రాజకుమారుడు, తండ్రితో గొడవపడి రాజ్యం వదిలి భార్యాబిడ్డలతో పొరుగు రాజ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏవో పనులు చేసుకుంటూ జీవించసాగాడు. ఆ ప్రాంతంలో అతనికి మంచి పేరు వచ్చింది. అతని పేరు ఆ దేశం రాజు చెవిన పడింది. అతన్ని పిలిపించాడు, అతని పుట్టుపూర్వోత్తరాలు ఆరా తీశాడు. జయదేవుడు రాజకుమారుడని తెలిసి పైగా దూరపు బంధువని తెలిసి సంతోషించాడు. రాజు జయదేవుని కావలసిన సదుపాయాలు కల్గించి మంచి భవన మిచ్చి అతనికి ఏమికావాలో కోరుకోమన్నాడు. జయదేవుడు ‘రాజా! […]
జయదేవుడు రాజకుమారుడు, తండ్రితో గొడవపడి రాజ్యం వదిలి భార్యాబిడ్డలతో పొరుగు రాజ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏవో పనులు చేసుకుంటూ జీవించసాగాడు. ఆ ప్రాంతంలో అతనికి మంచి పేరు వచ్చింది. అతని పేరు ఆ దేశం రాజు చెవిన పడింది. అతన్ని పిలిపించాడు, అతని పుట్టుపూర్వోత్తరాలు ఆరా తీశాడు. జయదేవుడు రాజకుమారుడని తెలిసి పైగా దూరపు బంధువని తెలిసి సంతోషించాడు.
రాజు జయదేవుని కావలసిన సదుపాయాలు కల్గించి మంచి భవన మిచ్చి అతనికి ఏమికావాలో కోరుకోమన్నాడు. జయదేవుడు ‘రాజా! మీ అభిమానానికి నేను కృతజ్ఞుణ్ణి. నాకు ఏవయినా సాహసమయిన పనులు చెప్పండి. పనిలేని పక్షంలో మీరు కలిగించే సౌకర్యాల నాకు వద్దు, అన్నాడు. రాజు ఆమాటల్తో సంతోషించి, నా అంగరక్షకుడిగా వుండు. అవసరమయినపుడు నీకు పని చెబుతాను, అని రోజుకు వెయ్యి రూపాయలు జయదేవుడికి యివ్వమని కోశాధ్యక్షుడితో చెప్పాడు. అంత పెద్దమొత్తం జయదేవుడికి రోజూ యివ్వడం చూసి అందరూ ఈర్ష్య పడ్డారు.
ఒకరోజు హఠాత్తుగా పెద్దతుఫాను మొదలయింది. ఈదురుగాలులు, చెట్లు విరిగిపడుతున్నాయి. యిల్లు కూలుతున్నాయి చీకటి పడిపోయింది అప్పుడు రాజభవనానికి తూర్పు దిక్కునించీ ఎవరో స్త్రీలు ఆనందంతో పాటలు పాడుతూ వున్నట్లు వినిపించింది. రాజు ఆశ్చర్యపోయాడు, యింత వర్షంలో తుఫానులో కొందరు ఏడవడం, కొందరు పాటలు పాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
రాజు జయదేవుణ్ణి పిలిచి, ఇప్పుడు నీ సాహసానికి అవకాశం వచ్చింది వెంటనేవెళ్ళి కొందరు ఎందుకు ఏడుస్తునారో, కొందరు ఎందుకు నవ్వుతున్నారో కనుక్కునిరా, అన్నాడు.
జయదేవుడు మొదట ఏడుస్తున్న స్త్రీల దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ఏడుస్తున్నారు? అని అడిగాడు. వాళ్ళు రేపు ధర్మాత్ములయిన మన రాజుగారు చనిపోబోతున్నారు. ఆ బాధలో ఏడుస్తున్నాం అన్నారు. ఆ మాటలు విని దిగులు పడినా రాజు మళ్ళీ సహనంతో జయదేవుణ్ణి అనుసరించాడు. జయదేవుడు ఉత్తరద్వారం దగ్గర పాటలు పాడుతున్న స్త్రీల దగ్గరికి వెళ్ళి ‘ఎందుకు మీరు పాటలు పాడుతున్నారు?’ అని అడిగాడు వాళ్ళు, రేపు చనిపోబోతున్న రాజుగారు స్వర్గానికి వెళతారు. ఆయనకు తోడుగా మేమందరం వెళుతున్నాం ఆ ఆనందంతో గానం చేస్తున్నామన్నారు.
జయదేవుడు, అంత వుత్తముడు, ధర్మాత్ముడు అయిన రాజు బతికి వుండడానికి ఏ అవకాశమూ లేదా? అన్నాడు.
వుంది. ఎవరయినా రాజవంశానికి చెందిన వ్యక్తి ఆత్మబలిదానం చేస్తే రాజు బతికి వుండే వీలువుంది, అన్నారు.
జయదేవుడు, నేను రాజవంశీకుణ్ణే, నాది రాజరక్తమే నేను ఆత్మబలి దానానికి సిద్ధం అన్నాడు.
ఆ స్త్రీలు ఒకర్నొకరు చూసుకుని, ఐతే సిద్ధంకా, అన్నారు. జయదేవుడు నాకు ఒక్క అరగంట సమయమివ్వండి, యింటి దగ్గర నా భార్య ఎదురుచూస్తూ వుంటుంది. ఆమెతో ఒక్కమాట చెప్పి వస్తాను, అన్నాడు. యిదంతా రాజు గమనిస్తూనే వున్నాడు.
జయదేవుడు, యింటికి బయలుదేరాడు. రాజు రహస్యంగా అనుసరిం చాడు ఎందుకింత ఆలస్యం మీ కోసమే ఎదురుచూస్తున్నా, అందామె జయదేవుడు జరిగిన విషయమంతా వివరించి నన్ను అంతగా నమ్మిన రాజు కోసం నేను ప్రాణాలు సమర్పిస్తాను. అంతకన్నా నాకు అదృష్టమేముంటుంది? అన్నాడు.
అతని భార్య నిజమైన నమ్మకస్తుడయిన మనిషి చేసే పనే మీరూ చేస్తున్నారు. మీతో బాటు నేనూ ఆత్మబలిదానం చేస్తానంది జయదేవుడు, చిన్న వాడయిన మనకొడుకు వున్నాడు. అతని ఆలనాపాలనా ఎవరు చూస్తారు! నువ్వు వాడికోసం బతకాలి,అన్నాడు.
అయితే వాణ్ణి కూడా రాజు కోసం బలియిద్దాం. మనకుటుంబం ఆయనకు రుణపడివుంది. ఆ రుణం ఈ విధంగా తీర్చుకుందాం, అంది భార్య అంతా వెంటున్న రాజు ఆ కుటుంబం ధైర్యానికి, విశ్వాసానికి విస్తుపోయాడు.
జయదేవుడు భార్యతో, కొడుకుతో ఉత్తర ద్వారం దగ్గర వున్న స్త్రీల దగ్గరకు వెళ్ళాడు. ఆలస్యమైంది మన్నించండి అన్నాడు. మా కుటుంబమే ఆత్మ సమర్పణ చేసుకుంటుంది అన్నారు. మాకు అభ్యంతరం లేదని, వాళ్ళన్నారు.
మెరిసే ఖడ్గం తీసి కొడుకు తలను నరికాడు, ఇంకో వేటుతో భార్య తల నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆ స్త్రీలు, ఆగు! జయదేవా! నువ్వు వుత్తముడివి. త్యాగశీలివి. నీ త్యాగం అసమానం నిన్ను పరీక్షించడం కోసం వచ్చిన దేవదూతలం మేము. నీ కొడుకును కూడా బతికిస్తాం రాజు చిరాయువుగా వుంటాడు, అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు.
అంతవరకు అనుసరించిన రాజు ముందుకు వచ్చాడు. జయదేవుని త్యాగశీలానికి ముగ్థుడయి కన్నీళ్ళతో అతన్ని కౌగిలించుకున్నాడు.
ఆ రాజుకు సంతానం లేకపోవడంతో జయదేవుడే ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు.
– సౌభాగ్య