ఫలితం లేని ఫలితం (Devotional )
ఒక పర్షియా రాజు వృద్ధుడయ్యాడు, మంచమెక్కాడు. దానికితోడు అనారోగ్యం. మృత్యువు ఈరోజా రేపా అన్నట్లుంది. యవ్వన గర్వంలో ఉన్నపుడు ఆయన అంతులేని ఆనందాల్ని చవిచూశాడు. ప్రౌఢ వయసులో పర రాజ్యాలపై దండెత్తి ఆక్రమించాడు. కాంక్ష ఎటువేపు తీసికెళితే అటువేపు పరుగులు తీశాడు. ఇప్పుడు పరిస్థితి వేరు. వయసుదిగి పోయాడు. జీవనాసక్తి తగ్గింది. తను ఎంతో కాలం బతకనని అతనికి నమ్మకమేర్పడింది. అట్లాంటి పరిస్థితిలో మనిషి ఏం చేయాలి? అనివార్యతని ఆమోదించాలి. జీవితంలో మరణం అన్నది ఒక […]
ఒక పర్షియా రాజు వృద్ధుడయ్యాడు, మంచమెక్కాడు. దానికితోడు అనారోగ్యం. మృత్యువు ఈరోజా రేపా అన్నట్లుంది. యవ్వన గర్వంలో ఉన్నపుడు ఆయన అంతులేని ఆనందాల్ని చవిచూశాడు. ప్రౌఢ వయసులో పర రాజ్యాలపై దండెత్తి ఆక్రమించాడు. కాంక్ష ఎటువేపు తీసికెళితే అటువేపు పరుగులు తీశాడు. ఇప్పుడు పరిస్థితి వేరు.
వయసుదిగి పోయాడు. జీవనాసక్తి తగ్గింది. తను ఎంతో కాలం బతకనని అతనికి నమ్మకమేర్పడింది. అట్లాంటి పరిస్థితిలో మనిషి ఏం చేయాలి? అనివార్యతని ఆమోదించాలి. జీవితంలో మరణం అన్నది ఒక తప్పనిసరి అంశమని గుర్తించాలి. జీవితాన్ని, మరణాన్ని వేరువేరుగా చూసే మనుషులకే దుఃఖం ఉంటుంది. మనసులో కోరికలు, కల్పనలే దుఃఖకారకాలు.
ఆ రాజు ఎంత వృద్ధుడయినా రాజ్య నిర్వహణ అనివార్యం. ఆ వయసులో అతను అన్నీ వదులుకుని వారసుడెవ్వడికో బాధ్యతలు అప్పగించాలి. కానీ ఇంకా ఆ పని జరగలేదు. రాజ్యపాలన మంత్రి సామంతులు, సైనికాధికారులు చూస్తున్నారు.
రాజు పడకమీద ఉంటే ఒక సైనికాధికారి వచ్చి రాజా! ఎన్నాళ్ళగానో, ఎన్నేళ్ళగానో మనం ఆకోటను వశపరచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇన్నేళ్ళూ మన ప్రయత్నాలు ఫలించలేదు. మీ మనసులో ఎట్లాగయినా ఆ కోటను వశపరచుకుని ఆ ప్రాంతాన్ని మన రాజ్యంలో కలపాలనే కోరిక ఉండేది. ఇన్నాళ్ళకు అది నెరవేరింది. మీ కల సాకారమైంది అన్నాడు.
ఆ మాటలు విని చివరిదశలో ఉన్న రాజు చిరునవ్వు నవ్వాడు. “నువ్వు ఇప్పుడు చెప్పిన వార్త ఎప్పుడో మనసులో ఉన్న కోరికకు సంబంధించింది. ఇప్పుడు మనం అందుకున్న ఫలితం ఫలితంలేని ఫలితం. నిజానికి నేను ఎప్పుడు చనిపోతానో ఎప్పుడు సింహాసన మెక్కుదామా అని నా “వారసులు” వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నువ్వు ఈ వార్త వాళ్ళకు చెప్పు, వాళ్ళు సంతోషిస్తారు.
మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందనే ఆశతోనే జీవితం గడిచిపోయింది. ఇప్పుడు ఈ వృద్ధాప్యంతో, కాళ్ళూ చేతులు కదలలేని వయసులో, పరిస్థితిలో ఆ కోరిక తీరింది. ఎందుకు? ఏం ప్రయోజనం? గతించిపోయిన నా నవయవ్వనం వస్తుందా? తిరిగి రాదు కదా!
మృత్యు భేరి మోగుతోంది. ప్రపంచాన్ని పరిశీలిస్తున్న నా కనులూ! మీరు సెలవు తీసుకోండి. ఓ నా చేతుల్లారా! మీరు ఒక దాని నుండి ఒకటి వీడ్కోలు పలకండి!
ఏ శత్రువయినా నా మృత్యువునే కోరుతాడు కదా! అది నెరవేరబోతోంది! ఈ సుఖాన్ని వదిలి వెళుతున్నా! మిత్రులారా! ఎప్పటికయినా మీరు నా దగ్గరికి వస్తారనుకోండి సెలవు!
అంటూ రాజు కన్నుమూశాడు.
– సౌభాగ్య