డబ్బు సంచి (Devotional)
కొంతమంది ప్రపంచమే సర్వస్వమని రాత్రింబవళ్ళు కష్టపడి ధనం సంపాదిస్తారు. అటువంటి వాళ్ళు హఠాత్తుగా అన్నీవదిలేసి సన్యాసులవుతారు. కొందరు ఇహ పరాల్ని సమదృష్టితో చూస్తూ ప్రపంచవ్యవహారాలు కొనసాగిస్తూనే థార్మిక విషయాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. కొందరు సంపాదనలో కొంత డబ్బు పక్కన పెట్టి దాన్ని ధర్మాలకు, తీర్థ యాత్రలకు ఉపయోగిస్తారు. ఒక వ్యాపారస్థుడు సంవత్సరంలో నెలరోజుల పాటు తీర్థయాత్రలు చేసి పుణ్యస్థలాల్ని సందర్శించాలని సంకల్పించాడు. తగిన వస్త్రాలు, అవసరమయిన ఇతర వస్తువులు రెండు సంచుల్లో నింపుకునివాటితో […]
కొంతమంది ప్రపంచమే సర్వస్వమని రాత్రింబవళ్ళు కష్టపడి ధనం సంపాదిస్తారు. అటువంటి వాళ్ళు హఠాత్తుగా అన్నీవదిలేసి సన్యాసులవుతారు. కొందరు ఇహ పరాల్ని సమదృష్టితో చూస్తూ ప్రపంచవ్యవహారాలు కొనసాగిస్తూనే థార్మిక విషయాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. కొందరు సంపాదనలో కొంత డబ్బు పక్కన పెట్టి దాన్ని ధర్మాలకు, తీర్థ యాత్రలకు ఉపయోగిస్తారు.
ఒక వ్యాపారస్థుడు సంవత్సరంలో నెలరోజుల పాటు తీర్థయాత్రలు చేసి పుణ్యస్థలాల్ని సందర్శించాలని సంకల్పించాడు. తగిన వస్త్రాలు, అవసరమయిన ఇతర వస్తువులు రెండు సంచుల్లో నింపుకునివాటితో బాటు ఒక డబ్బు సంచిని కూడా వెంట తీసుకుని బయల్దేరాడు.
మార్గ మధ్యంలో ఎదురయిన గుళ్ళు గోపురాలు సందర్శిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మార్గంలో దొంగల భయముండేది. అందుకని చీకటి పడితే అక్కడున్న గుడిలోనో, దగ్గరున్న ధర్మసత్రంలోనో బస చేసేవాడు.
ఒక గుడిలో ఉన్నపుడు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో సత్కాలక్షేపమయింది. అతను ఎన్నెన్నో కొత్త విషయాలను, ధార్మిక సంగతుల్ని వ్యాపారస్థునికి చెబుతూ అతనికి సన్నిహితుడయ్యాడు. స్నేహితుడయ్యాడు. అతను కూడా పుణ్యస్థలాల సందర్శనకోసం బయల్దేరినట్లు చెప్పాడు. వ్యాపారస్థుడు ఎంతో సంతోషించాడు. ఒకరికి ఒకరు తోడుగా గుళ్ళు గోపురాలుసందర్శించారు. అట్లా కొన్నాళ్ళు గడిచాకా వాళ్ళు ఒకరోజు ఒక ధర్మ సత్రంలో విడిది చేశారు. స్నానపానాదులు ముగించి, భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. చాలా దూరంప్రయాణం చెయ్యడం వల్ల వ్యాపారస్థుడు, స్నేహితుడు ఇద్దరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు.
తెల్లవారు ఝామున స్నేహితుడు నిద్ర లేచాడు. వ్యాపారస్థుణ్ణి చూశాడు. వ్యాపారస్థుడు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. మెల్లగా లేచి గొడ దగ్గరవున్న వ్యాపారస్థుని సంచుల్ని వెతికాడు. అందులోఏమీ కనిపించలేదు. వ్యాపారస్థుడు డబ్బు సంచి ఎక్కడ దాచాడబ్బా అని అతను ఆశ్వర్యపోయాడు.
నిజానికి అతనొక దొంగ, తీర్థయాత్రికుల్ని అనుసరిస్తూ మెల్లగా వాళ్ళతో స్నేహం చేస్తూ ఏదో ఒక రాత్రి పూట దొరికిన సొమ్ములతో పారిపోయేవాడు.
అట్లా అతను వ్యాపారస్థుడితో స్నేహం చేశాడు. ధార్మిక విషయాలు చర్చించాడు. నమ్మకస్థుడుగా ప్రవర్తించాడు. వ్యాపారస్థుడి దగ్గర ఉన్న డబ్బు సంచిని చూశాడు. ఎట్లాగాయినా దాన్నిదొంగిలించాలని సమయం కోసం ఎదురు చూశాడు.
ఆ సమయం రానే వచ్చింది. కానీ వ్యాపారస్థుడి సంచులు వెతికినా డబ్బు సంచి కనిపించలేదు. దగ్గర పెట్టుకుని పడుకున్నాడా అని వెతికినా అదీ లేదు. సాధారణంగా తలకింద పెట్టుకునిపడుకుంటారు. అటూయిటూ తిరిగినప్పుడు తడిమిచూశాడు. అక్కడా లేదు.
ఆశ్చర్యంగా వచ్చి తన పడక మీద పడుకుని నిద్ర పోయాడు. ఉదయాన్నే లేచి ఉత్సాహాన్ని చంపుకోలేక “మిత్రమా! అన్యధా భావించకు. ఉత్సాహం కొద్దీ అడుగుతున్నాను. ఇంత నిశ్చితంగాపడుకున్నావు నీ డబ్బు సంచి ఎవరయినా అపహరిస్తారని నీకు దిగుల్లేదా?” అన్నాడు.
వ్యాపారస్థుడు నవ్వి “ఇక్కడున్నది మన మిద్దరమే. ఇద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం. కలిసి పడుకుంటున్నాం. నేను సందేహిస్తే, భయపడితే నీకు భయపడాలి. అందుకని ఎందుకయినా మంచిదని నీతలకిందనే నా డబ్బు సంచి ప్రతి రాత్రీ పెడుతున్నా” నన్నాడు.
ఆ మాటల్తో దొంగ మొఖం వెలవెల బోయింది. సత్యం కూడా డబ్బు సంచిలాంటిదే. అది ఎక్కడో ఉందని ఎప్పుడూ వెతుకుతూ ఉంటాం. మనలోకి ఎప్పుడూ మనం చూసుకోం!
-సౌభాగ్య