ఆమె ఇంటిదేవత...ఆమే అంటరానిది!
ఆమె ఇంటిదేవత…ఆమే అంటరానిది! అత్యంత సహజంగా….అసహజత్వం! కొన్ని విషయాలు వింటుంటే మనం టెక్నాలజీ పరుగులు తీస్తున్న కాలంలోనే ఉన్నామా…అనే సందేహం కలుగుతుంది. నేసాల్ రాజధాని ఖాఠ్మాండూకి దగ్గరలో ఉన్న నఖీపాట్ అనే ఊళ్లో సంగం శ్రేష్ట అనే అమ్మాయి ఉంది. ఆమెకు ఇప్పుడు పదిహేడేళ్లు. ఏడేళ్ల కిందట తన పదేళ్ల వయసులో ఆమెకు రుతుక్రమం మొదలైంది. ఆ సమయంలో ఆమె అనుభవించిన నరకం గురించి వింటే మనకు పైన వెలిబుచ్చిన సందేహమే కలుగుతుంది. ఆ సమయంలో ఆమె ఒక చీకటి గదిలో దాదాపు బందీగా […]
ఆమె ఇంటిదేవత…ఆమే అంటరానిది!
అత్యంత సహజంగా….అసహజత్వం!
కొన్ని విషయాలు వింటుంటే మనం టెక్నాలజీ పరుగులు తీస్తున్న కాలంలోనే ఉన్నామా…అనే సందేహం కలుగుతుంది. నేసాల్ రాజధాని ఖాఠ్మాండూకి దగ్గరలో ఉన్న నఖీపాట్ అనే ఊళ్లో సంగం శ్రేష్ట అనే అమ్మాయి ఉంది. ఆమెకు ఇప్పుడు పదిహేడేళ్లు. ఏడేళ్ల కిందట తన పదేళ్ల వయసులో ఆమెకు రుతుక్రమం మొదలైంది. ఆ సమయంలో ఆమె అనుభవించిన నరకం గురించి వింటే మనకు పైన వెలిబుచ్చిన సందేహమే కలుగుతుంది. ఆ సమయంలో ఆమె ఒక చీకటి గదిలో దాదాపు బందీగా ఉంది. సూర్యుడిని చూడకూడదు. తన ఇంట్లోని మగవారి మాటలను సైతం వినకూడదు. టాయ్‌లెట్‌కు సైతం బయటకు రాకూడదు. ఆ అవసరం కోసం ఆమె ఒక కుండని వాడాలి. అలా ఏడురోజులు గడిపింది. రుతుస్రావం మొదలయ్యాక మొదటి రెండు సార్లు ఇంతటి కఠిన నియమాలు పాటించాలి. ఇప్పటికీ ఆ సమయంలో ఆమె వంటగదిలోకి వెళ్లకూడదు. ఏ వస్తువులనూ ముట్టుకోకూడదు. చాలా గ్రామాల్లో చాలామంది మహిళలు, అమ్మాయిలు ఆ రోజుల్లో ఇంటికి దూరంగా కట్టిన షేడ్లలో, పశువులకొట్టాల్లో ఉంటారు. పాములు, పురుగులు లాంటివి భయపెడుతున్నా అలా ఉండాల్సిందే. 2005లో ఈ విషయం మీడియా ద్వారా బయటకు వచ్చింది. 2010లో ఐక్యరాజ్యసమితి వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం 11 సంవత్సరాల ఒక పాప అలా రుతుక్రమం మొదలైన సమయంలోనే అనారోగ్యానికి గురయింది. విరేచినాలతో ఆమె డీహైడ్రేషన్‌కు లోనయింది. ఆ సమయంలో ఆమెను ముట్టుకుంటే తాముఅపవిత్రులమై పోతాం అనే భయంతో ఇంట్లోవాళ్లు కానీ, చుట్టుపక్కలవాళ్లు కానీ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. పశ్చిమ నేపాల్ ప్రాంతంలో ఇలాంటి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్టుగా ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. కఠ్మాండూ లోయ ప్రాంతంలోనే నివసించే 17సంవత్సరాల కర్కి అనే అమ్మాయి మాటలు చూడండి .. నేను ఇంట్లో ఎవరూ లేవకముందే స్కూలుకి బయలుదేరాల్సి ఉంది. రుతుస్రావ సమయంలో వంటింట్లోకి వెళ్లకూడదు, ఏమీ ముట్టుకోకూడదు కాబట్టి ఏమీ తినకుండానే స్కూలుకి వెళ్లాలి. ఒక పక్క ఆకలి మరోపక్క ఈ పరిస్థితి,స్కూలు బ్యాగు మోసే శక్తి కూడా ఉండదు….ఈ మాటలు విన్నాక అమ్మాయిలకు సమాన అవకాశాలు ఇచ్చేశాం అని ఎవరైనా ధైర్యంగా అనగలరా? చుప‌్పడిగా పిలువబడే ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా పదేళ్ల క్రితమే ప్రభుత్వం జాతీయ చట్టాన్ని చేసింది. కానీ తాము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తే దేవుడిని నమ్మటం లేదని ఇంట్లోవాళ్లు బాగా తిడతారని కర్కి చెబుతోంది. అయితే విచిత్రమేంటంటే కర్కి, శ్రేష్ట ఇద్దరూ తమకు భవిష్యత్తులో అమ్మాయి పుడితే ఇందులో కొన్ని ఆచారాలను తప్పకుండా పాటిస్తామని చెబుతున్నారు. ఇందులో ఆశ్చర్యం లేదు. వారి మెదళ్లు అలా ట్యూన్ అయి ఉన్నాయి.
రుతుస్రావం సమయంలో అమ్మాయిలు అన్ని పనులు చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడని నేపాల్ గ్రామీణ ప్రాంత ప్రజలు నమ్ముతారు. వాళ్లు పుస్తకాలు ముట్టుకుంటే సరస్వతీ దేవి ఆగ్రహిస్తుందని నమ్ముతారు. ఆ సమయంలోనే కాకుండా బిడ్డకు జన్మనిచ్చిన సందర్భాల్లోనూ స్త్రీలు పదకొండు రోజులపాటు పశువుల కొట్టాల్లో ఉంటారు. ఆ సమయంలో పరిశుభ్రత, మంచి ఆహార లోపంతో చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారని మహిళా హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ ఫోన్ల మీద అవగాహన వచ్చినంత త్వరగా జనానికి మూఢ విశ్వాసాల గురించిన అవగాహన రావటం లేదు. హక్కులు, సమానత్వం సంగతి సరే….. మహిళలకు కనీసం వారి శరీరాల మీద వారికి అపరాధ భావంలేని ప్రేమని కలిగించడంలో సైతం ఆధునిక సమాజం విఫలమవుతున్నట్టే భావించాలి. మనుషులకోసం సంప్రదాయాలా, సంప్రదాయాల కోసం మనుషులా అనే నిలువెత్తు ప్రశ్న ఇంకా మనముందు కనబడుతూనే ఉంది. ఏ చట్టాలకు దొరకని ఇలాంటి హింసను, దారుణాలను మహిళలు అత్యంత సహజం అన్నట్టుగా భరించేస్తున్నారు. ఏ మూలాలను పెకలిస్తే ఈ హింస ఆగుతుంది…? మహిళలు ఎదుర్కొంటున్న వివక్షని ఒక సామాజిక రుగ్మతగా, తీవ్రమైన సమస్యగా ప్రభుత్వాలు, సమాజం ఎందుకు భావించడం లేదు. కనీసం ప్రశ్నలు కూడా లేకుండా ఆడవాళ్లు వీటిని ఎందుకు భరిస్తున్నారు అనేది అసలైన ప్రశ్న!