కుచేలుడు

కుచేలుడు (kucheludu, Sudama)… కృష్ణుడూ కుచేలుడూ చిన్ననాటి స్నేహితులు

Advertisement
Update:2022-08-07 15:13 IST

కుచేలుడు

కుచేలుడు… కుచేలుడు (kucheludu) కన్నా ముందు సుధాముడు. పాతవీ చిరిగినవీ బట్టలు కట్టుకొనే వాణ్నే కుచేలుడంటారు. ఆ అర్థంతోనే అతను కుచేలుడిగా పిలవబడ్డాడు. అంతటి పేదరికం… దారిద్ర్యం కుచేలునిది. ధనానికి లేనివాడే కాని గుణానికి లేనివాడు కాదు. కోరికలూ ఆశలూ వున్న వాడు కూడా కాదు!

కృష్ణుడూ కుచేలుడూ చిన్ననాటి స్నేహితులు. సాందీపుడనే గురువుగారి వద్దే ఇద్దరూ విద్యాబుద్దులు నేర్చుకున్నారు. ఆకాలంలోనే ఒక రోజు గురువుగారి భార్య సమిధలు తెమ్మని ఇద్దర్నీ అడవికి పంపింది. అనుకోకుండా గాలీ వానా ముంచెత్తింది. స్నేహితులిద్దరూ చెట్టెక్కారు. కృష్ణుడు చెట్టుపై నుంటే, కింది కొమ్మ మీద కుచేలుడున్నాడు. గురవమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని కుచేలుడు నములు తుంటే కృష్ణుడు అడిగాడట. చలికి దవడలు వణుకుతున్నాయని అబద్దం చెప్పాడట కుచేలుడు. ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది. అందుకు పర్యవసానంగానే కుచేలుడి కథ కనిపిస్తుంది.

కుచేలుడు పెద్దవాడయ్యాడు. పెళ్ళి చేసుకున్నాడు. భార్య వామాక్షి పేదరికాన్ని సయితం ప్రేమించగల ఇల్లాలు. దారిద్ర్యాన్ని భరిస్తూనే వచ్చింది. అథిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది. ఇరవైయ్యేడుగురు పిల్లలూ "అమ్మా ఆకలి… అమ్మా ఆకలి…" అని అడిగితే పట్టెడన్నం పెట్టలేక పోయేది.

ఈతి బాధలు భరించడం కష్టమై పోవడంతో మరో మార్గం లేక చిన్న నాటి మిత్రుడైన కృష్ణుణ్ని కలవమని భార్య కుచేలుణ్ని కోరుతుంది. ఏదో ఒక దారి దొరకక పోదా అని, ఏ ఆశాలేని కుచేలుడు సరేనన్నాడు. బయల్దేరిన కుచేలుడికి ఏం కానుక తీసుకెళ్ళాలో తెలియలేదు. అప్పుడు భార్య ఇంట్లో వెతకగా దొరికిన కాసిన్ని అటుకులను భుజమ్మీది తుండుగుడ్డలో చిరుగులు లేని చోట వేసి కట్టింది. కుచేలుడు ద్వారకకు బయల్దేరాడు. కాలినడకన వెళ్ళాడు. అలసిపోయి ఓ చెట్టుకింద చేరగిలబడ్డాడు. కునుకు పట్టింది. రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరంలో ద్వారక కనిపించింది. అప్పుడే వచ్చేసానా అని అనుకున్నాడట కుచేలుడు. కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలోవుండగా ఎత్తు కొచ్చి దింపిన సంగతి కుచేలునికి తెలియనే తెలియదు.

చిన్ననాటి మిత్రుడు తనను గుర్తు పడతాడో లేదోనని కుచేలుడు అనుమానించాడు. విరుద్ధంగా కృష్ణుడు ఆత్మీయంగా తన అంతఃపురంలోకే కాదు ఏకంగా అంతరంగిక మందిరంలో తన శయ్యమీద కూర్చోపెట్టి కుశల మడిగి తన రాణులకు పరిచయం చేసి, అంతా కలిసి పరిచర్యలు చేస్తుంటే కుచేలుడు నమ్మలేకపోయాడు. తను తెచ్చిన కానుకను ఇవ్వడానికే సిగ్గు పడ్డాడు. కాని కృష్ణుడు గ్రహించాడు. కుచేలుని చెంగున వున్న అటుకులను తీసి గుప్పెడు నోట్లో వేసుకున్నాడు. రెండో గుప్పెడు తీసుకోబోతే భార్య కృష్ణున్ని వారించింది.

ఎందుకంటే-తింటూ "సకలలోకాల్ని నన్నూ తృప్తి పరచడానికి!" అని కృష్ణడు అనడం-మళ్ళీ తినబోతే-సంతృప్తి పరచడానికి ఆ కుచేలుని వెంట తానూ వెళ్ళ వలసి వస్తుందని ఆమె భయపడిందన్నమాట. అందుకే ఆపింది. ఇవేవి తెలీని కుచేలుడు ఆత్మాభిమానంతో అడగలేకపోయాడు. ఇంటికి తిరుగుముఖం పట్టాడు. తన పూరి పాకమేడయ్యింది. దారిద్ర్యం బదులుగా ధనధాన్యాలూ సిరి సంపదలూ కుచేలుని ఇంట తాండవించాయి. నమ్మలేకపోయినా నారాయనుణ్ని తలచుకు నమస్కరించాడు.

తోటివాడే భగవంతుడని, భగవంతునికి అర్పించకుండా అంటే పెట్టకుండా తినడానికి ఫలితమిదని-పెట్టింది ఎక్కడికీ పోదని వెన్నంటే వస్తుందని చెప్పకనే చెపుతుంది భాగవతంలోని కుచేలుని కథ!.

– బమ్మిడి జగదీశ్వరరావు

Tags:    
Advertisement

Similar News