వైసిపి నేతల పక్కలో 'సత్తిబాబు' కత్తి ?
కాంగ్రెస్ ప్రముఖుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను వైసిపిలోకి తీసుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆసక్తి చూపుతుండటంతో బొత్సపై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను వీడి వైసిపిలోకి చేరిన నాయకులు ఇప్పుడు అయోమయంలోపడిపోయారు. జగన్ గురించి వారికి తెలిసినప్పటికీ విధిలేని పరిస్థితుల్లో తమ వంతు ప్రయత్నంగా ఆయన రాకను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందువల్లనే బొత్స సత్తిబాబు చేరిక ఆలస్యమవుతున్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో చేరిక అనివార్యంగా కనిపిస్తోంది, ఏదైనా ఊహించనిది జరిగితేతప్ప, ప్రాంతీయ రాజకీయ […]
కాంగ్రెస్ ప్రముఖుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను వైసిపిలోకి తీసుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆసక్తి చూపుతుండటంతో బొత్సపై వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను వీడి వైసిపిలోకి చేరిన నాయకులు ఇప్పుడు అయోమయంలోపడిపోయారు. జగన్ గురించి వారికి తెలిసినప్పటికీ విధిలేని పరిస్థితుల్లో తమ వంతు ప్రయత్నంగా ఆయన రాకను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందువల్లనే బొత్స సత్తిబాబు చేరిక ఆలస్యమవుతున్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో చేరిక అనివార్యంగా కనిపిస్తోంది, ఏదైనా ఊహించనిది జరిగితేతప్ప, ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో ఏకఛత్రాదిపత్యం, కుటుంబ ఆధిపత్యమే ప్రధానంగా కనిపిస్తుంటుంది. జాతీయ పార్టీల తరహాలో ప్రత్యామ్నాయ బహుళ నాయకత్వాలతో ప్రజాసామ్యయుతంగా వ్యవహారాలు సాగవు. ఒరిస్సా, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అటువంటి పార్టీలను చూస్తూనే ఉన్నాము. ఆ తరహాలోనే వైఎస్‌ఆర్‌సిపి ఉంటోంది. వాటి కన్నా కాస్త ఎక్కువ స్ధాయిలోనే వైఎస్‌ఆర్‌సిపిలో జగన్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆయన చెప్పిందే పార్టీలో వేదం. ఆయన మాటకు తిరుగులేదు. మరో మాటకు అవకాశంలేదు. అందువల్లనే సత్తిబాబు ప్రవేశానికి రంగం సిద్ధమయ్యింది. ఉత్తరాంధ్రలో పార్టీని పటిష్టపరచటానికి బలమైన నాయకుడు పార్టీకి కావాలని, అందుకు సత్తిబాబు సరిపోతారని ఆయన అంచనా.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ భవిష్యత్తు ప్రస్తుతానికి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. రఘువీరారెడ్డి నాయకత్వంతో ఎపిసిసి బలంగా పనిచేస్తున్నప్పటికీ బలమైన యంత్రాంగంలేకపోవటంతోపాటు విభజన అనంతరం ప్రజల్లో కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పార్టీ ఏతీరానికి వెళుతుందో అర్థంకాని పరిస్థితి. దాంతో సత్తిబాబు ప్రత్యామ్నాయాలను చాలాకాలంగా వెతుక్కుంటున్నారని ప్రచారంలో ఉంది. తొలుత బిజెపి వైపు ప్రయత్నించారు. అందులో సాధ్యంకాకపోవటంతోబాటు భవిష్యత్తులో రాష్ట్రంలో ఆపార్టీ అధికారంలోకి వచ్చే అవకాశంలేదని అంచనాకు వచ్చారని తెలుస్తోంది. ఫలితంగా ఆయన వైఎస్‌ఆర్‌సిపి వైపు చూపు చూశారు. అదే సమయంలో జగన్ కూడా చూపులు కలిపారు. దాంతో పరిస్థితి ఇద్దరికీ అనుకూలంగా మారింది. అందులోనూ ఇక జగన్ తలచుకున్నాక వైఎస్‌ఆర్‌సిపిలో అమలు జరిగి తీరాల్సిందే.
విచిత్రమేమిటంటే వారిద్దరూ రాజకీయంగా బద్ధశతృవులు కాకపోయినప్పటికీ అవసరాలకోసం అదే విధంగా వ్యవహరించారు. రాజకీయాలలో శాశ్వతంగా శతృవులు, మిత్రులు అంటూ ఉండరు. ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో తెలియని పరిస్థితి. ఎవరి భవిష్యత్తు వారికి ముఖ్యం కాబట్టి ఆ విధమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. అదే విధంగా వైఎస్ మరణానంతర పరిణామాల్లో భాగంగా జగన్ వైఎస్‌ఆర్‌సిపిని ఏర్పాటుచేసుకున్నాక జగన్‌పైన, వైఎస్‌ఆర్‌సిపి, వైఎస్‌పైన సత్తిబాబు తీవ్రంగా రాజకీయ విమర్శలు చేస్తుండేవారు. అప్పట్లో ఆయన మంత్రికావటంతోపాటు ఎపిపిసిసి అధ్యక్షుడు కూడాను. అంతటి తీవ్ర స్థాయిలో కత్తులు నూరుకున్న వారు ఇప్పుడు కలిసిపోవటం రాజకీయాలలో ఆశ్చర్యంగా కనిపించదు. అయితే సత్తిబాబుపైన వ్యతిరేకతతోనే అప్పట్లో కాంగ్రెస్ విజయనగరం జిల్లా ముఖ్యనాయకులు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ రంగారావు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి తదితరులు వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. ఓ విధంగా శ్రీకాకుళం జిల్లానేత ధర్మాన ప్రసాదరావుకూడా అంతే. వారికి సత్తిబాబుతో అప్పడు ఇప్పుడు మంచి సంబంధాలులేవు. దాంతో వారు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. వారు తమ అభ్యంతరాన్ని నేరుగా జగన్ వద్దనే వ్యక్తం చేశారని తెలిసింది. ఆయన మాత్రం తాను సత్తిబాబును తీసుకోవాలని నిర్ణయించానని, తనకు ఉత్తరాంధ్రకు ఆయన అవసరమని, మీ ప్రయోజనాలు తాను కాపాడతానని, సర్దుకుపోవాలని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ” మీ ప్రయోజనాలు కాపాడతానని ఆయన అనేక మందికి చెబుతుంటారు. కాని కాపాడేది ఉండదు. ఆ తర్వాత పట్టించుకోరు. అసలు ఆయన మాట మీద నిలబడే వ్యక్తికాదు. ఆయనపై పార్టీలో ఎవ్వరికీ విశ్వాసంలేదు. అందువల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ” సీనియర్లు సైతం చెబుతుంటారు. అందుకు కోకొల్లలుగా ఉదాహరణలు చూపిస్తుంటారు. ఇప్పుడు ఆ నాయకులు అయోమయంలో పడ్డారు.
ఇక్కడ ఇంకో ముఖ్యవిషయమేమిటంటే …. ఒక వరలో రెండు కత్తులు ఇముడుతాయా? అనే సందేహం. సత్తిబాబు స్థాయి తక్కువేమీకాదు. ఆయన ఎత్తు, భారీ ఖాయం తగిన విధంగానే మాటలు కూడా తూటాల్లా పేలతాయి. ఆయన మాటలు వేగంగా అర్థంకాన్నట్లు అనిపించిగా ఘాటుగానే ఉంటాయి. అందుకే ఆయనకు అంత ప్రాధాన్యత లభిస్తుంటుంది. ఆయన గతంలో జగన్‌ను తీవ్రంగానే విమర్శించారు. ఇప్పుడు బిజెపి, టిడిపి పార్టీలను కూడా ఆదేస్థాయిలో దుయ్యబడుతున్నారు, ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి విషయంలో. కాని ఈ విషయంలో జగన్ ఇంతవరకూ నోరు విప్పిందిలేదు. అందుకు కారణం కేసులు నేపథ్యంలో బిజెపితో సన్నిహితంగా మెలగదలిచారని టిడిపి ఆరోపిస్తోంది. మొత్తానికి కారణం ఏదైనప్పటికీ ఆయనే కాదు వైసిపి పార్టీ కూడా బిజెపి, టిడిపిలను విమర్శించటంలేదు. ఈ సందర్భంలోనే సత్తిబాబు వైసిపిలోకి వస్తున్నారు. ఆయన ఎప్పటిలాగానే మాట్లాడే స్వేచ్ఛ వైసిపిలోకి వచ్చిన తర్వాతకూడా కొనసాగుతుందా ? వేచి చూడాల్సిందే. ఆయన జగన్‌తో ఇమిడిపోయినా జగన్ ఆయనను కలుపుకుని పోగలరా? ఎందుకంటే ఎవ్వరైనా జగన్ తర్వాతనే. తన వెనుకనే పార్టీలో అందరూ పరుగులు తీయాలనే ధోరణి ఆయనది. మరి వేచి చూడాలి…. సత్తిబాబు వైసిపిలో చేరతారా? అందుకు పార్టీ నాయకులు అంగీకరిస్తారా? ఆయనను జగన్ కలుపుకునిపోతారా ? అనే విషయాలకు కాలమే సమాధానం చెబుతుంది. వేచిచూద్దాం.