సుగ్రీవుడు (STORY FOR CHILDREN)
వాలి తమ్ముడే సుగ్రీవుడు! వాలీ సుగ్రీవులు ఒక అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు. అన్యోన్యంగా పెరిగిన వాళ్ళు. వాలి కిష్కింధను ఏలుతుంటే, అన్నకు అనుకూలంగా అణకువగా వున్నాడు సుగ్రీవుడు. మరి అలాంటి అన్నదమ్ముల మధ్య వైరమెలా వచ్చింది? వాలి మరణాన్ని సుగ్రీవుడు ఎందుకు కోరుకున్నాడూ? కిష్కంధకు బయట మాయావితో వాలియుద్ధం చేస్తూ వుంటే తమ్ముడిగా సుగ్రీవుడు అన్న వెంట వెళ్ళాడు. తార కూడా వచ్చింది. మాయావి గుహలోకి దూరడమూ, వెంటపడి […]
వాలి తమ్ముడే సుగ్రీవుడు!
వాలీ సుగ్రీవులు ఒక అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు. అన్యోన్యంగా పెరిగిన వాళ్ళు. వాలి కిష్కింధను ఏలుతుంటే, అన్నకు అనుకూలంగా అణకువగా వున్నాడు సుగ్రీవుడు.
మరి అలాంటి అన్నదమ్ముల మధ్య వైరమెలా వచ్చింది? వాలి మరణాన్ని సుగ్రీవుడు ఎందుకు కోరుకున్నాడూ? కిష్కంధకు బయట మాయావితో వాలియుద్ధం చేస్తూ వుంటే తమ్ముడిగా సుగ్రీవుడు అన్న వెంట వెళ్ళాడు. తార కూడా వచ్చింది. మాయావి గుహలోకి దూరడమూ, వెంటపడి వాలి వెళ్ళడమూ – వెళ్ళిన వాళ్ళు రాకపోగా రక్తం ఏరులుగా ధారలు కట్టడమూ – దాంతో తమకు ఆపద శంకించడమూ – గుహకు అడ్డంగా పెద్ద రాతిని వుంచి రాజ్యానికి తిరిగి రావడమూ – తారతో పాటు రాజ్యాన్నీ సుగ్రీవుడు ఏలడమూ – రాతిని తొలగించుకొని వాలి రావడమూ – వంచనగా భావించడమూ – వైరం ప్రకటించడమూ – సుగ్రీవుడు రాజ్యం వదిలి పారిపోవడమూ – ఋష్యమూక పర్వతం చేరడమూ – హనుమంతుడూ, జాంబవంతుడూ, మైందుడూ, ద్వివిథుడూ వీరంతా సుగ్రీవుని దగ్గర మంత్రులుగా వుండడమూ – సీత జాడ వెదుక్కుంటూ రాముడు రావడమూ – సుగ్రీవుడు భయంతో అనుమానించడమూ – ఆంజనేయుడు నివృత్తి చేయడమూ – సీత జాడ తెలియకపోయినా ఆమె ఆభరణములు చూపించడమూ – సహాయం చేస్తానని మాటయివ్వడమూ – తన భార్య వియోగం పోగొట్టాలని అన్నను సంహరించాలని కోరడమూ – మాట తప్పని రాముని వల్ల కోరిక నెరవేరడమూ – ఆపైన రామునికిచ్చిన మాట మరచి మద్యానికి దాసోహమవ్వడమూ – లక్ష్మణుని కన్నెర్రకు గురి కావడమూ – చివరకు తమ ఆంజనేయుడి ద్వారా సీత జాడ కనుగొనడమూ – రావణునితో యుద్ధంలో రామునికి సాయం చేయడమూ – సీతా రాముల వెంట అయోధ్యకు వెళుతూ అంగధునికి పట్టాభిషేకం చేసి తార మనసు గెలుచుకోవడమూ – శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత అయోధ్య నుండి తిరిగి కిష్కింధకు రావడమూ రాజ్యాన్ని ఏలడమూ – ఇది సుగ్రీవుని సుదీర్ఘ కథ!
సుగ్రీవుడు సూర్యుని వల్ల అహల్యకు పుట్టిన వాడు. సుందర రూపుడు. అయితే తండ్రి గౌతముడు తన బిడ్డలేనని అపురూపంగా పెంచుకున్నాడు. అసలు నిజం తెలిసి “వానరులు కండి!” అని ఆ తండ్రే శపించాడు. సముద్రంలో విసిరేసాడు. ఋక్ష విరజుడు చేర దీసాడు. అన్నవాలిని కిష్కింధకు రాజుని చేస్తే-అన్న కనుసన్నల్లో మెలిగిన సుగ్రీవుడు అపోహల వల్ల అభద్రత వల్ల అన్నకు శాశ్వత శత్రువుగా మారి మరణానికి కారకుడయ్యాడు!
అన్నకోసం జీవితాన్నే అర్పణ చేసిన లక్ష్మణుడున్న రామాయణంలోనే అన్నప్రాణం కోరిన సుగ్రీవుడూ వున్నాడు!.
– బమ్మిడి జగదీశ్వరరావు