ఇమేజ్ కోసం కూలీల ప్రాణాలు పణం !

రాష్ట్ర విభజనానంతరం ఎపిలో పలు ఘటనల్లో ప్రజల ప్రాణాలు తృణప్రాయంగా గాల్లో కలిసిపోయినప్పటికీ శేషాచలం మాత్రం అందుకు భిన్నమైనది. ఇది ప్రమాదవశాత్తూనో లేక నిర్లక్ష్యం వల్లనో జరిగిన సంఘటన కానేకాదు. తెలిసి జరిగినదే. పైగా అది ఎన్‌కౌంటర్‌. ఆ విషయం నేరుగా పోలీసు అధికారులే ఆ రోజు ఉదయాన్నే సగర్వంగా ప్రకటించుకున్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనే ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిల్లో అత్యధికం బోగస్‌, ఫేక్‌. అయినా ఏ ఒక్క సంఘటనలోనూ ఏ ఒక్క పోలీసు అధికారికీ శిక్ష […]

Advertisement
Update:2015-04-18 11:40 IST

రాష్ట్ర విభజనానంతరం ఎపిలో పలు ఘటనల్లో ప్రజల ప్రాణాలు తృణప్రాయంగా గాల్లో కలిసిపోయినప్పటికీ శేషాచలం మాత్రం అందుకు భిన్నమైనది. ఇది ప్రమాదవశాత్తూనో లేక నిర్లక్ష్యం వల్లనో జరిగిన సంఘటన కానేకాదు. తెలిసి జరిగినదే. పైగా అది ఎన్‌కౌంటర్‌. ఆ విషయం నేరుగా పోలీసు అధికారులే ఆ రోజు ఉదయాన్నే సగర్వంగా ప్రకటించుకున్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనే ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. వాటిల్లో అత్యధికం బోగస్‌, ఫేక్‌. అయినా ఏ ఒక్క సంఘటనలోనూ ఏ ఒక్క పోలీసు అధికారికీ శిక్ష పడలేదు. ఫలితంగా ప్రభుత్వాలకు, రాజ్యం (పోలీసులకు) ఎన్‌కౌంటర్‌లంటే సునాయాసంగా చేసెయ్యవచ్చనే ధైర్యం మెండు. ఆ కోవలోకే శేషాచలం వచ్చి చేరిపోతుందని ఎపి పోలీసు అధికారులు ధైర్యంతో కానిచ్చేశారట. పైగా ఇందుకు ఉన్నతస్థాయి నుంచి ముందుగానే అనుమతి లభించటంతో అధికారులు అందుకు పచ్చజెండా ఊపేశారు. ఇంకేముందు 20 మంది కూలీల ప్రాణాల పోలీసుల తూటాలకు నేలకొరిగాయి. దీనికి ఎవరు బాధ్యులు ? ప్రభుత్వంలోని పెద్దలా ? ఉన్నతాధికారులా ? లేక క్షేత్రస్థాయిలో పోలీసులు తమ తుపాకులు పనిచేస్తున్నాయో లేదోనని పరీక్షించేందుకు వారిని బలితీసుకున్నారా లేక తమ అధికారులు హతమార్చారు కాబట్టి అందుకు ప్రతీకారంగా కూలీల కుటుంబాలను వీధులపాల్జేయాలనుకుని అందుకు పాల్పడ్డారా ? అంటే అవేమీకాదు ‘ఇమేజ్‌’ కోసం అనే సమాధానం లభిస్తోందిప్పుడు. ఇమేజ్‌ ఎవరికి ? ఎందుకు అంటే విస్తుపోయే సమాధానాలు పోలీసు ఉన్నతాధికార యంత్రాంగంలో చర్చనీయాంశం అయ్యింది. విన్నవారికి అశ్చర్యమే మిగులుతుంది.

ఈ నేఫథ్యంలోనే గతంలో చంద్రబాబు పాలనను గుర్తుచేసుకుంటే దీనికి సులభంగానే సమాధానం లభిస్తోంది. 1995'2004 మధ్య కాలంలో చంద్రబాబునాయడు అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై అలిపిరి వద్ద నక్సలైట్లు దాడిచేసి హత్యాయత్నానికి ప్పాల్పడిన సంగతి తెలిసిందే. అది తప్పే, కాని ఆ పరిస్థితి రావటానికి అప్పట్లో చంద్రబాబు పాలనలో రాజ్యహింస పెరిగిపోవటమే కారణమని నక్సలైట్లు ఆరోపిస్తూ వచ్చారు. అదే సందర్భంలో కర్నూలు, అనంతపురం, గుంటూరు, విజయవాడలతోపాటు తెలంగాణలోనూ ఎన్‌కౌంటర్లకు అద్దూఅదుపూలేకుండా పోయింది. విచ్చలవిడిగా వందలమందిని హతమార్చారు. ఇదంతా అప్పట్లో ఇమేజ్‌ కోసమే జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, సంఘవ్యతిరేక శక్తులను సహించేదిలేదని పాలకులు తరచూ చెప్పేదానికి అనుగుణంగానే ఎన్‌కౌంటర్లు జరుగుతుండేవి.

సీన్‌ కట్‌చేస్తే…. ఇప్పుడు ఎన్‌కౌంటర్లు చేయటానికి ఎపిలో నక్సలైట్లు లేరు. ఇక మిగిలిందల్లా ఇసుకు లేదా ఎర్రచందనం మాఫియాకు చెందినవారు. ఇసుక మాఫియా మొత్తం అధికారపార్టీ కనుసన్నల్లో ఉంది. ఇక మిగిలింది ఎర్రచందనం స్మగ్లర్లు. పైగా వీరు ఇటీవలనే అటవీ అధికారులను మట్టుబెట్టారు. అదేసమయంలో గతంలో కాంగ్రెస్‌తోనూ ఇప్పుడు వైసిపి పార్టీతోనూ సంబంధాలు ఉన్న గంగిరెడ్డి ఇటీవలనే విదేశాల్లో దొరికిపోయాడు. ఇంకేముందు ఎర్రచందనం స్మగ్లర్లను మట్టుబెట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇమేజ్‌ పెంచుకోవాలి. అందులో భాగంగా టాస్క్‌ఫోర్స్‌ను డిఐజి అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తోంది. పోలీసులు తమ ప్రతీకారం చూపించుకోలేకపోతున్నారు. అంతే ఉన్నతస్థాయిలో వారికి ‘ఇమేజ్‌’ రావటంలేదంటూ అసహనం పెరిగిపోయింది. దాంతో తమ కింది అధికారులపై ప్రతాపం చూపించారు. ఆ అధికారులు తమ కిందివారిని మందలించారు. అంతే తుపాకులు ఎక్కుపెట్టి కూలీలను మట్టుబెట్టి మారణహోమానికి పాల్పడి బడుగులపై పాశవికంగా కక్ష తీర్చుకున్నారు.. పైగా బక్కచిక్కి ఎండిపోయిన జీవాల్లాంటి వారిని కాల్చేశారు. నిజంగా స్మగ్లర్లను హతమార్చి ఉంటే (తప్పయినా) ఇంత వ్యతిరేకత వచ్చేదికాదు. కూలీలు కావటంతో ప్రభుత్వం ఇమేజ్‌ పెంచుకునే పన్నాగం బెడిసికొట్టి అధ:పాతాళానికి దిగజారిపోయింది. పైగా దళితులు, గిరిజనులు. శవాలను చూస్తే వారు స్మగ్లర్లు అనే విషయం ఎవ్వరూ ఒప్పుకోరు. కాని ప్రభుత్వ దృష్టిలో వారు మాఫియా డాన్‌లు. దానికి తోడు అందరూ తమిళనాడు వారు కావటంతో ఇన్నాళ్ళూ కావేరి నీటి విషయంలో కర్నాటకతోనే తగాదా పడుతూ వస్తున్న తమిళనాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తోనూ కయ్యానికి దిగింది. ఇందులో వారి తప్పేమీలేదు. తప్పంతా ఇమేజ్‌ కోసం పాకులాడే వారిదే. తీరా చూస్తే ఇటు సమాజం దృష్టిలోనూ, అటు న్యాయస్థానాల ముందు పోలీసు అధికారులు దోషులుగా కనిపిస్తున్నారు. కాని ద్రోహం మాత్రం ‘ఇమేజ్‌’ది. ఇమేజ్‌ రాకపోగా అధికారులు మాత్రం బుక్కయ్యారు. అధికారుల పట్ల్ల సానుభూతి లేదు ఎవ్వరికీ ఈ హత్యకాండలో.

కొసమెరుపేమంటే ఎన్‌కౌంటర్‌ అనేది రెండు వైపుల నుంచీ తుపాకులతో కాల్పులు జరుగుతాయి. తొలుత పోలీసులపై కాల్పులు జరిగితే తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సాయుధ బలగాలు ఎదురు కాల్పులు జరుపుతాయి. దాంతో పోలీసులకు ఎదురుగా ఉన్నవారు మరణిస్తారు. కాని శేషాచలంలో మాత్రం కూలీలు రాళ్ళతో దాడి జరిపితే అందుకు ప్రతిగా పోలీసులు తుపాకులతో కూలీలను ఎలా మట్టుబెడతారు? ఈ చిన్నలాజిక్‌ను మిస్‌ అయ్యి ఇమేజ్‌ ముసుగు బట్టబయలయ్యింది.

Tags:    
Advertisement

Similar News