పేదతనం
బుద్ధుడు సర్వసంగపరిత్యాగి. అన్నీ వదులలుకున్న వాడు. ఏమీ లేనివాడు. భిక్షాటనతో జీవించే వాడు. ప్రపంచంతో అనుబంధాలు లేనివాడు. కానీ బుద్ధుడిలో పేదతనం కనిపించేది కాదు. అసంతృప్తి కనిపించేది కాదు. పరిపూర్ణ ఆనందం, సంపూర్ణ సంతృప్తి ఆయనలో తాండవించేవి. గొప్ప నిర్మలత్వం. నిశ్చలత్వం ఉండేవి. దేన్ని గురించైనా సందేహం, సంశయం ఆయన్లో కనిపించవు. అన్నిటిపట్లా గొప్ప అవగాహన, స్పష్టత ఆయనకు ఉండేవి. సాధారణ మానవులు ఆయన్ని దైవాంశ సంభూతుడుగా భావించారు. దైవంగానే భావించారు. అవతార పురుషుడన్నారు. […]
Advertisement
బుద్ధుడు సర్వసంగపరిత్యాగి. అన్నీ వదులలుకున్న వాడు. ఏమీ లేనివాడు. భిక్షాటనతో జీవించే వాడు. ప్రపంచంతో అనుబంధాలు లేనివాడు. కానీ బుద్ధుడిలో పేదతనం కనిపించేది కాదు. అసంతృప్తి కనిపించేది కాదు. పరిపూర్ణ ఆనందం, సంపూర్ణ సంతృప్తి ఆయనలో తాండవించేవి. గొప్ప నిర్మలత్వం. నిశ్చలత్వం ఉండేవి. దేన్ని గురించైనా సందేహం, సంశయం ఆయన్లో కనిపించవు. అన్నిటిపట్లా గొప్ప అవగాహన, స్పష్టత ఆయనకు ఉండేవి.
సాధారణ మానవులు ఆయన్ని దైవాంశ సంభూతుడుగా భావించారు. దైవంగానే భావించారు. అవతార పురుషుడన్నారు. ఆయన్లో దివ్య తేజస్సుతో దిగ్ర్భమ చెందారు. అట్లా ఆయన పట్ల ఆకర్షితులైన వాళ్లు ఎందరో.
వందల వేల మంది ఆయన అనుచరులయ్యారు. ఎందరో తమ సందేహాల్ని వెలిబుచ్చితే ఆయన అందరికీ తగిన సమాధానాలు చెప్పేవాడు. దాంతో తమ సమస్యలకు ఆయన దగ్గర సమాధానాలున్నాయని సాధారణ ప్రజలు అనుకోవడం సర్వసాధారణ.
ఒక పేదవాడు ఏమీ లేనివాడు. తన దరిద్ర్యానికి విరుగుడు బుద్ధ భగవానుని దగ్గర ఉంటుందని, దాని నుంచి తనకు విముక్తి కలిగిస్తాడనీ ఆశతో బుద్ధుని దగ్గరకు వెళ్లాడు.
బుద్ధుడికి ఆ పేదవాడు నమస్కరించాడు. బుద్ధుడు ప్రసన్న వదనంతో అతన్ని చూశాడు. ఆ పేదవాడు ‘నేనెందుకు పేదవాడు’గా ఉన్నాను. అని అడిగాను.
ఎదుటి మనిషిని మనం నమ్ముతుంటే అతని దగ్గర మన కోసం సిద్ధం చేసిన సమాధానాలు ఉంటాయని, వాటితో మన సమస్యలు పరిష్కరింపబడతాయని తీర్మానించుకుంటాం.
బుద్ధుడు ఆ పేదవాడితో ‘నువ్వు ఇవ్వడం నేర్చుకోలేదు’ అన్నాడు.
పేదవాడు ఆశ్చర్యపోయాడు. తన దగ్గర ఎర, ఏగానీ లేదు. బుద్ధుడేమో నేను ఇవ్వడం నేర్చెకోలేదంటాడు. అనుకుని ‘నా దగ్గర ఏమీ లేదు’. అన్నాడు.
బుద్ధుడు ‘నీ దగ్గర ఎంతో విలువైనవి ఉన్నాయి’. అన్నాడు. పేదవాడు ‘చిరిగిన బట్టలు తప్ప నా దగ్గరేమున్నాయి’ అని చూసుకున్నాడు.
బుద్ధుడు ‘నీ ముఖముంది. దాని గుండా నువ్వు చిరునవ్వును అందించవచ్చు.
నోరు ఉంది. దాంతో ఎదుటి వ్యక్తుల్ని అభినందించవచ్చు.
హృదయముంది. అందరి ముందూ మనసు విప్పవచ్చు.
కళ్లున్నాయి, మంచితనంతో అందర్నీ చూడవచ్చు.
శరీరముంది, దాని ద్వారా ఇతరులకు సాయం చేయవచ్చు’. అన్నాడు.
ఆ మాటల్తో పేదవాడు నిశ్చేష్టుడయ్యాడు. అతని కళ్లు తెరుచుకున్నాయి.
నిజానికి ప్రపంచంలో పేదవాడంటూ ఎవడూ లేడు. దరిద్రమంటూ లేదు. శ్రమించే వాడికి దరిద్రముండదు. నిజమైన దరిద్రం అది కాదు. నిజమైన దరిద్రం ఆధ్యాత్మిక దరిద్రం. మన గురించి మనకు స్పష్టత లేకపోవడం. మనమేమిటో మనం తెలుసుకోకపోవడం. అదే నిజమైన పేదతనం.
– సౌభాగ్య
Advertisement