భవిత

నారదుడు కలహభోజనుడు. పైగా నిరంతర సంచారి. అన్ని లోకాలూ తిరుగుతూ వుంటాడు. అందర్నీ పరిశీలిస్తాడు. అందరికీ సలహాలిస్తాడు. సమస్యలు పరిష్కరిస్తాడు. సమస్యలు కూడా ఆయనే సృష్టిస్తాడు. ఆయనే పరిష్కరిస్తాడు. ఆయనకు యిద్దరు కలహించుకుంటూ వుంటే ఆనందం. ఒక రోజు నారదుడు ఒక గ్రామం మీదుగా వెళుతున్నాడు. ఒక చేద బావి దగ్గర ముగ్గురు స్త్రీలు నీళ్ళు తోడుతూ కనిపించారు. నిశ్శబ్దంగావున్న ఆ వాతావరణాన్ని కలకల లాడించాలని బుద్ధి పుట్టింది. వెంటనే వారి దగ్గరికి వెళ్ళి తలవంచి నమస్కరించి […]

Advertisement
Update:2015-04-11 02:45 IST
	నారదుడు కలహభోజనుడు. పైగా నిరంతర సంచారి. అన్ని లోకాలూ తిరుగుతూ వుంటాడు. అందర్నీ పరిశీలిస్తాడు. అందరికీ సలహాలిస్తాడు. సమస్యలు పరిష్కరిస్తాడు. సమస్యలు కూడా ఆయనే సృష్టిస్తాడు. ఆయనే పరిష్కరిస్తాడు. ఆయనకు యిద్దరు కలహించుకుంటూ వుంటే ఆనందం.  	  ఒక రోజు నారదుడు ఒక గ్రామం మీదుగా వెళుతున్నాడు. ఒక చేద బావి దగ్గర ముగ్గురు స్త్రీలు నీళ్ళు తోడుతూ కనిపించారు. నిశ్శబ్దంగావున్న ఆ వాతావరణాన్ని కలకల లాడించాలని బుద్ధి పుట్టింది. వెంటనే వారి దగ్గరికి వెళ్ళి తలవంచి నమస్కరించి అక్కడి నించి వెళ్ళిపోయాడు. నారదమహర్షి అంతటి వాడు తమకు నమస్కరించినందుకు వాళ్ళకు ఎంతో సంతోషం వేసింది. కానీ ఎవరికి వారు తమకే నారదముని నమస్కరించాడని అనుకున్నారు.
	మొదటి స్త్రీ నారదముని నాకే నమస్కరించాడని అంది. రెండో స్త్రీ నాకే అంది. మూడో స్త్రీ నాకే అంది. గొడవ మొదలయింది. చిలికి చిలికి గాలి వానగా మారింది. నాకంటే నాకని ముగ్గురూ జుట్లు పట్టుకునే దాకా వచ్చింది. వాళ్ళు నీళ్ళు తోడడం ఆపి ఘర్షించుకోవడం మొదలు పెట్టారు.  	  నిజానికి నారదుడు అక్కడినించీ వెళ్ళిపోలేదు.దగ్గరగా వున్న ఒక పొదలో దాక్కుని వాళ్ళ ముగ్గురి పోట్లాటనూ చూసి వినోదిస్తున్నాడు.    	ముగ్గురు స్త్రీలూ గొడవపడుతూ వుంటే ఒక వృద్ధుడు ఆదారంట వెళుతూ 'ఏమైంది! ఎందుకు గొడవపడుతున్నారు!' అని అడిగాడు.    	నారదముని మా ముగ్గుర్నీ చూసి నమస్కరించి వెళ్ళాడు.మాలో ఎవరికి నమస్కరించి వెళ్ళాడన్న దానిపై గొడవపడుతున్నామన్నారు.వృద్ధుడు 'దాన్ని గురించి గొడవపడడమెందుకు నేను వెళ్ళి నారదమునిని తీసుకొస్తాను. ఆయనే మీ సమస్యను పరిష్కరిస్తాడు' అని వృద్ధుడు నారదుని వెతకడానికి బయల్దేరాడు.అదృష్టం కొద్దీ పొదలో వున్న నారదుని చూశాడు.    	'స్వామీ! మీరు కలహం పెట్టి వినోదం చూస్తున్నారు. మీరే పరిష్కరించండి' అని ముగ్గురు స్త్రీల దగ్గరకు తీసుకొచ్చాడు.    	ముగ్గురు స్త్రీలు నారదమహర్షిని చూసి ఘర్షించడం మానారు.'స్వామీ! మీరే సమాధానం చెప్పాలి. మీరు తలవంచి నమస్కరించి వెళ్ళారు. అప్పటి నించీ మేము ఎవరికి నమస్కరించారా! అని తేల్చుకోలేక సతమతమవుతున్నాం సంఘర్షిస్తున్నాం. యింతకూ మీరు ఎవరికి నమస్కరించారో చెప్పండి' అన్నారు.    	నారదుడే ఆ స్త్రీల ఆందోళన గమనించాడు. వృద్ధుడు నారదుడు ఈ సమస్యని ఎట్లా పరిష్కరిస్తాడో చూద్దామని ఉత్సాహంగా వున్నాడు.    	నారదుడు కాసేపు ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఆ సమస్యని పరిష్కరించడానికి తనకు మార్గం దొరికిందనుకున్నాడు.    	'మొదట ముగ్గురిలో ఒక్కొక్కరూ మీ పేరు చెప్పండి. దాన్ని బట్టి నేను ఎవరికి ఎందుకు నమస్కరించానో చెబుతాను' అన్నాడు.    	మొదటి స్త్రీ నాపేరు లక్ష్మి. లక్ష్మీ దేవి అంటే మీకు తెలియంది ఏముంది! సంపదలు, ధనధాన్యాదులు. ఐశ్వర్యాలు, అంతస్థులు యిచ్చే దేవత. అట్లాంటి పేరు నాకు వుండడంతో మీరు తప్పక నాకు నమస్కరించి వుంటారు' అది.    	నారదుడు నవ్వి 'మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి అథి దేవత. కానీ ఆమె అందర్నీ కరుణించదు. రాజుల్ని, తెలివితేటలున్న వాళ్ళని, నైపుణ్యమున్న వాళ్ళని, సంపన్నుల్ని మాత్రమే కరుణిస్తుంది. ఆమె కొంతమంది పట్లే పక్షపాతం వహిస్తుంది కాబట్టి నేను లక్ష్మీ దేవికి నమస్కరించ లేదు' అన్నాడు. ఆమె ముఖం వెలవెల బోయింది.    	రెండో స్త్రీ 'సరస్వతి నాపేరు. విద్యావినయ సంపన్నుల్ని వరించే దేవత ఆమె. పండితుల్ని, కవుల్ని, భావుకుల్ని ఆమె దీవిస్తుంది. మీరు జ్ఞాన సంపన్నులు. తప్పక ఆ జ్ఞానదేవత అయిన సర్వతి పక్షపాతులు' అంది.    	నారదుడు 'సరస్వతి జ్ఞాన మూర్తి. కానీ ఆమె ఐశ్వర్యవంతుల పట్ల, అవిద్యావంతుల పట్ల చులకన భావం చూపిస్తుంది. కాబట్టి ఆమెదీ పాక్షిక దృష్టే. నేను ఆమెకు నమస్కరించలేదు' అన్నాడు. సరస్వతి చిన్న బుచ్చుకుంది.    	మూడో స్త్రీ 'నాపేరు భవిత. నాకు నాపేరు గురించి తెలిసింది తక్కువ. మీరు నాకు నమస్కరించారో లేదో నాకు తెలీదు' అంది.    	నారదుడు 'భవిత అంటే భవిష్యత్తు. ఈ సృష్టిలో ఎవరికీ వారి భవిష్యత్తు గురించి తెలీదు. అందులో వున్న మార్మికత,రహస్యం అదే. తెలియని దానికి నేను తలవంచుతాను. నేను నమస్కరించింది భవితకే' అన్నాడు.    	అట్లా నారదుడు తన నమస్కారం గురించి వివరించాడు.    - సౌభాగ్య
Tags:    
Advertisement

Similar News