గవర్నర్ అపర భక్తితో తిరుమల భక్తులకు తిప్పలు!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టి దాదాపు ఐదున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం గవర్నర్ హోదాలో నరసింహన్ 37 సార్లు తిరుమలలో పర్యటించారు. ఒకే నెలలో వరుసబెట్టి రెండు, మూడు సార్లు తిరుమల సందర్శించిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే ఒకే రోజు మూడుసార్లు శ్రీవారిని దర్శించుకున్న రోజులూ ఉన్నాయి. మొత్తంమీద ఇప్పటి వరకు ఆయన 60 సార్లకుపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధిక సందర్భాల్లో సతీసమేతంగా వస్తే, కొన్నిసార్లు మాత్రం బంధుమిత్ర సపరివార సమేతంగా […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టి దాదాపు ఐదున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం గవర్నర్ హోదాలో నరసింహన్ 37 సార్లు తిరుమలలో పర్యటించారు. ఒకే నెలలో వరుసబెట్టి రెండు, మూడు సార్లు తిరుమల సందర్శించిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే ఒకే రోజు మూడుసార్లు శ్రీవారిని దర్శించుకున్న రోజులూ ఉన్నాయి. మొత్తంమీద ఇప్పటి వరకు ఆయన 60 సార్లకుపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధిక సందర్భాల్లో సతీసమేతంగా వస్తే, కొన్నిసార్లు మాత్రం బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చారు. నరసింహన్ సాధారణంగా సాయంత్రం, ఉదయం దర్శనాలకు వెళుతూ ఉంటారు. దాంతో, ఆరోజు రాత్రి ఆలయం మూసివేసేలోగా శ్రీవారిని దర్శించుకొని బయటపడాల్సిన వేలాదిమంది భక్తులు… గవర్నర్ వంటి వీవీఐపీల కోసం క్యూలైన్లు నిలుపు చేయడంతో ఆ రాత్రికి దేవదేవుని దర్శనం కాకపోగా మరుసటి రోజు ఉదయం సర్వదర్శనం ఆరంభమయ్యే వరకు సాధారణ భక్తుల క్యూలైన్లలోనే ఉండాల్సిందే. దీనికితోడు గవర్నర్ వస్తే ఘాట్ రోడ్డు ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవు. గవర్నర్ వాహనం కొండెక్కే వరకు అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేస్తారు. కొండ దిగే సమయంలోనూ ఇంతే. మొత్తంమీద గవర్నర్ అపర భక్తి సాధారణ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తుందనేది వాస్తవం.
విజ్ఞత ఉన్న భక్తి… శంకర్ దయాళ్‌శర్మది
తిరుమల వేంకటేశ్వరస్వామి పేరు చెప్పగానే ఆ వెనువెంటనే గుర్తుకొచ్చే పేరు శంకర్ దయాళ్ శర్మ. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా, దేశానికి ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా విశిష్ఠ సేవలందించిన వివాదరహితుడు ఆయన. తన పదవీ కాలంలో అనేక పర్యాయాలు తిరుమలేశుని దర్శించుకుని రికార్డులకెక్కారు. ఒకరోజు ఆయన రాష్ట్రపతి హోదాలో తిరుమలేశుని దర్శించుకుని, తిరిగి వెళుతూ తిరుపతి విమానాశ్రయంలో విలేకరులను హడావుడిగా పిలిపించారు. తన రాక వల్ల తిరుమలలో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నట్టు కొన్ని పత్రికల్లో చూశాను. నేను మీరు రాసిన దాని కన్నా ఎక్కువసార్లే వచ్చాను. మీరు తప్పు రాశారనుకుంటా. స్వామివారంటే నాకు వల్లమాలిన భక్తి. రాకుండా ఉండలేను. చనిపోయాక ఎలాగూ రాలేను కదా! బతికున్నన్నాళ్లు ఆయనకు సేవ చేసుకుందామనే వస్తున్నా. అధికారం ఉందని దర్పం ప్రదర్శించడానికి మాత్రం కాదు. నావల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోందన్న విషయాన్ని నేను గుర్తించాను. అందుకే మీ ద్వారా భక్తకోటికి క్షమాపణ చెప్తున్నా. అలాగే, టీటీడీ అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను దర్శనానికి వచ్చినప్పుడు క్యూను ఆపవద్దు. మహా అయితే, గర్భ గుడిలో ఉన్న రెండు మూడు నిమిషాలు మాత్రం ఆపి, మిగతా సమయాల్లో యథావిధిగా భక్తులను అనుమతించండి. ఘాట్ రోడ్డులోగానీ, క్యూలోగానీ భక్తులెవరికీ అసౌకర్యం కలిగించవద్దు. దయచేసి ఇకపై నా కారణంగా భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.-పీఆర్
Advertisement