Telugu Global
Agriculture

ఇది ఆరంభమే.. రాష్ట్రమంతా రైతు దీక్షలు చేస్తాం

రైతులకిచ్చిన హామీలు నెరవేర్చే వరకు వెంటపడుతాం

ఇది ఆరంభమే.. రాష్ట్రమంతా రైతు దీక్షలు చేస్తాం
X

రైతుల కోసం షాబాద్‌ కేంద్రంగా ఈరోజు చేస్తున్న దీక్ష ఆరంభం మాత్రమేనని.. రాష్ట్రమంతా రైతుల కోసం దీక్ష చేస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌ మండల కేంద్రంలో నిర్వహించిన రైతుదీక్షలో ఆయన మాట్లాడుతూ, ఈనెల 21న నల్గొండలో నిర్వహించే రైతు దీక్ష తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామన్నారు. తెలంగాణను ఉద్దరించిన.. ఢిల్లీలో కాంగ్రెస్‌ కు అధికారం ఇవ్వండని రేవంత్‌ రెడ్డి ఢిల్లీ వేదికగా చెప్పడం పెద్ద జోక్‌ అన్నారు. ''గూట్ల రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనోడు ఢిల్లీల ఉద్దరిస్తాడా? ముఖ్య మంత్రి అనే వ్యక్తి ఇన్ని అబద్దాలు చెప్పొచ్చా? ముఖ్యమంత్రి అబద్దాలు విని మన ఆడబిడ్డలు కోపానికొస్తున్నారు.. రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని చిన్నమ్మ అనే మహిళ రైతు తన ఆవేదనను నాతో చెప్పుకుంది.. 6 గ్యారంటీలు అన్నడు కాని అర గ్యారెంటీ మాత్రమే అమలైంది. ఫ్రీ బస్సు ఒక్కటే అమలైంది. తమ ఊరికి బస్సు రావడం లేదు. ఇంకా ఫ్రీ బస్సు ఎక్కడిది అని కొంతమంది మహిళలు అంటున్నరు.. జనాలు తిట్టే తిట్లు వింటే రేషమున్నోడు ఎవరైనా బకెట్‌ నీళ్లలో మునిగి చస్తారు కానీ రేవంత్ రెడ్డికి సిగ్గు శరం లేదు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తాడు..'' అన్నారు.




తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. తాను సీఎం కాగానే రెండు లక్షల రుణమాఫీ ఫైల్ మీద సంతకం పెడతా అన్నాడు కానీ రుణమాఫీ కాలేదన్నారు. ''రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లె, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ లోని ఒక్క ఊర్లో అయినా రైతులకు వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీదనే చెప్పిన.. నా ఛాలెంజ్ కు రేవంత్ నుంచి సమాధానం రాలేదు. రాష్ట్రంలోని ఏ ఊర్లో అయినా ఏ నియోజకవర్గంలో అయినా రైతులు 100 శాతం రుణమాఫీ అయిందని చెప్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేస్తాం. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు తెలంగాణలో రుణమాఫీ కాకున్నా ఢిల్లీకి పోయి రుణమాఫీ మొత్తం చేసిన అని రేవంత్ గప్పాలు కొడుతున్నడు. రైతుభరోసా రూ.15 వేలకు పెంచి ఇస్తానని నమ్మించి మోసం చేశాడు..'' అన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతుబంధు ఇస్తే.. రేవంత్‌ రెడ్డి మాత్రం ఓట్లప్పుడే పైసలు అంటున్నాడని ఎద్దేవా చేశారు. వానాకాలంలో పెండింగ్‌ లో ఉన్న రైతుభరోసా కలుపుకొని ఒక్కో ఎకరానికి ప్రభుత్వం రూ.17,500 సాయం రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్‌ చేశారు.

ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చి.. రాష్ట్రంలోని 1.60 కోట్ల మంది ఆడబిడ్డలకు రూ.30 వేలకు పైగా బాకీ పడ్డాడని తెలిపారు. కళ్యాణలక్ష్మీతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందో చెప్పాలన్నారు. ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్‌ తులం బంగారం బాకీ పడ్డాడని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హామీలు ఇచ్చి మోసం చేసినందుకు రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై చీటింగ్‌ కేసు పెట్టాలన్నారు. ''బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇక్కడి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంకలో చేరిండు. చేవెళ్లలో త్వరలో ఉప ఎన్నిక రాబోతుంది. చేవెళ్ల ఒక్కటే కాదు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ త్వరలో ఎన్నికలు జరుగుతాయి. రైతు భరోసా ఇవ్వనందుకు, రుణమాఫీ అని మోసం చేసినందుకు, నెలకు రూ.2,500 ఇస్తామని ఆడబిడ్డలను మోసం చేసినందుకు, ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు.. లగచర్ల రైతులను జైల్లో వేసినందుకు, గుండెపోటు వచ్చిన హీర్యానాయక్‌ కు బేడీలు వేసి హాస్పిటల్ తీసుకపోయినందుకు ప్రజలు కాంగ్రెస్‌ కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. హామీలు అమలు చేసే వరకు తాము వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు. తమను జైలుకు పంపినా ఈ ప్రభుత్వంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఆందోళనలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

First Published:  17 Jan 2025 3:39 PM IST
Next Story