Telugu Global
NEWS

ఆన్‌లైనా? తటస్థ ప్రదేశమా చెప్పండి- ఏపీ హైకోర్టు

ముఖ్యమంత్రిని దూషించడంతో పాటు కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారన్న అభియోగాల ఆధారంగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసుల విషయంలో హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ వేశారు. దేశద్రోహం సెక్షన్ కింద నమోదైన కేసుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. హైదరాబాద్‌లో రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టారని, ఇదే విషయాన్నిసుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా […]

MP-RRR-AP-High-court
X

ముఖ్యమంత్రిని దూషించడంతో పాటు కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారన్న అభియోగాల ఆధారంగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై నమోదైన కేసుల విషయంలో హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ వేశారు. దేశద్రోహం సెక్షన్ కింద నమోదైన కేసుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

హైదరాబాద్‌లో రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ఆ తర్వాత అతడిని దారుణంగా కొట్టారని, ఇదే విషయాన్నిసుప్రీంకోర్టు కూడా ప్రాథమికంగా నిర్ధారించిందని రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పుడు విచారణకు వెళ్తే సీఐడీ పోలీసులు మరోసారి దాడి చేసే అవకాశం ఉందని, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి హైదరాబాద్‌లోని రఘురామ ఇంటి వద్ద గానీ, ఆన్‌లైన్‌ విధానంలో కానీ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ తరఫు న్యాయవాది కోరారు.

రఘురామ ప్రతిపాదనకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం అభ్యంతరం తెలిపారు. సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజు ఇంటికి వెళ్లి విచారించే ప్రసక్తే ఉండదన్నారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు వెళ్తే.. వారిని కాల్చిపారేయాల్సిందిగా తన భద్రతా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చిన ఘనుడు రఘురామకృష్ణంరాజు అని ఏజీ వాదించారు. అందువల్ల ఆయన ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లి విచారించే పరిస్థితి లేదని, విచారణలో ఏదో జరుగుతుందని నిందితుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విచారణ మొత్తం వీడియో తీస్తామన్నారు. ఎంపీతో పాటు మరికొందరిని ఒకేచోట కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఉందని, అప్పుడే నిజాలు బయటకు వస్తాయని ఏజీ వాదించారు. 124ఏ సెక్షన్‌ కింది నమోదైన కేసు విచారణను సుప్రీంకోర్టు నిలుపుదల చేసినప్పటికీ మిగిలిన సెక్షన్ల ఆధారంగా రఘురామకృష్ణంరాజును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోరారు.

సీఐడీ కార్యాలయానికి వచ్చేందుకు రఘురామ నిరాకరించడం, ఎంపీ ఇంటి వద్దే విచారణకు సీఐడీ ససేమిరా అనడంతో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ఇరుపక్షాల ప్రయోజనాలకు కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని.. కాబట్టి విచారణ ఆన్‌లైన్‌లో సాధ్యమా అన్నది చెప్పాలని, అలా కానీ పక్షంలో సురక్షితమైన తటస్థ ప్రదేశాన్ని సూచించాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

First Published:  23 Jun 2022 9:24 PM GMT
Next Story