వెంకయ్యకు వెన్నుపోటు అంటున్న తెలుగు మీడియా
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే ఒక వర్గం తెలుగు మీడియా చానళ్లు.. వెంకయ్యనాయుడిని రేసులో ముందుంచే ప్రయత్నాలు చేశాయి. ఎన్‌డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు రేసులో ముందున్నారని ప్రచారం చేసింది మీడియా. వెంకయ్యనాయుడిని అభ్యర్థిగా ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌తో సహా అనేక పార్టీలు బేషరతుగా మద్దతు ఇస్తాయని.. అసలు పోటీనే లేకుండా గెలిచేస్తారని ఎన్‌డీఏ పెద్దలకు తెలుగు మీడియా తెలుగులో కథనాల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసింది. మంగళవారం వెంకయ్యనాయుడుని అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా […]
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడానికి ముందే ఒక వర్గం తెలుగు మీడియా చానళ్లు.. వెంకయ్యనాయుడిని రేసులో ముందుంచే ప్రయత్నాలు చేశాయి. ఎన్‌డీఏ అభ్యర్థిగా వెంకయ్యనాయుడు రేసులో ముందున్నారని ప్రచారం చేసింది మీడియా. వెంకయ్యనాయుడిని అభ్యర్థిగా ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌తో సహా అనేక పార్టీలు బేషరతుగా మద్దతు ఇస్తాయని.. అసలు పోటీనే లేకుండా గెలిచేస్తారని ఎన్‌డీఏ పెద్దలకు తెలుగు మీడియా తెలుగులో కథనాల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసింది.
మంగళవారం వెంకయ్యనాయుడుని అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా కలిసి చర్చలు జరిపిన తర్వాత మీడియాకు మరింత ఊపు వచ్చింది. కానీ తీరా చూస్తే వెంకయ్యనాయుడుని అభ్యర్థిగా బీజేపీ పెద్దలు ఎంపిక చేయలేదు. ఈ పరిణామంపై టీడీపీ అనుకూలమని పేరున్న ఒక పత్రిక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. నరేంద్రమోడీ నుంచి వెంకయ్యనాయుడుకి మరోసారి ప్రతికూలత ఎదురైందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. వెంకయ్యనాయుడు నరేంద్రమోడీ కోసం ఎంతో చేశారని అయినా ఆయన వెన్నుపోటు పొడిచారన్న భావన కలిగేలా వెంకయ్యనాయుడు గతంలో మోడీకి అందించిన సహకారం ఇదీ అంటూ గుర్తు చేసింది కూడా.
ఏబీవీపీ కార్యకర్తగా మొదలుపెట్టి.. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేసినప్పటికీ వెంకయ్యనాయుడుని మోడీ విస్మరించారని ఆ పత్రిక విమర్శించింది. గతంలో అద్వానీని పక్కనపెట్టినట్టుగానే ఇప్పుడు వెంకయ్యనాయుడుని కూడా మోడీ పక్కనపెట్టేశారని విశ్లేషించింది. మొదటి నుంచి మోడీకి వెంకయ్యనాయుడు అండగా ఉంటూ వచ్చినా ఆయన మాత్రం ఈయన్ను దూరంగా పెడుతున్నారని.. ఉప రాష్ట్రపతిగా వెళ్లడం ఇష్టం లేకపోయినా నరేంద్రమోడీ ఒత్తిడి తెచ్చారని వివరించింది. అల్లర్ల సమయంలో నరేంద్రమోడీని గుజరాత్ సీఎం పదవి నుంచి తొలగించేందుకు వాజ్‌పేయి సిద్ధమైన సమయంలో మోడీకి అండగా వెంకయ్యనాయుడు నిలిచి రక్షించారని, అలాంటి వ్యక్తిని మోడీ దూరం పెట్టారని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
చివరకు ఉప రాష్ట్రపతిగా ఉంటూ కూడా మోడీ మనోభావాలకు అనుగుణంగానే వెంకయ్యనాయుడు నడుచుకున్నారని ఈ పత్రిక విశ్లేషించడం ఆసక్తిగా ఉంది. మంగళవారం అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డాలు వెంకయ్యనాయుడుని కలిసినా ఆ సమయంలో కూడా కనీసం కొత్త రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్న విషయాన్ని వెంకయ్యనాయుడుకి వారు చెప్పలేదని ఆ పత్రిక వెల్లడించింది. అంత పెద్దవాళ్లు జరిపిన సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి పేరును వెంకయ్యనాయుడుతో వారు పంచుకోలేదన్న సమాచారం ఒక తెలుగు పత్రికకు ఎవరి ద్వారా అంది ఉంటుంది?.