ఏపీ పోలీసులకు హోంశాఖతో చెప్పిస్తా..
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్బంగా నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏపీ వస్తున్న సమయంలో తనను అరెస్ట్ చేయడం లాంటి చిల్లర వేషాలు వేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ప్రధాని మోడీ అల్లూరికి నివాళులర్పించే ఏర్పాటు చేసిన కార్యక్రమం తన సొంత ఊరిలో, తన ఇంటికి 300 మీటర్ల దూరంలో జరుగుతుందని రఘురామ చెప్పారు. అలాంటి కార్యక్రమంలో స్థానిక ఎంపీగా పాల్గొనే హక్కు తనకుందన్నారు. కేసులు పెట్టాలనుకుంటే ముందే పెట్టాలని.. వాటిపై తాను కోర్టుకు […]
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్బంగా నివాళులర్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఏపీ వస్తున్న సమయంలో తనను అరెస్ట్ చేయడం లాంటి చిల్లర వేషాలు వేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. ప్రధాని మోడీ అల్లూరికి నివాళులర్పించే ఏర్పాటు చేసిన కార్యక్రమం తన సొంత ఊరిలో, తన ఇంటికి 300 మీటర్ల దూరంలో జరుగుతుందని రఘురామ చెప్పారు. అలాంటి కార్యక్రమంలో స్థానిక ఎంపీగా పాల్గొనే హక్కు తనకుందన్నారు. కేసులు పెట్టాలనుకుంటే ముందే పెట్టాలని.. వాటిపై తాను కోర్టుకు వెళ్లి తగిన ఉత్తర్వులు తెచ్చుకుంటానని.. అలా కాకుండా అప్పటికప్పుడు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం లాంటి చిల్లర పనులు మానుకోవాలన్నారు.
పార్లమెంటరీ కమిటీ పర్యటనలో భాగంగా తనతో పాటు 30 మంది సభ్యుల బృందం విశాఖకు రావాల్సి ఉందని.. కమిటీ సభ్యుల సెక్యూరిటీ కోసం డీజీపీ ఆఫీస్‌కు ఫోన్ చేస్తే.. రఘురామకృష్ణంరాజు లేకుండా రావాలని పోలీసులు కమిటీ బృందానికి చెప్పారన్నారు. ఆయన వస్తే అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పారన్నారు. ప్రధాని పర్యటన సమయంలోనూ ఇదే తీరుగా ఏపీ పోలీసులు వ్యవహరించే అవకాశం ఉందని.. అందుకే నేడు తాను కేంద్ర హోంశాఖ సెక్రటరీని కలుస్తున్నట్టు చెప్పారు. ప్రధాని కార్యక్రమానికి తాను హాజరైన సమయంలో పిచ్చివేషాలు వేయకుండా డీజీపీని ఆదేశించాల్సిందిగా కోరుతానన్నారు.
అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని.. కనీసం ఫోన్లోనైనా తప్పుకుండా మాట్లాడుతానన్నారు. ఒక ఎంపీ సొంత నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేకపోతే ఎలా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తాను ఏపీ పర్యటనకు భయపడడం లేదని, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. తాను వస్తే ఎప్పుడు అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టాలా అని గుంటనక్కల్లా ఎదురు చూస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. 32 కేసులున్న జగన్‌మోహన్ రెడ్డి ఎప్పుడు కావాలంటే అప్పుడు విదేశాలకు వెళ్లొచ్చు గానీ.. ఒక ఎంపీనైనా తాను సొంత నియోజకవర్గంలో పర్యటించడం నేరమా అని ప్రశ్నించారు.
అరెస్ట్ చేయడానికి తనపై ఎలాంటి పెండింగ్ కేసులు కూడా లేవని, కేవలం కక్షసాధింపు కోసం అప్పటికప్పుడు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టాలన్నది ఏపీ పోలీసులు ఆలోచన అని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తంచేశారు. ప్రధాని పర్యటన సందర్బంగా సంయమనం పాటించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ పోలీసులకు చెప్పకపోతే అప్పుడు ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేస్తానన్నారు. ప్రధాని పర్యటనలో తాను పాల్గొనడం మాత్రం ఖాయమన్నారు.