అత్తాకోడళ్లు మంచిగా కలసి ఉంటున్నారు – కేటీఆర్ చమత్కారం..
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. జహీరాబాద్ లో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జహీరాబాద్ లోని నిమ్జ్ లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబంలో సంతోషం.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రతి కుటుంబంలో […]
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. జహీరాబాద్ లో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జహీరాబాద్ లోని నిమ్జ్ లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
ప్రతి కుటుంబంలో సంతోషం..
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోందని అన్నారు కేటీఆర్. అన్ని వర్గాల వారు ఆనందంగా ఉన్నారని చెప్పారు. రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రతీ ఇంటికీ ప్రతి రోజూ మంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. అప్పట్లో 200 రూపాయలు ఉండే పెన్షన్ ని తమ హయాంలో రూ.2వేలకు పెంచామన్నారు. 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నామని, కేసీఆర్ హయాంలో అత్తాకోడళ్లు మంచిగా కలసి మెలసి ఉంటున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో సంగమేశ్వర దేవుడు చాలా పవర్ ఫుల్ అని, సింగూరు నీళ్లు తెచ్చి ఇక్కడి బీడు భూములన్నీ తడుపుతామని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 12 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని చెప్పారు.
జహీరాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒకేసారి 50 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని చెప్పారు కేటీఆర్. మున్సిపాలిటీ పరిధిలో రూ14.50 కోట్ల వ్యయంతో మార్కెట్ కడుతున్నామన్నారు. జహీరాబాద్ లో హరితహారం కోసం రూ.2.55 కోట్లు ఖర్చు చేశామన్నారు. పట్టణ ప్రగతి కోసం రూ.18.79 కోట్లు విడుదల చేశామని, మరో రూ.50 కోట్లు మౌలిక వసతుల కోసం ఇచ్చామని చెప్పారు కేటీఆర్.
కేంద్రం ప్రోత్సాహమే ఉంటే..
అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహం అవసరమని అన్నారు కేటీఆర్. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఫెన్స్ కారిడార్ బుందేల్ ఖండ్ కు తరలించారని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.