డీఎస్సీ జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే.. మరెన్నో గాథలు
1998 డీఎస్సీ వివాదాన్ని పరిష్కరిస్తూ నాడు ఎంపికైన వారికి పోస్టింగ్ ఇచ్చేలా సీఎం జగన్ ఫైల్‌పై సంతకం చేయడంతో ఆఖరి దశలో అనేక మందికి టీచర్లు అయ్యే అవకాశం దక్కింది. వారిలో చాలా మంది 50ఏళ్లకు పైబడ్డారు. కొందరు నెల,రెండు నెలల్లో రిటైర్ అయ్యే వయసుకు వచ్చారు. 1998 డీఎస్సీ అర్హుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ పేరు కూడా ఉంది. అప్పట్లో ఆయన ఎంపికైనా వివాదం కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదు. తన వయసు […]
1998 డీఎస్సీ వివాదాన్ని పరిష్కరిస్తూ నాడు ఎంపికైన వారికి పోస్టింగ్ ఇచ్చేలా సీఎం జగన్ ఫైల్‌పై సంతకం చేయడంతో ఆఖరి దశలో అనేక మందికి టీచర్లు అయ్యే అవకాశం దక్కింది. వారిలో చాలా మంది 50ఏళ్లకు పైబడ్డారు. కొందరు నెల,రెండు నెలల్లో రిటైర్ అయ్యే వయసుకు వచ్చారు.
1998 డీఎస్సీ అర్హుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ పేరు కూడా ఉంది. అప్పట్లో ఆయన ఎంపికైనా వివాదం కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదు. తన వయసు 30ఏళ్లు ఉన్న సమయంలో డీఈడీ పూర్తి చేసి టీచర్‌గా స్థిరపడేందుకు ప్రయత్నించానని ధర్మశ్రీ చెప్పారు. 98డీఎస్సీలో అర్హత సాధించినా వివాదం కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. దాంతో బీఎల్ చదివానని.. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి యువజన విభాగంలో క్రీయాశీలకంగా వ్యవహరించానని గుర్తుచేశారు.
ఈ 25ఏళ్లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పారు. అప్పట్లోనే తనకు పోస్టింగ్ ఇచ్చి ఉంటే రాజకీయాల కంటే ఉపాధ్యాయుడిగా ఉండేందుకే ప్రాధాన్యత ఇచ్చేవాడినని వెల్లడించారు. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న వారి సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి 1998 డీఎస్సీ అభ్యర్థుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.
విశాఖ జిల్లాకు చెందిన డీఎం రావు వయసు ప్రస్తుతం 62ఏళ్లు. ఆయనకు ఇప్పుడు టీచర్‌గా అవకాశం వచ్చింది. మరో ఎనిమిది నెలలు మాత్రమే తనకు సర్వీస్ ఉంటుందని డీఎం రావు వెల్లడించారు. ఇన్నేళ్ల తర్వాత ఈ వయసులో ఉద్యోగం రావడాన్ని నమ్మలేకపోతున్నామన్నారు.
విశాఖకు చెందిన తమ్మిరాజు వయసు కూడా 62 ఏళ్లు. జూన్ నెలాఖరుతో ఆయన వయసు 63లోకి ఎంటర్ అవుతుంది. మరో పది రోజులు మాత్రమే తనకు సర్వీస్‌లో అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికు చెందిన 54ఏళ్ల మల్లేశ్వరరావుకు ఉద్యోగం వచ్చింది. 98 డీఎస్సీ నియామకాలు ఎటూ కాకుండాపోవడంతో నిరీక్షణతోనే జీవితం గడిచిపోయింది. మల్లేశ్వరరావు వివాహం కూడా చేసుకోలేకపోయారు. ఉద్యోగం వచ్చిన విషయాన్ని స్నేహితులు తెలపడంతో భావోద్వేగంతో మల్లేశ్వరరావు కంట తడి పెట్టుకున్నారు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లికి చెందిన నాగరాజు 55ఏళ్ల వయసులో టీచర్ అవుతున్నారు. డీఎస్సీ వ్యవహారం న్యాయస్థానంలో చిక్కుకుపోవడంతో ఇంతకాలం కూలీ పనులు చేసుకుంటూ నాగరాజు బతుకుతున్నాడు. సొంతూరును వదిలేసి భార్య స్వగ్రామానికి వెళ్లి అక్కడే కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇన్నేళ్లకు సీఎంగా జగన్‌మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయడం, ఉద్యోగం రావడంతో నాగరాజు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.