ఎన్నికల్లో రెండు చోట్ల పోటీకి చెక్..కేంద్రానికి ఈసీ ప్రతిపాదన
ఇకపై ఎన్నికల్లో ఒకటి కంటే మించి స్థానాల్లో పోటీ చేయాలనుకునే రాజకీయ నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చెక్ పెట్టనుంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని లేదా భారీ జరిమానాలు విధించాలని సీఈసీ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ ప్రతిపాదనలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ కార్యదర్శితో చర్చించారు. రాజకీయ నాయకులు ఎన్నికల […]
ఇకపై ఎన్నికల్లో ఒకటి కంటే మించి స్థానాల్లో పోటీ చేయాలనుకునే రాజకీయ నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చెక్ పెట్టనుంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని లేదా భారీ జరిమానాలు విధించాలని సీఈసీ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని కేంద్రానికి సూచించింది.
ఈ ప్రతిపాదనలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ కార్యదర్శితో చర్చించారు. రాజకీయ నాయకులు ఎన్నికల వేళ తమ ప్రాబల్యం నిరూపించుకునేందుకే గాక రాజకీయ అవసరాల నిమిత్తం రెండు ప్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఒక అభ్యర్ధి రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్లా గెలిస్తే వారు ఒక చోట సీటును వదులుకోవాల్సి ఉంటుంది. అలా ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలలలోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా ఉప ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల సంఘానికి ఇబ్బందిగా ఉండడమేకాక ఆర్ధికంగా నష్టం కూడా ఉంటుందని ఈసీ చెబుతోంది. అందువల్ల ఈసీ తాజా ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది.
1996 ప్రజాప్రాతినిద్య చట్టాన్ని సవరించడం ద్వారా అభ్యర్ధులు రెండు చోట్లే పోటీ చేసే వీలు కలిగింది. దీంతో అభ్యర్ధులు రెండు చోట్లా పోటీకి దిగుతున్నారు. రెండింటిలో గెలిచి ఒక స్థానాన్ని ఖాళీ చేస్తే అక్కడ ఉప ఎన్నిక నిర్వహణ వ్యయభరితమవడమేకాక సమయం వృధా అవుతోంది. రెండు చోట్లా పోటీ చేయడం అడ్డుకోవడానికి వీలు కాకపోతే ఆ ఉప ఎన్నికకు అయ్యే ఖర్చును సీటు ఖాళీ చేసిన అభ్యర్ధి నుంచి వసూలు చేయాలని ఎన్నికల సంఘం కేంద్రాన్ని కోరింది.
అసెంబ్లీ స్థానానికి నిర్వహించే ఉప ఎన్నికలకు రూ.5లక్షలు, లోక్ సభ స్థానానికి నిర్వహించే ఉప ఎన్నికలకు రూ.10 లక్షలు జరిమానా విధించాలనే అంశాన్ని కూడా ఈసీ కేంద్రం దృష్టికి తెచ్చినట్టు మీడియా కథనాలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలు 2004లోనే వచ్చినా కారణాంతరాల వల్ల వెలుగులోకి రాలేదు.