Telugu Global
NEWS

బీహార్ తగలబడుతోంది.. పార్టీల‌కు దొరికిందే ఛాన్స్ !

అగ్నిపథ్ పథకంపై దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్ లో జరిగిన ఆందోళనలు, హింసాత్మక ఘటనలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు. ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగవచ్చని, కానీ హింసాకాండ, విద్రోహచర్యలు సరికావని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఓ వైపు రాష్ట్రం తగలబడుతుంటే మరోవైపు పాలక జేడీ-యూ, బీజేపీలు ఒకదానినొకటి వేలెత్తి చూపుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ పార్టీల మధ్య విభేదాల కారణంగా బీహారీలు తలలు పట్టుకుంటున్నారని, ఇవి సమస్యను పరిష్కరించే […]

bihar-politics-agnipath
X

అగ్నిపథ్ పథకంపై దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్ లో జరిగిన ఆందోళనలు, హింసాత్మక ఘటనలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు. ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగవచ్చని, కానీ హింసాకాండ, విద్రోహచర్యలు సరికావని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఓ వైపు రాష్ట్రం తగలబడుతుంటే మరోవైపు పాలక జేడీ-యూ, బీజేపీలు ఒకదానినొకటి వేలెత్తి చూపుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ పార్టీల మధ్య విభేదాల కారణంగా బీహారీలు తలలు పట్టుకుంటున్నారని, ఇవి సమస్యను పరిష్కరించే బదులు ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకోవడంలో బిజీగా ఉంటున్నాయని ఆరోపించారు.

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు రాష్ట్రంలో వరుసగా మూడు రోజులపాట రైళ్లను, వాహనాలను తగులబెడుతూ.. హింసకు దిగుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం రేణు దేవి నివాసం పైన, పలు బీజేపీ కార్యాలయాలపైనా దాడులు కొనసాగాయి.

ఈ తరుణంలో రాష్ట్ర జేడీ-యూ, బీజేపీ నేతల మధ్య వైషమ్యాలు తలెత్తాయి. తమ పార్టీ నేతల మీద దాడులను ఆపడంలో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. ఈయన ఇంటిపై కూడా ఎటాక్ జరిపిన నిరసనకారులు.. ఫర్నిచర్, ఇతర వస్తువులను దగ్ధం చేశారు. చూడబోతే రాష్ట్రంలో తమపార్టీ నేతలు, పార్టీ కార్యాలయాలనే వీరు టార్గెట్లుగా పెట్టుకున్నారని, కానీ వీరిని అదుపు చేయడంలో ఈ సర్కార్ పూర్తిగా విఫలమైందని సంజయ్ జైస్వాల్ అన్నారు.

అయితే ఈ ఆరోపణలను జేడీ-యూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ ఖండిస్తూ .. అగ్నిపథ్ పథకం కేంద్రం తీసుకున్న నిర్ణయమని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయని, తమ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న యువత నిరసనలకు దిగుతున్నారని అన్నారు. కానీ, ఎవరూ హింసను సమర్థించడంలేదన్నారు. ఆందోళనకారుల ఆవేదనకు కారణాన్ని బీజేపీ నేతలు తెలుసుకోవాలి గానీ ప్రభుత్వంపై నిందలేయడం ఏమిటని ప్ర‌శ్నించారు. ఇలా బీహార్ లోని జేడీ-యూ, బీజేపీ సంకీర్ణ కూటమి లోని భాగస్వామ్య పార్టీలు ఒకదానినొకటి తిట్టుకోవడంతో ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్లకు పదును పెట్టారు.

First Published:  19 Jun 2022 8:52 AM IST
Next Story