Telugu Global
NEWS

అక్కలా ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు.. అగ్నిపథ్ ఆందోళనలో చనిపోయాడు

ఆ యువకుడికి మొదటి నుంచి ఆర్మీలో చేరాలనేదే లక్ష్యం. ఊహ తెలిసిన దగ్గర నుంచి స్నేహితులతో కూడా నేను సైనికుడిని అవుతా.. దేశానికి సేవ చేస్తా అనేవాడు. వాళ్ల అక్కకు కూడా జవానుగా ఉద్యోగం రావడంతో అతడికి ఆర్మీ ఉద్యోగం అంటే మరింత ఇష్టంగా మారిపోయింది. రేయింబవళ్లు దాని జపమే చేసేవాడు. కేవలం మాటలతో ఊరుకోలేదు. అందుకు తగ్గట్లుగా శరీరధారుడ్యాన్ని పెంచుకున్నాడు. అవసరమైన విద్యార్హతలు సాధించాడు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం అతడి […]

https://teluguglobal.in/2022/06/17/damera-rakesh-who-lost-his-life-in-the-secunderabad-incident-wants-to-join-the-army-with-his-sisters-inspiration
X

ఆ యువకుడికి మొదటి నుంచి ఆర్మీలో చేరాలనేదే లక్ష్యం. ఊహ తెలిసిన దగ్గర నుంచి స్నేహితులతో కూడా నేను సైనికుడిని అవుతా.. దేశానికి సేవ చేస్తా అనేవాడు. వాళ్ల అక్కకు కూడా జవానుగా ఉద్యోగం రావడంతో అతడికి ఆర్మీ ఉద్యోగం అంటే మరింత ఇష్టంగా మారిపోయింది. రేయింబవళ్లు దాని జపమే చేసేవాడు. కేవలం మాటలతో ఊరుకోలేదు. అందుకు తగ్గట్లుగా శరీరధారుడ్యాన్ని పెంచుకున్నాడు. అవసరమైన విద్యార్హతలు సాధించాడు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం అతడి ఆశలను అడియాశలు చేసింది. దీంతో ఆ పథకానికి నిరసన తెలయజేయడానికి సికింద్రాబాద్ వచ్చి పోలీసుల తుపాకీ తూటాలకు బలైపోయాడు. ఆర్మీ ఉద్యోగం కల నెరవేరకుండానే కన్నుమూసిన అతడి పేరే దామెర రాకేశ్.

వరంగల్ జిల్లా దబీర్ పేటకు చెందిన కుమారస్వామి వ్యవసాయం చేస్తుంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. కొడుకు దామెర రాకేశ్‌కు ఆర్మీలో చేరాలనేది చిన్నప్పటి కల. ఈ క్రమంలో రాకేశ్ అక్క సంగీతకు ఆర్మీలో జాబ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె బెంగాల్‌లో బీఎస్ఎఫ్ జవానుగా పని చేస్తోంది. దీంతో రాకేశ్ ఆర్మీలో చేరాలనే సంకల్పం మరింత బలపడింది. ఎంతలా అంటే.. తన బైక్‌పై ఏకంగా ‘బీఎస్ఎఫ్’ అని రాయించుకున్నాడు. సైనికుల మాదిరి హెయిర్ స్టైల్ చేసుకొని, డ్రెస్‌లు వేసుకొని ఫొటోలు దిగేవాడు. అతని సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తే ఎక్కువగా ఇలాంటి ఫొటోలే ఉంటాయి.

ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అతడి గుండెల్లో గునపం దింపినట్లయింది. ఆర్మీలో చేరి జీవితాంతం సేవ చేయాలనుకోగా.. కేవలం నాలుగేళ్ల సర్వీసుకే తీసుకుంటామని చెప్పడంతో దిగులు చెందాడు. వయసు అర్హత కూడా మార్చడంతో తాను సైనికుడిని కాలేనేమో అని బాధపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు కనుక్కోవడానికి మూడు రోజుల కిందటే హైదరాబాద్ వచ్చాడు. తన స్నేహితులతో కలసి ఆరా తీశాడు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. ఆ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో తూటాలు తగిలి పడిపోయాడు. తోటి స్నేహితులు గాంధీ ఆసుపత్రికి తరలించే లోపే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాకేశ్ మరణ వార్త తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆర్మీలో చేరతాడనుకుంటే.. ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్తాడని అనుకోలేదని భోరున విలపించారు. వరంగల్ పోలీసులు వారిని సికింద్రాబాద్ తరలించారు.

ఎంతో ఇష్టంగా ప్రేమించిన ఉద్యోగం రాకుండానే.. దానికి సంబంధించిన ఆందోళనలో మృతి చెందడం పలువురిని కంట తడిపెట్టించింది. అతడి మృతితో దబీర్ పేటలో తీవ్ర విషాదం అలుముకున్నది. మరోవైపు కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి ఛాతిలోకి బుల్లెట్ దూసుకొని వెళ్లడంతో.. గాంధీలో చికిత్స అందిస్తున్నారు.

First Published:  17 Jun 2022 2:20 PM IST
Next Story