Telugu Global
NEWS

హైదరాబాద్‌లో నకిలీ ఫింగర్ ప్రింట్స్‌తో రూ.14.64 లక్షలు చోరీ

నకిలీ ఫింగర్ ప్రింట్స్, బ్యాంక్ అకౌంట్స్ సృష్టించి ఏకంగా రూ. 14.64 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆర్బీఐ తీసుకొచ్చిన ఒక పద్దతిని తమకు అనుకూలంగా మలుచుకున్న ఈ సైబర్ నేరగాళ్లు.. ఫేక్ ఫింగర్ ప్రింట్స్, ఫేక్ సిమ్ కార్డులు తయారు చేసి ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి భారీగా సొమ్మును మళ్లించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్రహించే క్రమంలో ఇటీవల ఆధార్ బేస్డ్ విత్‌డ్రాలను […]

fake-fingure-prints
X

నకిలీ ఫింగర్ ప్రింట్స్, బ్యాంక్ అకౌంట్స్ సృష్టించి ఏకంగా రూ. 14.64 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆర్బీఐ తీసుకొచ్చిన ఒక పద్దతిని తమకు అనుకూలంగా మలుచుకున్న ఈ సైబర్ నేరగాళ్లు.. ఫేక్ ఫింగర్ ప్రింట్స్, ఫేక్ సిమ్ కార్డులు తయారు చేసి ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి భారీగా సొమ్మును మళ్లించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..

డిజిటల్ లావాదేవీలను ప్రోత్రహించే క్రమంలో ఇటీవల ఆధార్ బేస్డ్ విత్‌డ్రాలను ఆర్బీఐ అనుమతిస్తోంది. వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్, ఫోన్ నెంబర్ అనుసంధానం అయితే డెబిట్ కార్డు లేకుండానే డబ్బులు డ్రా చేయడం లేదా వేరే అకౌంట్‌కు తరలించడం వంటి లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇలాంటి సేవలను ‘ఈ-పాయింట్ ఇండియా’ అనే సంస్థ కూడా నిర్వహిస్తోంది. 2019లో రాయ్‌నెట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ‘ఈ-పాయింట్ ఇండియా’ సంస్థ ఇలాంటి లావాదేవీల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ‘ఈ-పాయింట్ ఇండియా’ సంస్థ కొంత మంది ఏజెంట్లను నియమించుకొని బ్రాంచీలు ఏర్పాటు చేసింది. ఈ బ్రాంచీల ద్వారా కస్టమర్ల ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్స్‌ వివరాలను సేకరించి.. ఆధార్ ఎనేబుల్డ్ సేవలను అందిస్తోంది.

ఏపీలోని ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన నల్లగండ్ల వెంకటేశ్వర్లు(48) అనే వ్యక్తి ‘ఈ-పాయింట్ ఇండియా’ ఏజెంట్‌గా చేరారు. సంస్థ తరఫున లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇవ్వడంతో అతడు సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఏజెన్సీని తెరిచాడు. అక్కడ పని చేయడానికి దోర్నాలకు చెందిన మెఘావత్ శంకర్ నాయక్, రథం శ్రీనివాస్, షేక్ ఖాసీం వలీ, ఒంగోలుకు చెందిన దర్శనం సామ్యుల్, విశ్వనాథ అనిల్ కుమార్, గుంటూరుకు చెందిన చల్లా మణికంఠలను చేర్చుకున్నాడు. వీళ్లంతా కలసి ‘ఈ-పాయింట్ ఇండియా’ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు.

బ్యాంకింగ్ సర్వీసెస్, ల్యాండ్ రికార్డుల రిజిస్ట్రేషన్లలో వీరికి అనుభవం ఉండటంతో ఫింగర్ ప్రింట్స్ సేకరించడం మొదలు పెట్టారు. ముందు ఏపీకి చెందిన ఐజీఆర్ఎస్ పోర్టల్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, వాటికి సంబంధించిన ఆధార్ కార్డులు, పేర్లు, ఫింగర్ ప్రింట్లు డౌన్‌లోడ్ చేసే వాళ్లు. వాటి సాయంతో తమ పని మొదలు పెట్టేవాళ్లు.

మెఘావత్ శంకర్ ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అయిన బ్యాంక్ అకౌంట్స్, వాటిలో బ్యాలెన్స్ వివరాలు, కేవైసీ డాక్యుమెంట్లను సేకరించేవాడు. ఇక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని ఫింగర్ ప్రింట్ల ఆధారంగా రబ్బర్ ఫింగర్ ప్రింట్లను రథం శ్రీనివాస్ తయారు చేసేవాడు. ఆధార్‌తో లింకైన ఫింగర్ ప్రింట్స్ డేటాతో సిమ్ కార్డులను సామ్యుల్ సిద్దం చేసేవాడు. ఇక డిజిటల్ బ్యాంకింగ్స్ సర్వీసెస్‌లోని అకౌంట్ల ర్యాండమ్ డేటా, కేవైసీ డాక్యుమెంట్లను మణికంఠ తయారు చేస్తుండగా.. కొట్టేసిన డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడానికి నకిలీ అకౌంట్లను షేక్ ఖాసీం సృష్టించేవాడు.

ఎవరైనా కస్టమర్ తమ ఏజెన్సీకి వస్తే వాళ్ల సిమ్ కార్డ్ యాక్టివేషన్ ఫెయిల్ స్టేటస్ చూపించే వాళ్లు. ఆ తర్వాత అదే పేరుతో వేర్వేరు సిమ్ కార్డులు వచ్చేలా చేసి.. బ్యాంకు డిజిటల్ కేవైసీ అప్‌డేట్ చేసే వాళ్లు. ఇక అక్కడి నుంచి తమ పని ప్రారంభించేవారు. అకౌంట్లో డబ్బులు పోయినా.. వేరే సిమ్ కార్డుకు మెసేజీలు వెళ్తుండటంతో కస్టమర్లకు అనుమానం వచ్చేదికాదు. ఎప్పుడో ఒకసారి బ్యాంకుకు వెళ్లి చెక్ చేస్తే తప్ప తమ అకౌంట్లో డబ్బులు మాయం అయిన విషయం కూడా అర్థం కాదు. ఒక బాధితుడు ఇలా డబ్బులు పోగొట్టుకోవడంతో ‘ఈ-పాయింట్ ఇండియా’పై అనుమానం వచ్చి ఫిర్యాదు చేశాడు. దీంతో అసలైన ‘ఈ-పాయింట్ ఇండియా’ యాజమాన్యం తమ ఏజెంట్‌పై బాధితుడితో కలసి ఫిర్యాదు చేసింది. సదరు ఏజెన్సీ నిర్వాహకులు నెల రోజుల వ్యవధిలో 9 బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 14.64 లక్షలు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.

‘ఈ-పాయింట్ ఇండియా’ కస్టమర్ల డేటాతో 149 బ్యాంక్ అకౌంట్ల వివరాలను సేకరించారు. ఆ కస్టమర్ల అడ్రస్, ఫోన్ నెంబర్లతో పాటు వారి పేరుపై ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేశారు. అలా 10వేల ఫింగర్ ప్రింట్స్ క్లోనింగ్ చేశారు. వీటితోనే డిజిటల్ లావాదేవీలు నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసులు చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 3.40 లక్షల నగదు, 2,500 నకిలీ ఫింగర్ ప్రింట్స్, 121 సిమ్ కార్డులు, 20 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

First Published:  17 Jun 2022 12:30 AM IST
Next Story