మోదీని నమ్మేదెలా..? కనీసం తెలంగాణను చూసైనా బుద్ధి తెచ్చుకోండి..
ఇటీవల కేంద్ర ప్రభుత్వ పరిధిలో 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీకి ధన్యవాదాలు చెబుతూనే ఆయన్ని నమ్మలేమంటూ చురకలంటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ యువత నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన ఈ ప్రకటన చేశారని చెప్పారు కేటీఆర్. ఎనిమిదేళ్లలో ఏం చేశారు..? గడచిన ఎనిమిదేళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో మోదీ అసలు ఏం చేశారని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటి వరకూ ఉద్యోగాల […]
ఇటీవల కేంద్ర ప్రభుత్వ పరిధిలో 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీకి ధన్యవాదాలు చెబుతూనే ఆయన్ని నమ్మలేమంటూ చురకలంటించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగ యువత నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన ఈ ప్రకటన చేశారని చెప్పారు కేటీఆర్.
ఎనిమిదేళ్లలో ఏం చేశారు..?
గడచిన ఎనిమిదేళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో మోదీ అసలు ఏం చేశారని ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పటి వరకూ ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసి, సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏడాదిన్నరలో 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం మరో మోసపూరిత హామీ అని విమర్శించారు కేటీఆర్. అది మరో “జుమ్లా” అని ట్వీట్ చేశారు.
వీటికి సమాధానం చెప్పండి..
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 60 లక్షల ఉద్యోగాల్లో అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఏయే విభాగాల్లో ఎంత మ్యాన్ పవర్ అవసరం, ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారనే విషయంపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఎనిమిదేళ్లుగా నిరుద్యోగ యువతను మోసం చేస్తూ, ఉద్యోగాల భర్తీ లేకుండా వారికి ఉపాధిని దూరం చేసినందుకు మోదీ సమాధానం చెప్పాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, వారి అస్తవ్యస్త ఆర్థిక పాలసీలకు ఓ దండం అంటూ సెటైర్లు వేశారు. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు, అదే సమయంలో ప్రైవేటు రంగంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన అనే హామీ ఏమైపోయిందనే విషయంపై ప్రధాని స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
తెలంగాణ ఎంతో మేలు..
భారత దేశంతో పోల్చి చూస్తే.. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ చాలా ముందు ఉందని చెప్పారు కేటీఆర్. గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో లక్షా 35వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. అదే స్థాయిలో 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో మోదీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఎన్ని చేశారు..? అని ప్రశ్నల ట్వీట్లతోనే ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉపాధి కల్పనలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు అందనంత ఎత్తులో ఉందని చెప్పారు. తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో ప్రైవేట్ రంగంలో 16 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు. మరి ఎనిమిదేళ్లలో ప్రైవేటు రంగంలో, కేంద్రం తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన 16 లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో భర్తీ చేయాలంటే మోదీకి ఎన్నేళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు.