Telugu Global
NEWS

రఘురామకృష్ణంరాజుపై హైకోర్టు ఆగ్రహం

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్‌ పేరుతో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, దాన్ని పూచీగా చూపి రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి రుణం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధ‌మని ఎంపీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయస్థానం.. అసలు ఫలానా విధానంలోనే రుణాలు […]

AP-High-court-angry-RRR
X

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్‌ పేరుతో ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, దాన్ని పూచీగా చూపి రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి రుణం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధ‌మని ఎంపీ తరఫు న్యాయవాది వాదించారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయస్థానం.. అసలు ఫలానా విధానంలోనే రుణాలు తీసుకోవాలని అజ్ఞాపించడానికి మీరెవరని పిటిషనర్‌ను ప్రశ్నించింది. రుణాలు తెచ్చి వాటిని ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నప్పుడు.. సంక్షేమ పథకాలు ఆగాలన్నది పిటిషనర్ ఉద్దేశమా అని కోర్టు నిలదీసింది.

ప్రభుత్వం తీరుపై సంతృప్తి చెంది రుణాలు ఇస్తుంటే.. రుణాలు తీసుకునే వారికి, ఇచ్చే వారికి లేని ఇబ్బంది మీకేంటని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌లో ఇప్పుడు తాము జోక్యం చేసుకుంటే.. భవిష్యత్తులో ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లను కూడా కోర్టుల్లో సవాల్ చేసేలా ఉన్నారంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది.

రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ఒక నిరర్ధకమైందని, ఇందులో ప్రజాప్రయోజనం లేదని, ఈ వ్యాజ్యంలో కోర్టు జోక్యం చేసుకుంటే ప్రజాహితం కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలను ప్రభావితం చేసినట్టు అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా ఉందా లేదా అన్నది చూసుకోవడానికి కేంద్రం ప్రభుత్వం, ఆర్‌బీఐ, కాగ్‌ ఉన్నాయి కదా మీకెందుకు అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది.

రుణాలు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రజలు ప్రభావితం అవుతారని ఎలా చెబుతారని, మీ తీరు చూస్తుంటే సంక్షేమ పథకాలను అడ్డుకోవడం కోసమే ఈ పిటిషన్ వేసినట్టుగా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా.. మేమేం కంపెనీల సెక్రటరీలం కాదు, హైకోర్టు జడ్జీలం, మీకు మరోసారి చెబుతున్నాం. ప్రభుత్వాలను మేం నడపలేం అంటూ హైకోర్టు మండిపడింది.

తాము ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోబోమని.. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లండి అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో తాను ఊహించినట్టే జరిగిందన్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రజాప్రయోజనం ఏముందని హైకోర్టు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

First Published:  16 Jun 2022 3:22 AM IST
Next Story