Telugu Global
NEWS

దేశవ్యాప్తంగా తెలుగు వాళ్లపై కేసీఆర్ ఫోకస్.. ఆ ప్రాంతాల్లో సర్వే

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సెటిలర్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే తెలుగు వాళ్లు ఉండే ప్రాంతాల నుంచి సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ కాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సెటిల్ అయిన తెలుగువారి మనోగతం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు చాలా […]

telangana-cm-kcr-focused-on-telugu-settlers-in-various-states-across-the-country
X

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సెటిలర్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే తెలుగు వాళ్లు ఉండే ప్రాంతాల నుంచి సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. తెలంగాణ, ఏపీ కాకుండా కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సెటిల్ అయిన తెలుగువారి మనోగతం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు చాలా బలమైన గ్రౌండ్ సిద్దం చేసుకుంటున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు వారి ప్రభావం అక్కడ ఎలా ఉందో తెలుసుకోవడానికి కేసీఆర్ డేటా తెప్పించుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా తెలంగాణకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లోని గ్రామాల్లో సర్వే చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని పలుమార్లు డిమాండ్ చేశారు. అది సాధ్యమయ్యే అవకాశాలు లేవు. కానీ బీఆర్ఎస్ పేరుతో వెళితే అక్కడి ప్రాంతవాసులు ఓట్లు వేస్తారా లేదా అనే అంశంపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఇటీవల తెలంగాణ ఆవిర్బావ దినోత్సంవం సందర్భంగా పలు జాతీయ పత్రికలకు కేసీఆర్ ఫ్రంట్ పేజి యాడ్స్ ఇవ్వడం వెనుక ఇదే కారణం ఉన్నదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కర్నాటక, మహారాష్ట్రలోని సరిహద్దు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారు. ఇటీవల రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, ఆ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దళిత బంధు, రైతు బంధు వంటి పథకాలు అక్కడి ప్రజలను విశేషంగా ఆకర్షించడం వల్లే ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతవాసులు కూడా గతంలో ఇలాంటి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ అనధికారికంగా అక్కడ ఒక పార్టీ కార్యాలయం కూడా తెరిచింది. మహారాష్ట్ర అసెంబ్లీకి 2019లో ఎన్నికలు జరిగినప్పుడు నల్‌గావ్, భోకార్, దెగ్లూర్, కిన్వత్, హథ్‌గావ్ సెగ్మెంట్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపాలని డిమాండ్లు వచ్చాయి.

మహారాష్ట్రకు చెందిన కొంత మంది నాయకులు స్వయంగా కేసీఆర్‌ను కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. అప్పుడు సున్నితంగా తిరస్కరించిన కేసీఆర్.. ఇప్పుడు అదే ప్రాంతాలపై దృష్టి పెట్టారు. అక్కడ ప్రజల మూడ్ ఎలా ఉన్నది, తెలుగు ప్రజలు బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తారా అనే విషయంపై కూడా అధ్యయనం చేయిస్తున్నారు. టీఆర్ఎస్ కనుక జాతీయ పార్టీగా మారితే, ఆ వెంటనే ఇలాంటి అభ్యర్థనలు మరిన్ని వస్తాయని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

ఇక మహారాష్ట్రలోని భివాండి, షోలాపూర్, రాజురా, ఔరంగాబాద్.. గుజరాత్‌లోని సూరత్.. ఢిల్లీ, ఒడిషాలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటకలోని కాలాబుర్గి, బీదర్ వంటి ప్రాంతాలతో పాటు గతంలో హైదరాబాద్ స్టేట్‌లో ఉండి.. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లోకి వెళ్లిన ప్రాంతాల్లో తప్పకుండా టీఆర్ఎస్‌కు ఆదరణ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అక్కడ ఈ సారి బీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను నిలబట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

కర్నాటకలో వచ్చే ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత ఆరు నెలలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా గుర్తించాలంటే నాలుగు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు రావాలి. లేదంటే తెలంగాణ కాకుండా మిగిలిన రెండు రాష్ట్రాల్లో కనీసం రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలి. సార్వత్రిక ఎన్నికల లోపు కర్నాటక ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి వాటిపై టీఆర్ఎస్ దృష్టి పెట్టి కనీసం రెండు సీట్లు గెలిస్తే.. తప్పకుండా జాతీయ పార్టీ హోదా దక్కుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.

మరోవైపు ఏపీలో కూడా కేసీఆర్‌కు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఒక వర్గం ఆయనకు మద్దతుగా ఉన్నది. గత ఎన్నికల సమయంలో కూడా టీఆర్ఎస్‌ను బరిలోకి దింపాలని ఏకంగా ఫ్లెక్సీలు కూడా కట్టారు. అయితే ఏపీలో.. వైసీపీని కాదని టీఆర్ఎస్ నేరుగా అభ్యర్థులను దింపుతుందా అనేది అనుమానమే. ఏపీ కాకుండా ఒడిషా, తమిళనాడు బార్డర్లో టీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపి.. ఒకటో రెండో సీట్లు గెలవాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది.

ఏదేమైనా టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చేందుకు కేసీఆర్ బలమైన వ్యూహంతోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నది. ఇందుకు గాను సరిహద్దు జిల్లాల్లోని నాయకత్వానికి సూచనలు చేసినట్లుగా కూడా తెలుస్తున్నది.

First Published:  15 Jun 2022 11:40 AM IST
Next Story