తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద మహిళా గవర్నర్లు
ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వాలకు, అక్కడి గవర్నర్లకు మధ్య పొసగకపోవడం, ఒకరి విధానాలు మరొకరికి నచ్చకపోవడంతో సయోధ్య కొరవడి వివాదాలు తలెత్తుతుండడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు ప్రాంతానికి వచ్చిన మహిళా గవర్నర్లు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుముద్ బెన్ జోషి గవర్నర్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చిన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు 2019 `సెప్టెంబర్ లో నియమితులైన తమిళి సై సౌందరరాజన్ ప్రస్తుతం గవర్నర్ గా కొనసాగుతున్నారు. తొలినాళ్ళలో […]
ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వాలకు, అక్కడి గవర్నర్లకు మధ్య పొసగకపోవడం, ఒకరి విధానాలు మరొకరికి నచ్చకపోవడంతో సయోధ్య కొరవడి వివాదాలు తలెత్తుతుండడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగు ప్రాంతానికి వచ్చిన మహిళా గవర్నర్లు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుముద్ బెన్ జోషి గవర్నర్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చిన్న రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు 2019 'సెప్టెంబర్ లో నియమితులైన తమిళి సై సౌందరరాజన్ ప్రస్తుతం గవర్నర్ గా కొనసాగుతున్నారు. తొలినాళ్ళలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సై సఖ్యతగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రాజ్‌భవన్, ప్రగతి భవన్‌కు మధ్య దూరం పెరిగి వివాదాలు ముసురుకున్నాయి.
కేంద్రంలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ ఆలోచన, అందుకు తగ్గ ప్రయత్నాలు కేంద్రం గమనించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి, ఆయన పార్టీ వర్గాలు విమర్శలు గుప్పించడం, రాను రానూ ఇవి పెరిగి పెద్దవై అగాథంగా మారింది. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ తిరస్కరించడం కూడా ఒక కారణం. అదీగాక రాజ్‌భవన్ గేటు ముందు ఫిర్యాదుల బాక్స్ ను ( గ్రీవెన్స్ బాక్స్) ఏర్పాటు చేయడం, మహిళల సమస్యలపై మహిళా దర్బార్ ను నిర్వహించడం ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య రగులుతున్న చిచ్చుకు మరింత ఆజ్యం పోశాయి. ఇలా ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య రగులుతున్న ఈ వివాదాలు 80 దశకం నాటి కుముద్ బెన్ జోషి గవర్నర్ గా పనిచేసిన రోజులను గుర్తుకు తెస్తున్నాయి.
కేంద్రంలో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కుముద్ బెన్ మణిశంకర్ జోషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆమె 1985 నవంబర్ 26 నుంచి 1990 ఫిబ్రవరి 7 వరకూ గవర్నర్ గా పనిచేశారు. ఆమె గవర్నర్ గా నియమితులైన సమయంలో రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కుముద్ బెన్ జోషి, తమిళిసై ఇద్దరూ వివాదాల విషయంలో ఒకే తీరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వీరిద్దరూ చైతన్యవంతమైన రాజకీయ నేపథ్యాల నుంచి వచ్చిన వారే. ఎన్నికైన ప్రభుత్వాల అధిపతుల ఆలోచనలకు విరుద్ధంగానే ఈ మహిళా గవర్నర్లు ఇద్దరూ రాజ్‌భవన్ నుంచి వ్యవహారాలను నడపాలనుకున్నవారే.
సీనియర్ కాంగ్రెస్ నేత కుమారి అనంతన్ కుమార్తెగా తమిళి సై చిన్నప్పటినుంచి రాజకీయాల పట్ల ఆసక్తితో పెరిగారు. విద్యార్ధి దశనుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న రోజుల్లో విద్యార్ధి నాయకురాలిగా వ్యవహరించారు. అనంతరం తమిళనాడు బీజేపీ వైద్య విభాగంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఇదే విభాగంలో జాతీయ స్థాయిలో కూడా నాయకత్వం వహించారు. 2007లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగానూ, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత 2013లో పార్టీ జాతీయ కార్యదర్శిగా పదోన్నతి పొందారు.
కుముద్ బెన్ జోషి
గుజరాత్ కు చెందిన కుముద్ బెన్ జోషి ఆంధ్రప్రదేశ్ కు రెండో మహిళా గవర్నర్ గా సేవలందించారు. తొలి మహిళా గవర్నర్ గా శారదా ముఖర్జీ (1977 మే 5 నుంచి 1978 ఆగస్టు 15) పనిచేశారు. తమిళి సై లాగానే కుముద్ బెన్ జోషి కూడా కాంగ్రెస్ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారే. ఆమె కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 1980 నుంచి 82 వరకూ సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రిగానూ, 1982 నుంచి 84 వరకూ వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రి గానూ పనిచేశారు.
గవర్నర్లుగా కుముద్ బెన్ జోషి, తమిళి సై ఇద్దరూ మహిళా సమస్యలపై చురుకుగానే వ్యవహరించారు. రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన కాలంలో కుముద్ బెన్ జోగిని వ్యవస్థను రూపుమాపేందుకు ప్రయత్నించారు. ఆమె పోరాటం ఫలితంగా 1988 లో అనాదిగా వస్తున్న జోగినీ వ్యవస్త రద్దయింది. అలాగే ఎంతో కాలంగా వ్యభిచార కూపంలో మగ్గుతున్న మహిళలకు పునరావాసం కల్పించారు. రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న రెడ్ క్రాస్ సంస్తను ఉత్తేజభరితంగా తీర్చిదిద్దారు. ఇందుకు అప్పటి ప్రభుత్వా|ధినేత ఎన్టీఆర్ నిధులు సమకూర్చకపోవడంతో ఆమె తన సామాజిక కార్యక్రమాల కోసం విరాళాల సేకరించారు. ఆమె రెండు స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి తన కార్యాలయం నుంచే నడిపేవారు. ఉమా గజపతిరాజు కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంలో కుముద్ బెన్ జోషి ప్రత్యక్షంగా పాల్గొనడం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు చాలా ఆగ్రహం కలిగించింది. రాజ్ భవన్ ను కాంగ్రెస్ కార్యాలయంగా మార్చేశారంటూ ఆయనతో పాటు పార్టీ వర్గాలు విమర్శించాయి. ఆమె రాష్ట్రంలోని 23 జిల్లాలను 108 సార్లు రికార్డు స్థాయిలో పర్యటించారు.
తమిళి సై కూడా..
తమిళి సై కూడా కుముద్ బెన్ జోషి మాదిరే రాష్ట్రంలో పర్యటించారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈమె పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్ మర్యాదలు పాటించలేదని, పర్యటనలకు కనీసం సదుపాయాలు కలిగించలేదని గవర్నర్ కినుక వహించారు. తమిళి సై సమ్మక్క సారలమ్మ ఉత్సవాలకు హాజరైనపుడు ప్రోటోకాల్ లేదని, అలాగే భద్రాద్రి ఆలయ సందర్శన సమయంలో ఆమె ప్రయాణానికి కనీసం హెలికాప్టర్ కూడా సమకూర్చలేదనే విమర్శలు ఉన్నాయి. వీటితో పాటు ఆమె యాదాద్రి, తదితర ఆలయాలను కూడా సందర్శించారు. ముఖ్యంగా కోవిడ్ ముమ్మరంగా ఉన్న సమయంలో వెరవకుండా తమిళి సై ఆస్పత్రులను కు వెళ్ళి రోగులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించారు. అలాగే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు కూడా గవర్నర్ తమిళి సై జోక్యం చేసుకుని కార్మిక నాయకులు, రవాణా శాఖ మంత్రి, అధికారులతో చర్చలు జరిపారు.
ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఫాంహౌస్ నుంచే పాలన సాగిస్తున్నారనే విమర్శలకు అవకాశం కలిగింది. తాజాగా నగరంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,అఘాయిత్యాలపై తమిళి సై ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పబ్ కు సంబంధించి ఒక బాలిక పై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించి ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. అధికార పార్టీ నాయకుల పిల్లలకు ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణల నేపద్యంలో గవర్నర్ నివేదిక కోరడం గమనార్హం.
కుముద్ బెన్ జోషి ఒకానొక సమయంలో ” కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు. కేంద్రం నిధులు పక్కాగా నిర్దేశిత పథకాలు, ప్రణాళికలకే ఉపయోగపడాలి.” అంటూ కేంద్రం తరఫున వకాల్తాగా మాట్లాడారు. ఈమె కాంగ్రెస్ ఏజెంటు అనే ముద్రను వేయించుకున్నారు. తమిళి సై కూడా నేడు తన వ్యవహార శైలితో కేంద్రంలోని బీజేపీ ఏజెంటుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గవర్నర్ల వ్యవస్థలో అప్పటికీ.. ఇప్పటికీ మారిందేంటబ్బా.. అంటే..కేంద్రంలోని ప్రభుత్వాలు తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్..!