Telugu Global
NEWS

బంగారు బాతులు భారత క్రికెటర్లు!

భారత క్రికెటర్లు ప్రపంచ క్రికెట్లోనే భాగ్యవంతులు. ఏడాదిపొడగునా క్రికెట్ ఆడుతూ రెండుచేతులా ఆర్జిస్తున్న మొనగాళ్లు. అయితే..రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత ఆటగాళ్లు సైతం శ్రమదోపిడీకి గురవుతున్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేని ప్రయివేటు ఉద్యోగుల జాబితాలో చేరిపోయారు. భారత క్రికెట్ నియంత్రణమండలి చేతిలో బంగారు బాతులుగా మారిపోయారు…… అహరహం శ్రమిస్తూ….పగలనకా రాత్రనకా క్రికెట్ ఆడేస్తూ…భారత క్రికెట్ నియంత్రణమండలిపాలిట బంగారుబాతులుగా మారిన టీమిండియా క్రికెటర్లు తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదంటూ వాపోతున్నారు. ప్రయివేటురంగ ఉద్యోగులమాదిరిగా శ్రమదోపిడీకి గురయ్యామంటూ […]

golden-ducks-indian-cricketers
X

భారత క్రికెటర్లు ప్రపంచ క్రికెట్లోనే భాగ్యవంతులు. ఏడాదిపొడగునా క్రికెట్ ఆడుతూ రెండుచేతులా ఆర్జిస్తున్న మొనగాళ్లు. అయితే..రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత ఆటగాళ్లు సైతం శ్రమదోపిడీకి గురవుతున్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేని ప్రయివేటు ఉద్యోగుల జాబితాలో చేరిపోయారు. భారత క్రికెట్ నియంత్రణమండలి చేతిలో బంగారు బాతులుగా మారిపోయారు……

అహరహం శ్రమిస్తూ….పగలనకా రాత్రనకా క్రికెట్ ఆడేస్తూ…భారత క్రికెట్ నియంత్రణమండలిపాలిట బంగారుబాతులుగా మారిన టీమిండియా క్రికెటర్లు తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదంటూ వాపోతున్నారు.

ప్రయివేటురంగ ఉద్యోగులమాదిరిగా శ్రమదోపిడీకి గురయ్యామంటూ ఆవేదన చెందుతున్నారు. భారత క్రికెట్ బోర్డు ఆడమంటే ఆడే మరబొమ్మలుగా, బంగారు బాతులుగా లోలోన కుమిలిపోతున్నారు.

క్రికెట్ రోబోలు…….

క్రికెట్ ఆటకు గతంలో ఓ సీజన్ అంటూ ఉండేది. అయితే…ప్రపంచీకరణ పుణ్యమా అంటూ ఈ పెద్దమనుషుల క్రీడ కాస్త బహుళజాతిసంస్థల వ్యాపార ప్రచార వాహకంగా మారిపోడంతో నెలకో టూరు, మూడువారాలకో సిరీస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

గతంలో ఏడాదికి 105 నుంచి 120 రోజులు వరకూ మాత్రమే భారత క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడుతూ ఉండేవారు. అయితే 2017 సీజన్లో అదికాస్త 120 రోజుల నుంచి 140 రోజులకు పెరిగిపోయింది.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ అవిశ్రాంతంగా మ్యాచ్ లు, సిరీస్ లు ఆడి మానసికంగా అలసిపోయాడు. చివరకు తన ఫామ్ నే కోల్పోయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకొనే పరిస్థితికి వచ్చాడు.

గత దశాబ్దకాలంగా తనకు విశ్రాంతి అంటూ లేకుండా పోయిందని…నిరంతర క్రికెట్ తో తీవ్రగా అలసిపోయానని…తానూ మనిషినేనంటూ ఈమధ్యనే విరాట్ కొహ్లీ తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ ఎంపిక సంఘం… గతంలో శ్రీలంకతో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ ల నుంచి కొహ్లీకి విశ్రాంతి ఇచ్చింది.

ఏడాదికి 50 మ్యాచ్ లు…

2018 వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఫ్యూచర్ టూర్ కార్యక్రమం ప్రకారం భారత క్రికెటర్లు ఏడాదికి సగటున 50 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాల్సిఉంది. ఇదీచాలదన్నట్లు…ఏడువారాల ఐపీఎల్ సీజన్…ఆటగాళ్లను పీల్చిపిప్పి చేయటం సాధారణ విషయమే. ఒక్కమాటలో చెప్పాలంటే …ఓవైపు రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ లాంటి దేశవాళీ క్రికెట్ టోర్నీలు, మరోవైపు అంతర్జాతీయ సిరీస్ లు, ఐపీఎల్ తో టీమిండియా క్రికెటర్లు… క్రికెట్ రోబోలుగా మారిపోయారు. బీసీసీఐ ఆడమన్నట్లుగా ఆడే మరబొమ్మలుగా తయారయ్యారు.

బీసీసీఐకి కాసుల వర్షం….

భారత క్రీడాభిమానుల క్రికెట్ పిచ్చిని సొమ్ము చేసుకోడంలో ఐసీసీ, బీసీసీఐ సఫలమయ్యాయి. పెద్దమనుషుల క్రీడ క్రికెట్ ను ఎలా లాభసాటి వ్యాపారంగా మార్చవచ్చునో ఐసీసీ సహకారంతో బీసీసీఐ చేసి చూపించింది.

భారత క్రికెటర్లు, టీమిండియా జట్లు అభిమానుల కోసం కాకుండా….స్టార్ స్పోర్ట్స్, సోనీ సిక్స్ లాంటి మీడియా సంస్థల కోసమే క్రికెట్ సిరీస్ లు ఆడుతున్నాయంటే అతిశయోక్తికాదు.

2016, 2017 సీజన్లలో ప్రసారహక్కులు, టీమ్, సిరీస్, దుస్తుల స్పాన్సర్ షిప్ ద్వారా 2100 కోట్ల రూపాయల చొప్పున బీసీసీఐ ఆర్జించింది. అంతేకాదు…2018 నుంచి 2022 వరకూ ఐపీఎల్ ప్రసారహక్కుల విక్రయం ద్వారా..రికార్డు స్థాయిలో 16వేల 347.50 కోట్ల రూపాయలు అందుకోనుంది. ఇంత భారీమొత్తంలో ఆదాయం వస్తున్నా బీసీసీఐ మాత్రం క్రికెటర్లకు న్యాయంగా అందాల్సిన వాటా ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతోంది.

క్రికెటర్ల శ్రమ దోపిడీ….

భారత క్రికెట్ నిబంధనల ప్రకారం వివిధ రూపాలలో బీసీసీఐకి ఏటా వచ్చే మొత్తం ఆదాయంలో 26 శాతం క్రికెటర్లకు ఇవ్వాల్సి ఉండగా…కేవలం 8 నుంచి 15 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంటోంది. క్రికెటర్ల శ్రమను నిలువునా..ఘరానాగా దోచుకొంటోంది.

క్రికెటర్లను ఓవైపు పీల్చిపిప్పి చేస్తూ సంపాదించిన వేలకోట్ల రూపాయల ఆదాయంలో…చాలా భాగాన్ని వివిధ క్రికెట్ సంఘాలు, బోర్డు పెద్దలు దుబారా చేయటాన్ని, విలాసాలకు ఖర్చు చేయటాన్ని…సుప్రీంకోర్టు నియమించిన బీసీసీఐ పాలకమండలి గతంలోనే బయటపెట్టింది.

వర్క్ లోడ్ తగ్గించడం సాధ్యమేనా?….

2019 నుంచి 2023 సీజన్ వరకూ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం ద్వారా భారత అంతర్జాతీయ క్రికెటర్లకు తగిన విశ్రాంతి, ఉపశమనం లభించేలా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ పాలకమండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఏడాదికి 50 మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియా రానున్న సీజన్ నుంచి ఏడాదికి 32 మ్యాచ్ లు మాత్రమే ఆడేలా కార్యక్రమం ఖరారు చేయాలన్న పట్టుదలతోఉంది. ప్రస్తుతం ఉన్న 140 రోజుల అంతర్జాతీయ క్రికెట్ ను…80రోజులకు కుదించాలని కూడా నిర్ణయించింది. దీనికితోడు ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు…15రోజులపాటు విశ్రాంతి ఉండేలా కూడా చర్యలు చేపట్టింది. ఈ ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చితే…క్రికెటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లాంటి అసాధారణ ఆటగాళ్ళ జీవితకాలం మరింతగా పొడిగించుకొనే అవకాశం ఉంటుంది. లేకుంటే బంగారు బాతుగుడ్డు కథగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.

First Published:  14 Jun 2022 12:44 AM GMT
Next Story