కేటీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు.. బండికి కోర్టు ఆదేశం..
బండి సంజయ్ పై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై బండి సంజయ్, కేటీఆర్ పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఆయన పరువుకి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలేంటీ వివాదం.. ఆమధ్య ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేటీఆర్ ని కార్నర్ చేసేలా బండి […]
బండి సంజయ్ పై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై బండి సంజయ్, కేటీఆర్ పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఆయన పరువుకి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అసలేంటీ వివాదం..
ఆమధ్య ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేటీఆర్ ని కార్నర్ చేసేలా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో 27మంది ఇంటర్ విద్యార్థుల మరణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ కారణం అంటూ ప్రజా సంగ్రామ యాత్రలో వ్యాఖ్యలు చేశారు, ఆ తర్వాత ట్విట్టర్లో కూడా విమర్శలు చేశారు. సంజయ్ వ్యాఖ్యలను అప్పట్లోనే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తన పరువుకి నష్టం కలిగించేలా బండి సంజయ్ ట్వీట్ చేశారని కేటీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పేలా బండి సంజయ్ ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బండి సంజయ్ ని ఆదేశించింది.
గతంలో రేవంత్ రెడ్డికి కూడా..
గతంలో రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ ఇలాగే పరువు నష్టం దావా దాఖలు చేశారు. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవాహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులతో కేటీఆర్ కి సంబంధం ఉందంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. డ్రగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్, రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో కూడా కేటీఆర్ పరువుకి భంగం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డికి సిటీ సివిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. తాజాగా బండి సంజయ్ వ్యవహారంలో కూడా ఇలాగే ఆదేశాలిచ్చింది.