Telugu Global
NEWS

సాదాసీదాగా నడ్డా ప్రసంగం, జగన్‌ ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారి పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. విజయవాడలో బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖుల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నడ్డా హిందీ ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని నడ్డా విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని కేంద్రం తెస్తే.. దాన్ని జగన్‌ ఆరోగ్య శ్రీగా మార్చేశారని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని.. ఆరోగ్య శ్రీ పథకం రాష్ట్రం […]

సాదాసీదాగా నడ్డా ప్రసంగం, జగన్‌ ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు
X

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారి పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. విజయవాడలో బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖుల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నడ్డా హిందీ ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని నడ్డా విమర్శించారు.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని కేంద్రం తెస్తే.. దాన్ని జగన్‌ ఆరోగ్య శ్రీగా మార్చేశారని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని.. ఆరోగ్య శ్రీ పథకం రాష్ట్రం దాటితే పనిచేయదన్నారు. రైతులకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న డబ్బును కూడా జగన్‌ ప్రభుత్వం తమ పథకంగా చెప్పుకుంటోందన్నారు. అయితే తన ప్రస్తుత ప్రసంగంలో ఏపీ ప్రభుత్వంపై నడ్డా మరీ తీవ్రతనేమీ ప్రదర్శించలేదు. ఏపీలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ..

కుటుంబ పార్టీలతో పోరాటం చేస్తోందన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌లు కుటుంబ పార్టీలని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల పార్టీగా కాకుండా అన్నాచెల్లి పార్టీగా మారిందన్నారు. కింది స్థాయి కార్యకర్త కూడా ఎంత స్థాయికైనా ఎదిగే అవకాశం ఒక్క బీజేపీలో మాత్రమే ఉంటుందన్నారు. ఆత్మకూరులో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి భరత్‌ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ప్రతి కార్యకర్త, నాయకుల ఇళ్ల మీద బీజేపీ జెండా ఉండాలన్నారు. ప్రతి రోజూ కొత్తగా ఐదుగురు వ్యక్తులను కలిసి వీలైతే వారిని పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. కొన్ని పార్టీలకు సంకల్పం ఉన్నా పాలసీలు ఉండవని, పాలసీ ఉంటే వాటిని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఉండదని, నాయకత్వం ఉన్నా కార్యకర్తలు ఉండరని..కానీ బీజేపీకి మాత్రం సంకల్పం, పాలసీలు, నాయకత్వం, కార్యకర్తలు అన్నీ ఉన్నాయన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి బీజేపీ అవసరం ఎంతో ఉందన్నారు. రాష్ట్రంలోని 46వేల పోలింగ్‌ బూత్‌లున్నాయని… అన్ని పోలింగ్ బూతులకు కమిటీలను నియమిస్తామన్నారు. ప్రతి పోలింగ్‌బూతు స్థాయిలో సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. అన్ని కులాలు, మతాల వారితో బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. మైనార్టీలు అంటే కేవలం ముస్లింలే కాకుండా బౌద్దులను, జైనులను, సిక్కులను ఇలా అందరినీ పార్టీలో చేర్చుకోవాలన్నారు. బీజేపీ అన్నది ఒక వర్గానికి చెందినది కాదన్నారు.

నడ్డా ప్రసంగం కొనసాగుతుండగా.. కొందరు లేచివెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని పురందేశ్వరి వారించారు. నడ్డా ప్రసంగం అయిపోయే వరకు ఎక్కడికి వెళ్లవద్దని.. మంచినీళ్లు కావాలంటే మీ దగ్గరకే వస్తాయని ఆమె సూచించారు.

First Published:  6 Jun 2022 9:26 AM IST
Next Story