జైల్లో ఎమ్మెల్సీ అనంతబాబు ఫైటింగ్ సీన్..? వాస్తవం ఏంటి..?
కారు డ్రైవర్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఆయనకు అక్కడ రాచమర్యాదలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తోటి ఖైదీలతో అనంతబాబు గొడవ పడ్డారని, దాడిలో ఒకరికి గాయం అయిందని, అయితే అదేమంత పెద్ద గాయం కాకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని కూడా కథనాలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఈ పుకార్లు షికార్లు చేస్తుండగా.. జైళ్ల శాఖ స్పందించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలి కానీ, […]
కారు డ్రైవర్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఆయనకు అక్కడ రాచమర్యాదలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. తోటి ఖైదీలతో అనంతబాబు గొడవ పడ్డారని, దాడిలో ఒకరికి గాయం అయిందని, అయితే అదేమంత పెద్ద గాయం కాకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని కూడా కథనాలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఈ పుకార్లు షికార్లు చేస్తుండగా.. జైళ్ల శాఖ స్పందించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలి కానీ, అవాస్తవాలతో కట్టుకథలు అల్లి, లేనిని ఉన్నట్టు చెప్పడం సరికాదని అంటున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్సీ అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో సింగిల్ సెల్ లో ఉంచినట్టు తెలిపారు రాజారావు. సెక్యూరిటీ రీత్యా ఆ సెల్ బయట 24 గంటలూ సిబ్బంది పహారా ఉందని చెప్పారు. ఆయనను వేరుగా ఉంచినందున.. తోటి ఖైదీలతో ఘర్షణ పడే అవకాశమేదీ లేదని స్పష్టం చేశారు రాజారావు. ఇక సదుపాయాల విషయానికొస్తే.. ఇతర ఖైదీలకు కల్పించే వసతులనే ఆయనకు కూడా కల్పించామని.. పడుకునేందుకు పరుపు ఇచ్చామనేది అవాస్తవం అని చెప్పారు. దిండు, దుప్పటి, రగ్గు మాత్రమే ఇచ్చామని ఇతర ఖైదీల మాదిరిగానే మెనూలో ఉన్న ఆహార పదార్థాలనే ఇస్తున్నట్టు చెప్పారు.
ఫోన్ ఇచ్చేంత అవకాశం ఉందా..?
అనంతబాబును కలిసేందుకు వస్తున్న వారికి నిబంధనల ప్రకారమే ములాఖత్, ఇంటర్వ్యూ అవకాశాలిస్తున్నట్టు చెప్పారు జైలు సూపరింటెండెంట్ రాజారావు. ఆయనను కలవడానికి వచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేసుకుని, ఆధార్ కార్డు పరిశీలించాకే లోపలికి పంపిస్తున్నట్టు తెలిపారు. ములాఖత్ కు వచ్చిన వారి ఫోన్ తీసుకుని అనంతబాబు ఎవరెవరికో కాల్స్ చేస్తున్నారనే వార్తల్ని కూడా ఆయన ఖండించారు.
అనంతబాబు అరెస్ట్ విషయంలో కూడా గతంలో ఇలాంటి పుకార్లు వినిపించాయి. ఆయనను పోలీసులు కేసు నుంచి తప్పించడానికి చూస్తున్నారని, ఆయన రాష్ట్రం దాటి వెళ్లిపోయారని, బాధితులతో రాజీ కోసం ప్రయత్నిస్తున్నారని, వేరే వారిని ఈ కేసులో ఇరికించబోతున్నారనే కథనాలు వినిపించాయి. అనంతబాబు అరెస్ట్ తో అవన్నీ తప్పని తేలిపోయాయి. ఆయన కూడా తానే నేరం చేసినట్టు అంగీకరించారు. ఇప్పుడు జైలు విషయంలో వస్తున్న కథనాలు కూడా అవాస్తవాలని చెబుతున్నారు అధికారులు.