రౌడీలతో స్నేహం, రాష్ట్రస్థాయి క్రీడాకారుడి హత్య
విజయవాడలో రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీ షీటర్లు కలిసి పనిచేస్తున్న తీరు విజయవాడ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గ్యాంగ్‌ల మధ్య ఏర్పడిన వివాదాలతో ఆ గ్యాంగ్‌లతోనే సంబంధాలున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు దీపక్ ఆకాశ్ హత్యకు గురయ్యాడు. ఇతడు పలు పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. అదే సమయంలో విజయవాడలోని రౌడీషీటర్లతో కలిసి తిరిగేవాడు. వాంబేకాలనీకి చెందిన రౌడీషీటర్ శంకర్ అలియాస్ టోనీ తన ప్రేయసి తనతో సరిగా […]
విజయవాడలో రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీ షీటర్లు కలిసి పనిచేస్తున్న తీరు విజయవాడ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ గ్యాంగ్‌ల మధ్య ఏర్పడిన వివాదాలతో ఆ గ్యాంగ్‌లతోనే సంబంధాలున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు దీపక్ ఆకాశ్ హత్యకు గురయ్యాడు. ఇతడు పలు పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. అదే సమయంలో విజయవాడలోని రౌడీషీటర్లతో కలిసి తిరిగేవాడు.
వాంబేకాలనీకి చెందిన రౌడీషీటర్ శంకర్ అలియాస్ టోనీ తన ప్రేయసి తనతో సరిగా ఉండడం లేదంటూ సోమవారం రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించే నిమితం.. దీపక్ ఆకాశ్, గోపికృష్ణ ఆస్పత్రికి వచ్చారు. ఆకాశ్, గోపికృష్ణ ఇద్దరూ టోని గ్యాంగ్ సభ్యులే. వీరిద్దరికి ఒక అమ్మాయి విషయంలో రెండేళ్లుగా గొడవ నడుస్తోంది.
టోని మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో వీరు పక్కనే ఉన్న ఒక మద్యం షాపుకు వెళ్లి అక్కడే మద్యం సేవించారు. ఆ సమయంలోనే ఆకాశ్, అతడి స్నేహితులు కలిసి గోపికృష్ణతో గొడవకు దిగారు. తనను ఒక్కడిని చేసి గొడవకు వస్తారా మీ సంగతి తేలుస్తా అంటూ గోపికృష్ణ వెళ్లిపోయాడు. రాత్రి 9 గంటల సమయంలో బాగా మద్యం సేవించిన దీపక్ ఆకాశ్‌ను అతడి స్నేహితులు బైక్‌పై తీసుకెళ్లి… గురునానక్ కాలనీలోని అతడి గదిలో దింపేసి వెళ్లిపోయారు.
కాసేపటి గోపికృష్ణ తన స్నేహితులతో కలిసి దీపక్ ఆకాశ్ నిద్రిస్తున్న గదికి వచ్చాడు. అక్కడే ఉన్న మరో యువకుడిని బెదిరించి పంపించేశారు. అనంతరం గదిలోకి వెళ్లి నిద్రిస్తున్న ఆకాశ్‌పై విచక్షణారహితంగా కత్తులతో పొడిచేశారు. మెడ భాగం నుంచి పొట్ట వరకు 18 కత్తిపోట్లు పడ్డాయి. దాంతో ఆకాశ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆకాశ్‌ను హత్య చేసేందుకు గోపికృష్ణ వెంట వచ్చిన వారు బ్లేడ్ బ్యాచ్ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడలో దాదాపు 200 మంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులున్నారు. పోలీసుల రికార్డుల్లో లేని వారు చాలా మంది ఉన్నారు. వీరు ప్రాంతాలను పంచుకుని మరీ చెలరేగిపోతున్నారు. అప్పుడప్పుడు ఇలా హత్యలకు కూడా తెగిస్తున్నారు.