Telugu Global
WOMEN

వినోదరంగంలో ఉన్నత పదవుల్లో స్త్రీలు చాలా తక్కువ

మహిళలు చాలా రంగాల్లో మగవారితో సమానంగా ప్రగతి సాధిస్తున్నా... నేటికీ కొన్ని ఉద్యోగాల్లో వారి సంఖ్య చాలా తక్కువగా నిరాశాజనకంగా ఉంటోంది. మీడియా, వినోద రంగాల్లో మహిళల స్థాయి అలాగే ఉంది. కేవలం 13శాతం మంది మహిళలు మాత్రమే సీనియర్, నాయకత్వ హోదాల్లో పనిచేస్తున్నారు.

వినోదరంగంలో ఉన్నత పదవుల్లో స్త్రీలు చాలా తక్కువ
X

వినోదరంగంలో ఉన్నత పదవుల్లో స్త్రీలు చాలా తక్కువ

మహిళలు చాలా రంగాల్లో మగవారితో సమానంగా ప్రగతి సాధిస్తున్నా... నేటికీ కొన్ని ఉద్యోగాల్లో వారి సంఖ్య చాలా తక్కువగా నిరాశాజనకంగా ఉంటోంది. మీడియా, వినోద రంగాల్లో మహిళల స్థాయి అలాగే ఉంది. కేవలం 13శాతం మంది మహిళలు మాత్రమే సీనియర్, నాయకత్వ హోదాల్లో పనిచేస్తున్నారు. ‘ఓ ఉమేనియా’ అనే అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రైమ్ వీడియో సపోర్టుతో... ఆ సంస్థతో పాటు కొన్ని ఇతర మీడియా సంస్థలు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. భారత మీడియా రంగంలో కంటెంట్ ప్రొడక్షన్, మార్కెటింగ్, కార్పొరేట్ లీడర్ షిప్ తదితర అంశాల్లో అధ్యయనాన్ని నిర్వహించారు.

మీడియా, వినోద రంగాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న 25 కంపెనీల్లో డైరక్టర్, చీఫ్ ఎక్స్ పీరియన్స్ ఆఫీసర్ హోదాల్లో పనిచేస్తున్న 135 మందిని అధ్యయనం కోసం పరిశీలించగా వారిలో కేవలం 13శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. డైరక్షన్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, రైటింగ్, ప్రొడక్షన్ డిజైన్ అంశాల్లో పరిశీలించగా 780 హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ పోస్టుల్లో 12 శాతం మంది మహిళలుండటం గమనించారు. అయితే 2021లో ఈ సంఖ్య మరింత తక్కువగా 10శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు కొద్దిస్థాయిలో పెరిగింది. ఓటీటీల్లో ప్రసారమవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ ల్లో ఉన్నత హోదాల్లో మహిళల సంఖ్య స్వల్ప స్థాయిలో పెరుగుతుండగా థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాల విషయంలో ఉన్నత స్థాయిల్లో ఉన్న స్త్రీల సంఖ్య స్వల్పంగానే ఉంటోంది.

సినిమాల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచడంపై జరుగుతున్న కృషిలో భాగంగా బెక్ డెల్ టెస్ట్ అనే విధానాన్ని అంతర్జాతీయంగా పాటిస్తున్నారు. ఈ పరీక్ష ప్రకారం సినిమాలో రెండు ప్రధాన మహిళా పాత్రలు... మగవారి ప్రస్తావన లేకుండా మగవారి గురించి కాకుండా.. ఏదైనా అంశంపైన సంభాషించుకునే సన్నివేశం ఒక్కటైనా ఉండాలి. కార్టూనిస్ట్, రచయిత అయిన అలిసన్ బెక్ డెల్ 1985లో దీనిని ప్రతిపాదించాడు.

థియేటర్లలో విడుదలైన సినిమాల్లో సగానికి పైగా సినిమాలు బెక్ డెల్ పరీక్ష విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. ఈ విషయంలో ఫెయిల్ అయిన సినిమాల సంఖ్య 2021లో కంటే 2022లో మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల ట్రయిలర్లలో కూడా మహిళల టాక్ టైమ్ చాలా తక్కువగా ఉంటోంది.

వినోద రంగం చాలా శక్తిమంతమైనదని, స్త్రీపురుష సమానత్వ అంశాలను ఈ రంగం ద్వారా చూపించడంతో మనం అనుకున్నది వేగంగా సాధించే అవకాశం ఉంటుందని ఫిల్మ్ కంపానియన్ స్థాపకురాలు ఎడిటర్ అనుపమా చోప్రా అన్నారు.

తమ సంస్థలోనే కాకుండా సృజనాత్మక రంగంలో పనిచేస్తున్న అన్ని సంస్థల్లోనూ ప్రతిభావంతులైన మహిళలను ప్రోత్సహించి వారి సాధికారతని పెంచడమే తమ లక్ష్యమని ప్రైమ్ వీడియో... భారత్, ఆగ్నేయాసియా హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, అపర్ణ పురోహిత్ అన్నారు. ఓ ఉమేనియా నివేదికకు మీడియా వినోద రంగంలోని ఇతర సంస్థలు సైతం మద్ధతు తెలిపాయి.

First Published:  28 Oct 2023 9:29 AM GMT
Next Story