మహిళల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఒకే ఒక్క సమస్య ఏంటంటే..
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి.
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా ఊబకాయం. ఈ అధిక బరువు వల్ల మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో చూద్దాం.
ఒబేసిటీ అందరికీ ఒకేలాంటి ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ మహిళల్లో ఇంక కొన్ని ప్రత్యేక సమస్యలు వస్తాయి. అధిక శరీర కొవ్వు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను దెబ్బతీస్తుంది. దీనివల్ల రోగ నిరోధక వ్యవస్థ బాధితుల్లోని క్యాన్సర్ కణాలను గుర్తించడంలో, దాడి చేయడంలో విఫలం అవుతుంది. ఎలా అయితే హార్మోన్ అసమతుల్యత కారణంగా అధిక బరువు వస్తుందో అలాగే స్త్రీలల్లో ఊబకాయం హార్మోనల్ హెచ్చుతగ్గులకు తిరిగి కారణం అవుతుంది.
శరీరంలోని కొవ్వు కణాలు ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఋతు చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది . అయితే శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నప్పుడు, శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అదనపు ఈస్ట్రోజెన్ గర్భాశయం లైనింగ్ చాలా మందంగా మారడానికి కారణమవుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌గా మారుతుంది.
అలాగే మరొక ముఖ్యమైన అంశం ఇన్సులిన్ నిరోధకత. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడే హార్మోన్ అయిన ఇన్సులిన్‌కు శరీర కణాలు తక్కువగా స్పందించినప్పుడు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందడానికి, అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే పక్షవాతం కూడా అధిక బరువు కారణంగా మధ్యవయసులోనే వచ్చే ముప్పు పెరుగుతోంది.
ఇలాంటి సమస్యలు రాకుండా, ఆరోగ్యకరమైన శరీర బరువుకోసం తగిన వ్యాయామాలు చేయడంతోపాటు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఇతర సమస్యలను నివారించవచ్చునని నిపుణులు చెప్తున్నారు.