Telugu Global
WOMEN

యూత్‌ఫుల్‌ థాట్‌... పరిమళించిన 'హూవు'

యశోద, రేయా కారుటూరి అక్కాచెల్లెళ్లు. ఒకరు యూఎస్, సెయింట్‌ లూయీలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. మరొకరు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివారు. పైగా వీరిద్దరికీ పూలతో మంచి సాన్నిహిత్యం ఉంది.

యూత్‌ఫుల్‌ థాట్‌... పరిమళించిన హూవు
X

ఉదయాన్నే పేపర్‌ వచ్చి వాకిట్లో వాలుతుంది. పాల ప్యాకెట్‌ కూడా తలుపు తీసే లోపు మనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నుంచి తాజా పూలు కూడా మీరు నిద్రలేచి స్నానం ముగించుకునే లోపు మీ వాకిటి ముందుకు వచ్చేస్తాయి. ఒక ఆలోచన ఓ కొత్త మార్పుకు నాంది అవుతుంది. బెంగళూరులో ఇద్దరు యువతులకు వచ్చిన ఆలోచన కోట్లాదిరూపాయల వ్యాపారంగా మారింది.

యశోద, రేయా కారుటూరి అక్కాచెల్లెళ్లు. ఒకరు యూఎస్, సెయింట్‌ లూయీలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. మరొకరు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివారు. పైగా వీరిద్దరికీ పూలతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పూలలో పుట్టి పెరిగారు. వాళ్ల నాన్న రామ్‌ కారుటూరికి కెన్యా, ఇథియోపియా, ఇండియాల్లో పెద్ద పెద్ద తోటలున్నాయి. కెన్యాలో ఉన్న ఆ రోజాపూల తోట విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా 90దశకంలో గుర్తింపు పొందింది. ఇలా ఈ అమ్మాయిలిద్దరూ ఫ్లవర్‌ ఇండస్ట్రీని, ఈ ఇండస్ట్రీలో జరిగే పొరపాట్లను కూడా చూస్తూ పెరిగారు.


చెట్టు నుంచి విడివడడం నుంచి వినియోగంలోకి వచ్చే లోపు పువ్వు ఎన్ని దశల్లో ఆటుపోట్లకు ఎదురవుతుందో వాళ్లకు తెలుసు. ఎన్ని పూలు వృథా అవుతాయో కూడా తెలుసు. మరొక వైపు సామాన్యులు రెక్కలు రాలని తాజా పూల కోసం పడే ఇబ్బందులూ తెలుసు. ఈ రెండింటినీ మేళవించి ఒక బిజినెస్‌ ప్లాన్‌ డెవలప్‌ చేశారు. దాని పేరు 'హూవు', అంటే పూవు అని అర్థం.

సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే ఇంటికి పూలు

ఆన్‌లైన్‌లో హూవు పోర్టల్‌లోకి వెళ్లి నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని, మీకు రోజుకు ఎన్ని పూలు కావాలి, ఏ పూలు కావాలి అనే వివరాలనిస్తే చాలు. నెల మొత్తం మీ ఇంటికి తాజా పూలు వస్తాయి. ఇందుకోసం ఈ అక్కాచెల్లెళ్లు కర్నాటక, కేరళ, తమిళనాడుల నుంచి యాభై మంది పూల రైతులతో అనుసంధానమయ్యారు. పూలను సేకరించి పన్నెండు గంటల నుంచి 24 గంటల్లోపు సబ్‌స్క్రైబర్లకు చేరుస్తారు. చేర్చే ముందు కొంత ప్రాసెసింగ్‌ కూడా ఉంటుంది. పూలను గ్రేడ్‌ చేసి బ్యాక్టీరియా పోయేటట్లు శుభ్రం చేసి, తేమ లేకుండా ఆరబెట్టి ప్యాక్‌ చేస్తారు. ఇలా చేసిన పూలకు ఆయా జాతిని బట్టి షెల్ఫ్‌ లైఫ్‌ రెండు రోజుల నుంచి 15 రోజుల వరకు ఉంటుంది.

పూల వ్యాపారం చేసిన వాళ్లు కోట్లలో ఉంటారు. కానీ పూల వ్యాపారానికి మోడరన్‌ టెక్నాలజీ తావిని అద్ది కోట్లాదిరూపాయల రాబడిని చూస్తున్నారు ఈ యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌. వ్యాపారాన్ని పరిమళింప చేసుకున్నారు.

First Published:  22 Dec 2022 4:27 PM IST
Next Story